నటవిశ్వరూపం - నవ గౌరవం (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 3వ భాగం)
"క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" శీర్షికలోని మొదటి టపాలో కూతురి బడికోసం పడ్డ పాట్లు, ఎల్కేజీలో జరిగిన ఆన్లైన్ క్లాసుల గురించి కబుర్లు చెప్పుకున్నాం. https://madilomucchatlu.blogspot.com/2021/09/blog-post.html ముప్ఫై ఏళ్ళ తర్వాత మళ్లీ... (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 1వ భాగం) రెండవ టపాలో యూకేజీలో మొదటిసారి బడి అనుభవాలు, కూచిపూడి రుచి తెలుసుకున్నాం. https://madilomucchatlu.blogspot.com/2022/05/2.html కాస్తంత బడి - కూస్తంత కూచిపూడి (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 2వ భాగం) ఇది మూడవ భాగం. ఇప్పుడు 2013 మార్చి. మా అమ్మాయి ఒకటవ క్లాస్ లో ఉంది. ఆరో పుట్టినరోజు కేకు రుచి చూసిందో లేదో, మా అమ్మాయి ప్రవర్తన ఉన్నట్టుండి మారిపోయింది. అంతవరకు పిల్ల చేష్టలు, పిల్ల హావభావాలు, పిల్ల అలవాట్లు ఉండేవా? ఉన్నట్టుండి గంటకొట్టినట్టు పెద్దపిల్లలా ప్రవర్తించటం మొదలుపెట్టేసింది! మన మాటల్లో పాలుపంచుకొనే ప్రయత్నాలు, ఇంట్లో అందరికీ సాయం చేసేయాలని తాపత్రయం, తన పనులు తనే చేసుకోగలగటం, కొన్ని చేసుకోలేకపోయినా "చేసేయగలను" అనేసుకోవటం, ఏమైనా అంటే చిన్నబుచ్చుకోవటం, మన...