హనీ హార్ట్స్ - పాత హనీ కాదు సుమా, కొత్త హనీ!
అందరికీ మంగిడీలు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను సినిమాల మీద మీతో కబుర్లు చెప్పాలని. ఒకోసారి బాగా నవ్వొచ్చినవి, కాస్తో కూస్తో గుండెని కదిలించేవి చూసినప్పుడు దానిగురించి రాయాలి అనుకునేదాన్ని. ఒకోసారి తలబాదుకుంటూ, నా ఒక్కదాని తలే ఎందుకు బొప్పి కట్టాలి, మీది ఎందుకు కట్టకూడదు అన్న కుళ్ళుతో రాసేద్దాం అనుకునేదాన్ని. ఎప్పుడూ కూర్చొని రాయటానికి మాత్రం ముహూర్తం కుదిరింది కాదు. ఈరోజు ఇక నన్ను పంచభూతాలు కూడా ఆపలేకపోతున్నాయి. నేను చూసిన చిత్రరాజం అలాంటిది మరి. మొన్న మాకు ఒక పాత సినిమా పాట గుర్తొచ్చింది. కానీ ఆ పాట ఇంకేదో సినిమాలోది అనుకున్నాము. ఆ మర్నాడు ఆ పాట కోసం ఆ సినిమా పెట్టుకున్నాము. మా అదృష్టం పుచ్చి, అదే పేరుతో ఒక కొత్త సినిమా కూడా ఉంది. అంటే సరికొత్తది కాదులే కానీ, ఆ పాతదానికంటే ఒక 22 ఏళ్ళ తర్వాత వచ్చినది. ఇందాక అనుకున్నట్టు మా అదృష్టం పుచ్చటం వల్ల ఆ రెండిటిలోనూ హీరో కూడా ఒకతనే. మేము 2023 లో చూసినది 1965 ది కాక 1987 ది అన్నమాట. 1965 నాటిది తెలుగులో విడుదల అయ్యి ఘనవిజయం సాధించాక దాన్ని హిందీలో తీశారు. 1987 నాటిది హిందీలో విజయం సాధించగా తెలుగులోకి తేబడ్డ చ...