ముక్కు పురాణం
మీరు చదివింది కరక్టే. అదే దీని టైటిల్. గతంలో ముగ్గు కబుర్లు చెప్పుకున్నాం కదా? ఈసారి ముక్కు కబుర్లు చెప్పుకుందాం. ఏమిటి, మీరు ముగ్గు కబుర్లు మిస్సయ్యారా? అయితే ఇదిగో లంకె. https://madilomucchatlu.blogspot.com/2020/05/blog-post.html సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కానీ నన్నడిగితే కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు కంటే ముక్కు మరీ ప్రధానం. అన్నం లేకుండా ఒక రెండు రోజులు ఉండచ్చు, నీళ్ళు లేకుండా ఒక పూట ఉండచ్చు, నిద్ర లేకుండా ఒక రోజు ఉండచ్చు. కానీ కరడుగట్టిన యోగ ఉపాసకులు కూడా గాలి పీల్చకుండా గట్టిగా పావుగంట కూడా ఉండలేరు కదా? మరి ఆ గాలి పీల్చటానికి ముక్కు మహా ఇంపార్టెంటు అవునా కాదా? రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు పెదవులు, రెండు కాళ్ళు, రెండు చేతులు ఇచ్చిన దేవుడు ఒకే ఒక్క ముక్కునిచ్చాడు. ఇప్పుడు రెండు ముక్కులున్న ముఖాన్ని ఊహించుకోకండోయ్, తట్టుకోలేరు. కళ్ళు రెండిచ్చి, చూపు ఒకటేనన్నాడు. చెవులు రెండిచ్చి వినేది ఒకటేనన్నాడు. కాళ్ళు రెండిచ్చి నడక ఒకటేనన్నాడు, చేతులు రెండిచ్చి చేత ఒకటేనన్నాడు. కానీ ముక్కు ముచ్చటగా ఒక్కటంటే ఒక్కటిచ్చి, ఆ మ...