హనీ హార్ట్స్ - పాత హనీ కాదు సుమా, కొత్త హనీ!
అందరికీ మంగిడీలు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను సినిమాల మీద మీతో కబుర్లు చెప్పాలని. ఒకోసారి బాగా నవ్వొచ్చినవి, కాస్తో కూస్తో గుండెని కదిలించేవి చూసినప్పుడు దానిగురించి రాయాలి అనుకునేదాన్ని. ఒకోసారి తలబాదుకుంటూ, నా ఒక్కదాని తలే ఎందుకు బొప్పి కట్టాలి, మీది ఎందుకు కట్టకూడదు అన్న కుళ్ళుతో రాసేద్దాం అనుకునేదాన్ని. ఎప్పుడూ కూర్చొని రాయటానికి మాత్రం ముహూర్తం కుదిరింది కాదు. ఈరోజు ఇక నన్ను పంచభూతాలు కూడా ఆపలేకపోతున్నాయి. నేను చూసిన చిత్రరాజం అలాంటిది మరి.
మొన్న మాకు ఒక పాత సినిమా పాట గుర్తొచ్చింది. కానీ ఆ పాట ఇంకేదో సినిమాలోది అనుకున్నాము. ఆ మర్నాడు ఆ పాట కోసం ఆ సినిమా పెట్టుకున్నాము. మా అదృష్టం పుచ్చి, అదే పేరుతో ఒక కొత్త సినిమా కూడా ఉంది. అంటే సరికొత్తది కాదులే కానీ, ఆ పాతదానికంటే ఒక 22 ఏళ్ళ తర్వాత వచ్చినది. ఇందాక అనుకున్నట్టు మా అదృష్టం పుచ్చటం వల్ల ఆ రెండిటిలోనూ హీరో కూడా ఒకతనే. మేము 2023 లో చూసినది 1965 ది కాక 1987 ది అన్నమాట. 1965 నాటిది తెలుగులో విడుదల అయ్యి ఘనవిజయం సాధించాక దాన్ని హిందీలో తీశారు. 1987 నాటిది హిందీలో విజయం సాధించగా తెలుగులోకి తేబడ్డ చిత్రరాజం.
సరే, ఎక్కుపెట్టిన బాణం దించటం ఎందుకులే అని ఆ కొత్తదాన్నే చూసేయటానికి సిద్ధమయ్యాం. సాధారణంగా మంచి కథలనే ఎంచుకొనే ఈ హీరో ఈసారి నాలుగేళ్ళ మునుపే హిందీలో వచ్చిన ఈ సినిమా కథని ఎంచుకున్నాడు. హిందీలోకి వెళ్లి బాగా పేరు తెచ్చుకున్న ఒక హీరోయిన్ ని వెనక్కి తీసుకువచ్చుకొని ఇందులో పెట్టుకున్నారు. ఈవిడ వస్తూవస్తూ బొంబాయినుండి మేకప్ సామగ్రిని, మంచిమంచి దుస్తుల్ని, మేకప్ మనిషిని కూడా తెచ్చేసుకుంది. అందుకే గతంలోనే అందగత్తెగా పేరుగాంచినా, ఇందులో మరీ ఎక్కువ మెరిసిపోయింది. నవ్వు బాగుంటుందని పేరు తెచ్చుకున్న ఒక నటిని రెండో హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఈవిడ మళ్లీ ఎవరైనా ఛాన్స్ ఇస్తారో ఇవ్వరో అన్న భయం ఉన్నదానిలా మొత్తం నటనంతా సీనుసీనులోనూ రంగరించే ప్రయత్నం కొంచెం గట్టిగానే చేసింది.
ఎప్పుడూ కన్నడ భాషలోను, అప్పుడప్పుడూ హిందీలోను దర్శకత్వం చేసిన ఒక పెద్ద కన్నడ దర్శకుడిని ఏరికోరి తెచ్చుకున్నారు, తెలుగు ప్రేక్షకుల కోసం కానుకగా. ఇక సంగీతం విషయానికి వస్తే, అప్పటికే దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా హిందీ పరిశ్రమలో "డిచ్చికిడిచ్చికి"మంటూ శబ్దాలు వినిపిస్తున్న ఒక పొడవు జుట్టాయన్ని తెచ్చారు, ఆ "డిచ్చికి"లు బాగా నచ్చటంతో.
కథలోకి వెళ్తే, మన హీరో స్వయంశక్తిని నమ్ముకునే ఒక అభిమానవంతుడైన, వినయవంతుడైన పారిశ్రామికవేత్త. ప్రస్తుతం కుటుంబం ఏమీ లేని ఒంటరి. ఏమిటో, కాసేపు పరమ వీక్ గా, కాసేపు పరమ స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ పాత్ర వ్యక్తిత్వం! కొంచెం దానగుణం, కాస్తంత త్యాగం, కూస్తంత గౌరవం, పిసరంత ప్రేమ, ఇసుమంత ఇంగితం ఉంటాయి కానీ పరిస్థితుల ప్రభావం చేతనూ, కన్నడ దర్శకుడు, హిందీ కథారచయిత అభిప్రాయాల ప్రకారమూ కాసేపు వెన్నెముకతో ఉన్నట్టు, కాసేపు దాన్ని బీరువాలో వేసి తాళం పెట్టి వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు.
మొదటి హీరోయిన్ తండ్రిది మాంచి పతాక సన్నివేశం చూసుకొని గుండెల్ని చేత్తో అదుముకుంటూ చనిపోవటం కోసం పుట్టిన పాత్ర. సవతి తల్లి, ఆమెకో తమ్ముడు. ఎప్పుడెప్పుడు దుష్టకార్యాలు చేద్దామా అని మేకప్ వేసుకొని రడీగా వెయిట్ చేసే పాత్రలు, ఈ సినిమాకి విలన్లు. మరీ సీనుసీనులోనూ వాళ్ళు చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులే చేస్తున్నా, ఒక్క సీనులోనూ అది పసిగట్టని అమాయకురాలు అయినప్పటికీ, అల్పులను ద్వేషించి, ప్రతి సీనులోనూ అవమానించే అహంకారి, గర్విష్టి మన మొదటి హీరోయిన్. అయినా ఆమెను ప్రేమించేస్తూ, క్షమించేస్తూ, భరించేస్తూ ఉంటాడు హీరో. అసలు సాధారణంగా ఎంత గర్విష్ఠి అయినా కూడా నిజజీవితంలో చేయని పనులు కొన్ని చేస్తుంది హీరోయిన్. చేసినదంతా చేసి, మధ్యలో హీరోకే శాపనార్థాలు పెడుతుంది! కొన్ని సీన్లయ్యాక, రెండో హీరోయిన్ స్నేహంలో ఊరట పొందుతాడు హీరో. అప్పుడు కూడా ఏమిటో ఆ రెండో హీరోయిన్ రకరకాలుగా బాధపడుతూ, ఆనందిస్తూ, రకరకాలుగా ఉంటూ ఉంటుంది. అసలు ఈ రెండో హీరోయిన్ విషయానికొస్తే, సినిమా మొదట్లో రాధాకృష్ణుల పెయింటింగులు వేసుకుంటూ, స్వయంగా ఆవుపాలు పితికి పాయసాలు చేసిపెడుతూ హీరోని ప్రేమిస్తుంది. తర్వాత ఎందుకు త్యాగం చేస్తుందో తెలియదు గానీ, మొత్తం మీద హీరో పెళ్లి అయ్యాక కాసేపు కనపడదు. ఒకవేళ కనపడినా, అతనికి నేను భక్తురాలిని అంటూ కృష్ణుడి బొమ్మ ఒకటి పెట్టుకొని స్లో మోషన్ డిచ్చికిడిచ్చికి పాటలు పాడుకుంటూ ఉంటుంది.
హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక, విలన్ల వల్ల గొడవలు పడుతూనే ఉంటారు. ఒకసారి అయితే పర్లేదుగానీ, మనకి కూడా విసుగు, విరక్తి వచ్చే అన్నిసార్లు గొడవలు పడతారు. ప్రతి విషయంలోను స్పష్టంగా విలన్ల ప్రమేయం ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ఆమెకు ఆ విషయం అర్థమే కాదు! చెప్తే వినదు! ఆ ధోరణి వల్ల సినిమాలో హీరో, సినిమా చూసే మనమూ కూడా ఆరారగా తలబాదుకుంటూ, జుట్టు పీక్కుంటూ ఉంటాము. ఇదిలా ఉండగా, ఇందాక చెప్పినట్టు ఒకరోజు హీరోయిన్ తండ్రి మరణించాక, ముందు జరిగిన సన్నివేశాల్లాంటివే మరిన్ని జరుగుతాయి, మరింత ఘాటుగా.
ఒకేసారి హీరో భార్యకి దూరమవుతాడు, ప్రకృతి పగపట్టటంవల్ల వ్యాపారంలోనూ నష్టపోతాడు, విధి బలీయమైనది కనుక రెండో హీరోయిన్ కూడా వేరే ఊరికి వెళ్లిపోతుంది. ఉన్న కాస్త డబ్బుని తన వర్కర్లకి ధారపోసి గుడిసెలోకి మారతాడు హీరో. ఈలోగా మగ విలన్ (హీరోయిన్ మావయ్య) రెండో హీరోయిన్ దగ్గరకి వచ్చి "నువ్వు పెళ్లిచేసుకుంటేనే వాళ్లిద్దరూ బాగుంటారు" అంటాడు. ముందు, వెనుక చూసుకోకుండా ఆ త్యాగశీలి పెళ్లిచేసేసుకుంటుంది. ఒక్కే ఒక్క సీనులో అతను తాగుబోతు అని, భార్యను కొట్టే మూర్ఖుడని, అనుమానించే దుష్టుడని... ఇలా రకరకాలుగా చూపించేసి, ఆ సీనులోనే ఆ పాత్రను చంపించేస్తాడు డైరెక్టర్. అది కూడా అతని మామగారి చేతనే. తర్వాతి సీన్ లో ఆ మామగారు కూడా అకస్మాత్తుగా ఎలాగో చనిపోతాడు. ఒక్క దెబ్బతో రెండో హీరోయిన్ భర్త, తండ్రి కూడా సినిమాలోంచి వెళ్లిపోతారు.
అప్పటికే గర్భవతి అయిన రెండో హీరోయిన్ మళ్లీ హీరోకి ఎదురవుతుంది. ఇద్దరూ కలసి ఆ పుట్టే పాపను పెంచుకుంటూ ఉంటారు. ఈలోగా మొదటి హీరోయిన్ విదేశాలకు వెళ్తుంది ఉత్తుత్తినే. విలన్లు చెప్పినవన్నీ నమ్మేస్తుంది వెళ్ళే ముందు కూడా, వెనక్కి వచ్చాక కూడా. అసలు ఈ పాత్రకి మొట్టమొదట టైటిల్స్ పడేముందే వెన్నెముక పీకేశారులెండి. ఈసారి కోర్టుకేసుల దాకా వెళ్తుంది వ్యవహారం. అసలు ఈ కథంతా హీరో జడ్జ్ గారికి కోర్టుబోనులో నుంచొని చెప్పే ఫ్లాష్ బాక్... ఎప్పటిలాగే పాటలతో సహా చెప్తాడు.
అన్నట్టు పాటంటే గుర్తొచ్చింది. ఇందులో ఒక పాట ఉంటుంది. పెళ్లి కాకముందు హీరోయిన్ సవతి తల్లి హీరోని భోజనానికి ఇంటికి తీసుకురమ్మంటుంది, అతన్ని అవమానించే ఉద్దేశంతో. అప్పుడు ఒక పాట వస్తుంది. తెలుగు సినీచరిత్రలోనే తలమానికమై మెరవదగ్గ గొప్ప సాహిత్యసంపద ఉన్న పాట. మొదట పార్కులో హీరోహీరోయినిద్దరూ ఆ మూలనుంచి ఈ మూలకి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాక, వ్యాయామం చేస్తూ ఈ పాట మొదలుపెడతారు. "మమ్మీ మమ్మీ మమ్మీ పిలిచె రారా సామి, విందుకి పిలిచె మమ్మీ, ఇంటికి రారా సామి". అదీ పల్లవి. ఇక అనుపల్లవి "గరం గరం ఫలహారం, ఇది నా ఆహ్వానం" అంటూ హీరోయిన్ కదులుతున్న ఒక రైల్లో ఉన్న హీరో చేతిని పట్టుకొని ఆ రైలు పక్కనే పరుగెడుతూ పాడుతుంది. అదీ పాట! అసలు ఈ పాటని కూర్చినప్పుడు తెలుగువారైన ఆ గేయరచయిత, హిందీవారైన ఆ సంగీత దర్శకుడు, కన్నడవారైన ఆ దర్శకుడు ఏ భాషలో ఎలాంటి చర్చలు జరపగా ఈ అద్భుతగీతం పుట్టిందో తెలుసుకోవాలనుంది నాకు.
ఇక ఇలాంటి కథకి బరువైన క్లైమాక్స్ తప్పనిసరి కదా? ఆ బరువు కోసం, అప్పటికే బరువైన పాటలు పాడటానికి అలవాటుపడిన రెండో హీరోయిన్ ఒక పాట పాడుతుంది. అసలే ఆమెకు నాలుగైదు మీటర్ల దూరంలో కృష్ణుడి విగ్రహం ఉంటే ఆమెను పట్టుకోవటం కష్టం. అలాంటిది అక్కడే రెండుమూడు విగ్రహాలు ఉంటాయి. హీరో భార్యని బ్రతిమాలి మనసు మార్చాలని ప్రయత్నిస్తూ, ఆమె పట్టించుకోకుండా ఊగే కుర్చీలో ఊగుతున్నా, దూరంగా నుంచొని పాడేస్తూ ఉంటుంది. ఆమె విదిలించుకొని పైకి వెళ్లిపోతే కూడా, కింద పచార్లు కొడుతూ పాడేస్తూ ఉంటుంది. అంతటితో ఊరుకోక, అక్కడ నేలమీద కూర్చొని తన మానాన తను ఆడుకుంటున్న తన చంటిబిడ్డని ఎత్తుకొని, చీర కుచ్చిళ్ళు కూడా పట్టుకోకుండా మెట్లు ఎక్కుతుంది, వద్దని మనం అంటూనే ఉన్నా. తీరా మనం అనుకున్నంతా జరుగుతుంది. బిడ్డతో సహా దొర్లుకుంటూ కిందకి పడిపోతుంది. మళ్లీ బిడ్డని కింద నేలమీద పడుకోపెట్టేసి, డేక్కుంటూ డేక్కుంటూ మెట్లు ఎక్కేస్తూ పాట పాడేస్తూ ఉంటుంది (ముందరి సీనులో తీసుకున్న విషంవల్ల రక్తం కక్కుకుంటూ).
మొత్తం మీద మొదటినుంచి ఎవరు చెప్పినా, తండ్రి మరణించినా మారని హీరోయిన్, మరిప్పుడు రెండో హీరోయిన్ పాడిన పాట వినటం వల్లనో, ఆమె మెట్లమీద పడ్డ అవస్థలు చూడటం వల్లనో, ఆమె చేసిన ప్రాణత్యాగం వల్లనో గానీ, ఉన్నట్టుండి మారిపోతుంది! ఆఖరి సీనులో ఆమె మృతదేహంపై పెట్టటానికి పుష్పగుచ్ఛంతో వస్తుంది కారులో. హీరోహీరోయిన్లు ఆ చంటిబిడ్డను ఎత్తుకోవటంతో అంతులేని ఈ కథకి ముగింపు మొత్తానికి దొరుకుతుంది. ఏమిటి, మీకు విక్స్ కావాలా? ఇంకెక్కడుంది? నేను మొత్తం వాడేశానుగా?
కామెంట్‌లు