కాస్తంత బడి - కూస్తంత కూచిపూడి (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 2వ భాగం)

    "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" అనే శీర్షికలో మొదటి భాగం పుట్టేసరికి అసలు ఈ శీర్షిక పుట్టనేలేదు. ఆ మొదటి టపా లో నా కుమారీమణి/ కూతురులక్ష్మి గురించి రాసిన వివరాలకు తన వీరాభిమానుల స్పందనను చూశాక, నాలాంటి తల్లులు ఎలా తమ తమ అనుభవాలను నెమరు వేసుకున్నారో చూశాక, ఈ పేరుతో శీర్షికను సృష్టించక తప్పలేదు. "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" మొదటి టపా మీకు అంది ఉండకపోతే, ఇదిగో, ఇదే దానికి లంకె...

https://madilomucchatlu.blogspot.com/2021/09/blog-post.html

    ఇకపోతే, మా కూతురులక్ష్మి దయవల్ల ఈమధ్యనే నేను అఖిల భారత అరివీర భయంకర ఎల్కేజీ ఫైనల్ పరీక్షల్లో గట్టెక్కాను. ఈ ప్రెపరేషన్ ఏదో నా ఎంసెట్ ఎగ్జామ్ కో, ఇంకా ఏ ఐఐటీ పరీక్షలకో అయ్యుంటే, ఈపాటికి ఎక్కడో ఉండేదాన్ని, ఇక్కడైతే కాదు! మొదటి టపాలో ప్రస్తావించినట్టు సామ-దాన-భేద-దండోపాయాలు వాడుతూ, తనకి రాయటమంటే మహా ప్రీతి అని మా పిల్లని హిప్నొటైజ్ చేస్తూ మొత్తం మీద కొద్దో గొప్పో రాయించగలుగుతున్నాను. తన ఎల్కేజీ టీచర్ పుణ్యమో, నా అదృష్టమో, ఒక 100 వరకు అంకెలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రాయటం, దాటుడు అంకెల మధ్యలో ఖాళీలు నింపటం, బుల్లి బుల్లి కూడికలు, తీసివేతలు చేయటం, రెండు బరుల్లో ఇంగ్లీష్ అక్షరాలు, అ నుండి అః వరకు హిందీ అక్షరాలు, తన పేరు, రెండక్షరాల పదాలు రాయటం చేస్తోంది. సెలవుల్లో తెలుగు రాత రుచి కూడా కొద్దిగా చూపించటం మొదలుపెట్టాను.

    ఏప్రిల్ లో ఒక క్లాసు పరీక్షలు అయ్యాక, వేసవి సెలవుల్లో చెమటలు, చెమటకాయలు, వడదెబ్బలు, వడియాల దెబ్బలు (అంటే ఎండలో పెట్టిన వడియాలను ఎండనివ్వకుండా నోట్లో వేసుకోవటం వల్ల వీపుకి తగిలే దెబ్బలు) ఇవేమీ లెక్కచేయకుండా ఒళ్ళెరగకుండా శుభ్రంగా ఆడేసుకుంటూ, ఆ చేతులతోనే ఉడుకు పుట్టించే మామిడిపళ్ళు, ఆవకాయ పచ్చళ్ళతో పాటు, పుచ్చకాయ ముక్కలు, తాటి ముంజెలు, పనస తొనలు అటు వెళ్తూ, ఇటు వస్తూ గొంతులోకి వేసుకుంటూ, నెలన్నర గడిపేసి, అప్పుడు జూన్ లో పై క్లాసులోకి వెళ్ళే రోజులు ఎప్పుడో పోయాయి కదా?

    ఈ రోజుల్లో, ముఖ్యంగా భాగ్యనగర బడుల ఆనవాయితీ ప్రకారం... మార్చ్ లో ఒక క్లాసు పరీక్షలు అయ్యాక, మర్యాద కోసం ఒక నాలుగైదు రోజులు సెలవులిచ్చి, వెంటనే పై క్లాసుని మొదలుపెట్టేసి, అయిపోయిన క్లాసులో చెప్పిన పాఠాలు నెమరువేయిస్తూ, రాబోయే క్లాసులో చెప్పాల్సిన పాఠాలను రుచి చూపిస్తూ, కొంచెం ఆడిస్తూ, కొంచెం పాడిస్తూ, ఈలోగా సరదాగా తల్లిదండ్రులకు కూడా, రాబోయే క్లాసు తాలూకు ఫీజుని ఇప్పుడే ఎలా కట్టాలో పాఠాలు చెప్తూ ఇంకొన్నాళ్ళు గడిపి, అప్పుడు వేసవి సెలవులు ఇస్తున్నారు.

    ఎల్కేజీలో ఉండగా ఎవరైనా మా అమ్మాయిని "నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు?" అంటే, అస్సలు తడుముకోకుండా "ఆన్లైన్ క్లాస్" అని చెప్పేది. దేవుడి దయవల్ల ఆ శకం ముగిసి మొన్ననే స్కూళ్ళు తెరిచారు. ఒక రెండు వారాలు అందరిలా తను కూడా స్కూలుకి వెళ్లి సో-కాల్డ్ "యూకేజీ" క్లాసులో చదివింది. ఆ కాసిని రోజులూ పది మంది ముఖాలు చూసి వచ్చేసరికి "నాకు సెలవులు వద్దు మొర్రో" అంది. ఏదోలా సర్ది చెప్పామనుకోండి.

    స్కూల్ అంటే, ఏదో పొద్దున్న వెళ్లి సాయంత్రం వచ్చేది అనుకునేరు, అలా అనుకుంటే మీరు స్కూల్ పార్కు ఇసుకలో కాలు వేసినట్టే. ఉదయం ఎనిమిదిన్నరకి మొదలై, పదిన్నరకి అయిపోయేది స్కూల్. అందులో మళ్లీ రెండు పిరియడ్లు, ఆటల టైము, మధ్యలో ఒక బ్రేకు, అందుకోసం ఒక స్నాక్స్ బాక్సు! ఎనిమిదిన్నరకి పిల్లని దింపి వచ్చి, నాలుగు అట్టు ముక్కలు వేసుకొని తినేసరికి, మళ్లీ పిల్లని వెనక్కి తీసుకువచ్చే టైమ్ అవ్వనే అయ్యేది. అంతవరకు ఆన్లైన్ క్లాసులు తప్ప నిజమైన స్కూలు ముఖం ఎరుగని పిల్లలకి స్కూలు అలవాటు చేయటానికి ఏదో తాపత్రయపడ్డారు లెండి!

    రెండేళ్ళుగా బోనుల్లో ఉన్న కోతిపిల్లలన్నీ ఒకేసారి విడుదలైనట్టు అంతమంది చిట్టి చిట్టి పిల్లలు వెల్లువలా బళ్ళోకి వచ్చేస్తే, స్కూల్ టీచర్ల నేర్పుకి పరీక్ష ఒక పక్కన అవుతుండగా, ఇంకో పక్క ఆన్లైన్ లో హాబీ క్లాసులు నిర్వహించే టీచర్ల ఓర్పుకి కూడా కోవిడ్ కాలంలో మెరుగులు పెరిగాయి. ఇంకో రెండు నెలల్లో ఐదేళ్ళు నిండుతాయనగా, మా పిల్లకి డాన్స్ అంటే ఇష్టం ఉందేమో అని అనుమానం వచ్చి, కూచిపూడి క్లాసుల్లో చేర్చాము. అయితే కొన్ని కారణాల వల్ల అదీ ఆన్లైనే అవ్వాల్సివచ్చింది. డాన్స్ క్లాస్ ఆన్లైన్ లో కుదురుతుందా అని అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. అందునా ఈ పిల్లకి నిండా ఐదేళ్ళయినా లేవాయే అన్నారు. కానీ ఆ టీచర్ కి ఎంత ఓపిక ఉందో ఈ దెబ్బతో తేలిపోవాల్సిందే అని మేము ముందుకి దూకాము. ఇంకా గట్టిగా చెప్పాలంటే మా అమ్మాయీమణినే ఆవిడ మీదకి తోశాము.

    పాపం ఆవిడకి ఓపిక ఎక్కువే సుమండీ! అనతి కాలంలో ఈ పిల్లకోతికి బోలెడంత ఇష్టురాలు అయిపోయారు. ఈరోజు డాన్స్ క్లాసుంది అంటే టక్కున నిద్ర లోంచి లేచి కూర్చుంటుంది. ఏదో తన వయసుకి తగ్గట్టు కొద్దికొద్దిగా నేర్చుకుంటోంది కానీ, అది మా శ్రీవారి కొంప ముంచుతుందని అప్పుడు తెలియలేదు.

    మా ఆయనకి ఏం చేసినా మనసంతా లగ్నం చేసి చేయటం ఇష్టం. ఆఫీసు పనైనా, అనుష్ఠానమైనా, చివరికి ఇంట్లో వాళ్ళతో ఉత్తుత్తి కబుర్లయినా బాగా ఏకాగ్రతగా చేస్తారు. ఆ ఏకాగ్రతకు భగ్నం కలిగితే... అబ్బా?? చెప్పేస్తాననుకోకండి! అది ఇంకెప్పుడైనా మరో టపా లో చెప్తా కావాలంటే. మొత్తానికి ఏకాగ్రత ఈజ్ వేరీ ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. అంతే.

    ఎప్పుడైనా టీవీలో సినిమానో వార్తలో చూస్తుంటే మనమెవ్వరం మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే, టీవీని మ్యూట్ లోనో, పాజ్ లోనో పెట్టి, క్లుప్తంగా మాట్లాడేసుకొని, అప్పుడు మళ్లీ అన్మ్యూటో అన్పాజో చేసుకోవటం మా ఇంట్లో రివాజు. అలాంటిది మా అమ్మాయికి డాన్స్ క్లాసులు మొదలయ్యాక అది డాన్సు ప్రాక్టీస్ చేసేస్తున్నానని అనుకుంటూ పగలు-రాత్రి తేడా లేకుండా ఏవేవో చేస్తోంది.

    చూసేసిన కామెడీ చిత్రాన్ని కూడా జాగ్రత్తగా మౌనంగా చూడాలని ఆశించే మా ఆయన, మొదటిసారిగా ఏదైనా థ్రిల్లర్ చూస్తున్నారనుకోండి... మా అమ్మాయి సరిగ్గా టీవీకి, మా ఆయన కళ్ళకి మధ్య ఊహాజనితమైన సరళరేఖకి సరిగ్గా మధ్యలో నుంచొని "తాం తై తై తై, తాం తై తై తై" అని పాడుకుంటూ మొట్టమొదటి స్టెప్పు దగ్గర నుంచి డాన్సు కడుతుంది.

        "తప్పుకో అమ్మా, చూస్తున్నాను కదా? ప్లీజ్" అంటారు.

   ఆ తండ్రికి బిడ్డ కదా? తనకి ఎంత ఏకాగ్రత మరి? అస్సలు మా ఆయన మాటని పట్టించుకోకుండా, అచ్చం తన టీచర్ లాగే చేసేస్తున్నా అనుకుంటూ ఇంకోటేదో చేసేస్తూ, "తత్తైహిత్తా తైహిత్తా తత్తైహిత్తా తైహిత్తా" అని ఇంకొంచెం గట్టిగా పాడుతుంది.

        మా ఆయన కూడా కొద్దిగా గొంతు పెంచి, "ప్లీజ్ తల్లీ, నేను ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాను, ప్రశాంతంగా చూడనీ" అని కోప్పడతారు.

        ఒక్క నిముషం ఆగినట్టే ఆగి, మళ్లీ "తాం దిగి దిగి దిగి దిగి దిగి దిగి" అంటూ మా ఆయన మీదకి వచ్చేస్తుంది.

       మా ఆయన కోపం తరువాతి స్థాయికి వెళ్తుంది. ఇంకొంచెం స్వరం పెంచి, "ఏమిటి నాకీ సలుపు? చూడనా, మానేయనా?" అంటారు.

    "చూడు" అంటుంది.

    "అయితే నువ్వు డాన్స్ ఆ గదిలోకి వెళ్లి వేసుకో" అంటారు.

    ఈ శాంతి ఒప్పందం ఎంతోసేపు వర్తించదు.

    నోట్లోనే "తత్తైహిత్తా" అనుకుంటూ స్టెప్ వేసుకుంటూ వేసుకుంటూ మా ఆయన్నే చూసుకుంటూ కొంచెం చాటుకి వెళ్తుంది. అక్కడ నుండి తొంగి చూస్తూ పరిస్థితి గమనిస్తుంది. నాన్న తననే చూస్తున్నారు అంటే ఆగుతుంది, మళ్లీ సినిమాలో లీనమయ్యారు అనిపిస్తే, అదే స్టెప్పు వేసుకుంటూ వేసుకుంటూ మళ్లీ ఆ ఊహాజనిత సరళరేఖ మీదకి వచ్చేస్తుంది.

    మా ఆయన మీద జాలేసి నేనే దాన్ని ఏ పక్క గదిలోకి తీసుకువెళ్ళటమో, ఇంకేదో పనిలోకి మరల్చటమో చేస్తాను. అంతా బానే ఉందనుకొని నేనేదో పనిలో పడతాను, మా ఆయన ఆ సినిమాలో పడతారు.

    ఒక్క రెండు నిముషాలు కూడా తిరగకుండానే టీవీ ఉన్న గదిలో మధ్యలో కూర్చొని, చేతులు జోడించి, డాన్స్ టీచర్ చెప్పిన శ్లోకాలన్నీ గట్టిగట్టిగా చదవటం మొదలుపెడుతుంది

"గిరిజార్ణవ పూర్ణేందుం సమంచిత కళానిధిమ్,

అపాస్త విఘ్నతా మిస్రం శూర్పకర్ణముపాస్మహే" అంటూ.

    "ఇది వచ్చిన స్టెప్పులన్నీ చేసేసి, థియరీ కూడా మొదలుపెట్టింది. అన్నీ నేను సినిమా చూసే ఈ కాసేపట్లోనే" అని మా ఆయన గోల పెడతారు పాపం. అయినా అది డాన్స్ చేస్తుంటే బోలెడంత పుత్రోత్సాహం కూడా పొందుతారనుకోండి.

    అసలు మా అమ్మాయి పుట్టాక ఒక్క సినిమా కూడా మేము పూర్తిగా చూసిన గుర్తు లేదు. డాన్సు కాకపోతే సంగీతం ఉందిగా? తోచినట్టు పలికేస్తూ, విన్న పాటలన్నీ గట్టిగట్టిగా పాడేస్తూ ఉంటుంది. సరిగ్గా టీవీలో ఏదైనా చూస్తునప్పుడో, ఏదైనా ముఖ్యమైనది మాట్లాడుకుంటున్నప్పుడో, గొంతు అలా అలా పెరిగిపోతూ ఉంటుంది కూడా. ఒకోసారి దానికంటే ఎక్కువ స్వరంతో మాట్లాడుకోవలసి వస్తే, మేమిద్దరం మాకే తెలియకుండా గొడవపడిపోతూ, ఓ నిముషం అయ్యాక అది గ్రహించుకొని మళ్లీ సర్దుకుంటూ ఉంటాము. "ఇలా చేస్తే ఈరోజు కథ చెప్పము" అనో, "రాత్రి రైమ్స్ పెట్టము" అనో, ఏదో బ్లాక్ మెయిల్ చేసి నిశ్శబ్దాన్ని సాధించుకుంటున్నాము ఈమధ్య. మానవుడు పరిణామక్రమంలో ఎలా కొద్దికొద్దిగా తెలివి నేర్చుకున్నాడో బాగా అర్థమవుతోంది మాకు.

కామెంట్‌లు

Chaitanya చెప్పారు…
Good one. I enjoyed it. 😃
అజ్ఞాత చెప్పారు…
మీ అమ్మాయి వేషాలు, మీరు పడే పాట్లు నవ్వు తెప్పించాయి.
Unknown చెప్పారు…
సహజంగా ఉంది

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్