గృహకార్య సహాయక సామ్రాజ్ఞి
మా మాజీ గృహకార్య సహాయకురాలు వెంగళమ్మ (సెక్యూరిటీ రీజన్స్ కోసం, నా ఆత్మసంరక్షణ కోసం పేరు మార్చటం జరిగింది) గురించి ఈ కథ. "గృహకార్య సహాయకురాలు" పదం కొత్తగా ఉంది కదూ? పనమ్మాయి, పనిపిల్ల, పనిమనిషి... ఇటువంటి పదాలు మనకి అలవాటు. కానీ ఇంకా మర్యాదాపూర్వకంగా ప్రస్తావించటానికి ఏ పదమైతే బాగుంటుందా అని పలుపలు విధముల ఆలోచిస్తుండగా, "అసలు ఇంగ్లీష్ లో ఏమంటారబ్బా?" అనుకున్నాను. వాడుక భాషలో "మెయిడ్" అంటారు. కానీ అందుకు సరైన అనువాదం మళ్లీ పైన చెప్పిన పదాలే. "ఇంకా ఏమంటారబ్బా?" అని ఆలోచించగా "డొమెస్టిక్ హెల్ప్" అని గుర్తొచ్చింది. దాన్ని మక్కీకి మక్కీ అనువదించలేక, ఉన్నంతలో దగ్గరగా "గృహకార్య సహాయకురాలు" అన్న పదానికి ఫిక్స్ అయ్యాను అన్నమాట. సహాయకురాలే లేకుండా ఆరేళ్ళు గడిపేశాను బాగానే. కానీ అనివార్య కారణాల వల్ల సహాయకురాలిని నియమించుకున్నాక, ఇక సహాయానికి అలవాటు పడిన ప్రాణం "లేకపోతే నీ జత పచ్చే" అనేసింది. మరి తప్పలేదు! మా ఇంట్లో అంతవరకు సహాయకురాలిగా చేసిన లక్ష్మి (అసలు పేరే, ఇక్కడ భయం లేదు కనుక) కడుపున కాయ పడటంతో (అలా ఎందుకంటారో!) పని చేయలేనం...