హ్యాండ్ బ్యాగ్
ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్ ఎందుకు వాడతారు అనే అంశం మీద ఎన్నో కథలు, ఎన్నో జోకులు, ఎన్నో హాస్య వ్యాసాలు ఉన్నాయి. బరువు-బాధ్యత అనే ద్వంద్వ సమాసం మొట్టమొదట ఎక్కడ పుట్టిందో గానీ, అది హ్యాండ్ బ్యాగ్ కి నిర్వచనంగా సరిగ్గా సరిపోతుంది. కానీ అది ఆడవాళ్ళకి మాత్రమే భూషణం ఎందుకు అయ్యింది? ఇదొక సమాధానం లేని చిక్కుప్రశ్న. రెండుమూడేళ్ళ వయసున్న ఆడపిల్లలు కూడా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని స్టైల్ గా తిరగాలని తాపత్రయపడుతుంటారు. కాసేపటికి ఆటల మీదకి ధ్యాస మళ్ళాక ఆ బ్యాగ్ ని కూడా అమ్మ మొహాన పడేస్తారనుకోండి. అలా తమ మొహాన పడేయబడ్డ ఎన్నో వస్తువులను హ్యాండ్ బ్యాగ్ లో కుక్కుకొని, ఏ ఆకారంలో ఉన్నదైనా అది కొబ్బరిబొండం షేపులోకి మారిపోయి, తగిలించుకున్న చోట ఇక చోటు లేక జారిపోతూ, భుజాన బరువై ఇబ్బంది పెడుతున్నా, మొగుడు కట్టిన మంగళసూత్రంతో సమానంగా దాన్ని అదిమి జాగ్రత్తగా పట్టుకొని ఇల్లు చేరుతారు ఆడవాళ్ళు. మొన్నొక రోజున నా బ్యాగ్ అలాగే బోలెడంత బరువుగా అనిపించి, ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. ఇలాగే మా పెళ్ళైన ఏడాది ఒకరోజు అంతకంతకీ నా హ్యాండ్ బ్యాగ్ బరువైపోతోందని గమనించాను....