నయా "గారం"
ఈనాటి కోరిక కాదు ఇది. చిన్నతనంలో దాని గురించి విన్నప్పటి నుండి ఎందుకో అదంటే ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. రెండేళ్ళ క్రితం వరకు "ఆ...ఇది జరుగుతుందా, పెడుతుందా?" అనుకునేదాన్ని. కానీ జరుగుతుంది అని తెలిశాక, కొన్ని నెలలుగా "ఎప్పుడెప్పుడా?" అనుకుంటూ గడిపాను. తీరా కన్ను మూసి తెరిచేసరికి ఐపోయింది..అని ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు. 'నయాగరా జలపాతం'...ఎటువంటి 'మూడ్' లో ఉన్న మనిషికైనా నూతనోత్సాహాన్ని నింపగల మాయ తెలిసిన మహాద్భుతం. అమెరికా దేశంలో అడుగు పెట్టిన భారతీయులెవ్వరూ దీన్ని పలకరించకుండా వెనక్కి బయల్దేరరు. ప్రత్యేకించి భారతీయులు అని ఎందుకు అంటున్నానంటే...ప్రకృతి అంటే మనవాళ్ళు ప్రాణం పెడతారు, నాకు ఇతర దేశీయులతో పరిచయమూ లేదు. నాకూ అమెరికా వస్తానని తెలిసిన దగ్గర నుండి ఎప్పుడు వెళ్లి నయాగరాను చూడాలా...అని ఆరాటం ఉండేది. మా అత్తగారు, మామగారు మమ్మల్ని చూడటానికి అమెరికా వచ్చినప్పుడు కొన్ని మంచి మంచి ప్రదేశాలు చూపించాలి అని ప్లాన్ వేసుకుని, ఆ లిస్టు లో మొట్టమొదట దీని పేరు రాసేశాం. వాళ్ళ ఆరు నెలల అమెరికా ప్రయాణంలో రెండున్నర నెలలు ఐపోయాక చికాగో వెళ్లాలని అనుకున్నాం. ఇ...