నటవిశ్వరూపం - నవ గౌరవం (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 3వ భాగం)

 "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" శీర్షికలోని మొదటి టపాలో కూతురి బడికోసం పడ్డ పాట్లు, ఎల్కేజీలో జరిగిన ఆన్లైన్ క్లాసుల గురించి కబుర్లు చెప్పుకున్నాం.

 https://madilomucchatlu.blogspot.com/2021/09/blog-post.html

ముప్ఫై ఏళ్ళ తర్వాత మళ్లీ... (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 1వ భాగం)



రెండవ టపాలో యూకేజీలో మొదటిసారి బడి అనుభవాలు, కూచిపూడి రుచి తెలుసుకున్నాం.

https://madilomucchatlu.blogspot.com/2022/05/2.html

కాస్తంత బడి - కూస్తంత కూచిపూడి (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 2వ భాగం)


ఇది మూడవ భాగం. ఇప్పుడు 2013 మార్చి. మా అమ్మాయి ఒకటవ క్లాస్ లో ఉంది.

        ఆరో పుట్టినరోజు కేకు రుచి చూసిందో లేదో, మా అమ్మాయి ప్రవర్తన ఉన్నట్టుండి మారిపోయింది. అంతవరకు పిల్ల చేష్టలు, పిల్ల హావభావాలు, పిల్ల అలవాట్లు ఉండేవా? ఉన్నట్టుండి గంటకొట్టినట్టు పెద్దపిల్లలా ప్రవర్తించటం మొదలుపెట్టేసింది! మన మాటల్లో పాలుపంచుకొనే ప్రయత్నాలు, ఇంట్లో అందరికీ సాయం చేసేయాలని తాపత్రయం, తన పనులు తనే చేసుకోగలగటం, కొన్ని చేసుకోలేకపోయినా "చేసేయగలను" అనేసుకోవటం, ఏమైనా అంటే చిన్నబుచ్చుకోవటం, మన జోకులు అర్థమైపోవటం, కుదిరితే మనమీదే ఎదురు జోకులు పేల్చేయటం, అన్ని పండుగలూ, శుభకార్యాలూ అర్థమైపోవటం, శుభవార్తలు-దుర్వార్తలు తేడా తెలిసిపోవటం, ఔచిత్యం తెలిసి మాట్లాడటం... ఇవన్నీ చూస్తుంటే ఒక సాటి పెద్దమనిషికి ఇవ్వాల్సిన మర్యాద దానికి ఇచ్చేయాల్సివస్తోంది!

            టీచర్లను అనుకరించటం అదివరకు కూడా ఉండేది. కానీ ఈమధ్య ఆ అనుకరణలో కూడా మార్పులు వచ్చాయి. యూకేజీలో ఉన్నప్పుడు ఒక్కరే టీచర్ అన్ని సబ్జెక్ట్స్ కీ. ఆవిడ వాళ్లింట్లో తక్కువ, మా ఇంట్లో ఎక్కువ ఉంటున్నారు అనిపించేంతగా ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిమీద ఉండేది. ఇప్పుడు ఒకటో క్లాస్ లో ఒకొక్క సబ్జెక్ట్ కి ఒకొక్క టీచర్ కదా? ఇక చూడాలి మేడమ్ గారి బహుముఖ నటనా కౌశలం. ఒకొక్కరికి పాఠం మార్చటమే కాక స్వరభేదం కూడా ప్రదర్శిస్తోంది. విచిత్రం ఏమిటంటే, చెప్పేది ఏ సబ్జెక్ట్ అయినా పాఠాలు చెప్పేకంటే కోపం ప్రదర్శించటమే ఎక్కువ! పేరుపేరునా అటెండెన్స్ వేస్తూ, మూడు-నాలుగు పేర్లకి ఒకసారి తలెత్తి కళ్ళజోడు పైనుంచి చూసి, "ఓ, ఆబ్సెంటా?" అని, అక్కడ 'ఏ' పెడుతుంది.

        నోట్స్ దిద్దుతూ, అందులో ఘోరమైన తప్పులు రాస్తారో ఏమో, నిట్టూరుస్తుంది, విసుగుతో బుసలు కొడుతుంది, బుర్ర గోక్కుంటుంది, మధ్యమధ్యలో "హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ టు టెల్ యూ?" అని అరుస్తుంది ఇంట్లో అందరూ ఉలిక్కిపడేలా. ప్రిన్సిపాల్ మేమ్ దగ్గరకి తీసుకువెళ్తానంటుంది. ఒకరోజైతే ఏకంగా నలభై నిముషాలు క్లాస్ లో ఉన్న మగపిల్లలందరికీ రేవు పెట్టింది. ఆడపిల్లలు అన్ని ఆన్సర్లూ ఇస్తున్నారట, వాళ్ళని చూసి నేర్చుకోమని నొక్కి వక్కాణిస్తూ, అందులోనూ ఒక ముగ్గురు మగపిల్లల్ని మాటలతోనే మరింత ఉతికి ఆరేసింది.

           ఒకసారైతే అటుతిరిగి ఏదో పాఠం చెప్తోంది. మా ఆయన యథాలాపంగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చోబోతుంటే, "నాన్నా, అక్కడ కుర్చుంటున్నావేంటి? వాళ్ళు కూర్చున్నారు కదా?" అంది. గతుక్కుమని గుటకమింగి, మా ఆయన అన్నారు, "చంద్రముఖి సినిమాలో జ్యోతిక నిండు రాజసభను ఊహించుకున్నట్టే, ఇది కూడా ఊహించుకుంటున్నట్టుంది, వెధవ గోల!" అనుకొని క్లాస్ ని డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపోయారు. మళ్లీ ఎప్పుడైనా హాల్లోకి వస్తే, క్లాస్ జరగట్లేదు కదా అని రూఢీ చేసుకొని భయంభయంగానే వస్తున్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్