తోచీ తోచనమ్మ

   "తోచీతోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్లింది" అన్న సామెత ఒకప్పటి కాలంలో. ఇప్పుడు అలా వెళ్ళటాలు మామూలే. పైగా స్మార్ట్ ఫోన్లు ఒకచేత్తో మనుషుల్ని దగ్గర చేస్తూనే మరోచేత్తో దూరంచేస్తున్న ఈ కాలంలో ఒకరింటికి ఒకరు వెళ్ళటం అనేది చాలా అరుదైన, ముచ్చటైన విషయం కూడాను.

    అసలు నేను చెప్పాలనుకున్నది నా తోచీతోచనమ్మతనం గురించి. ఈమధ్య నేను తోచీతోచనట్టే ఒక పెళ్లికి వెళ్ళొచ్చాను.

    ఛండీఘర్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మా పెద్ద మేనమామగారికి బాగా బంధుప్రీతి. అలాంటిలాంటి బంధుప్రీతి కాదు, మా చెడ్డ బంధుప్రీతి. బ్రహ్మోత్సవం సినిమా ద్వితీయార్థంలో మహేశ్ బాబుకి ఉండే అంత.

    ఒక వేలే కాదు, రెండు మూడు వేళ్ళు విడిచిన బంధువుల్ని కూడా కలుసుకొని, కలుపుకుంటూ ఉంటాడు. అలా అన్ని వేళ్ళనూ కలిపి ఉంచే బాధ్యతని తన భుజస్కంధాలమీద వేసుకొని మోసే మా మావయ్య హైదరాబాద్ లో ఒక పెళ్లికి హాజరయ్యాడు.

    ఆమధ్యనే సతీసమేతంగా తీర్థయాత్రలు చేయటంతో, కొద్దిగా బదరీనాథ్ ప్రసాదాన్ని మాకు అందజేయాలనుకున్నారు. దానితోపాటే, స్వయంగా నారుపోసి, నీరుపోసి పెంచిన ఉసిరిచెట్టు కాయలను నాకు, తన చెల్లెళ్ళకు అందజేయమని మా అత్త అడగగా, సూట్ కేస్ నిండా నవనవలాడే ఉసిరికాయలను తీసుకొని మా మావయ్య హైదరాబాద్ కి ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలో స్వయంగా మా ఇంటికి వచ్చే అవకాశం లేకపోవటంతో నన్ను ఆ పెళ్లికి రమ్మన్నాడు మా మావయ్య.

    వాళ్ళకి 30 ఏళ్ళుగా పరిచయం ఉంది కనుక పర్వాలేదు, నేనెలా రాగలను అని నేను మొహమాటపడుతుంటే, కన్యాదాతలచేత నాకొక ఫోన్ కూడా కొట్టించేశాడు మా మావయ్య. ఇక సిగ్గుపడితే లాభం లేదని నేను పెళ్లికి బయలుదేరాను. ఆ పెళ్లికూతురు నాకు చాలా దగ్గర బంధువు. స్వయాన మా తల్లిగారి తండ్రిగారి తండ్రిగారి ఒక్కగానొక్క తమ్ముడుగారి పెద్దకొడుకుగారికి మూడో కూతురుగారి ఒక్కగానొక్క కూతురు.

    మొత్తానికి వెళ్ళాను, శుభ్రంగా మాంచి మాంచి వంటకాలతో భోజనం లాగించాను, మా మావయ్యతో చాలాసేపు కబుర్లు చెప్పాను. ఆడపెళ్లివారంతా నన్ను చాలా ఆప్యాయంగా పలకరించటమే కాక,  "ఫ్రెండ్ రాధ" అనే ఆవిడకి పెట్టాల్సిన చీర నాకు పెట్టేశారు పాపం.

    ఇదైనా కొంచెం పర్వాలేదు. 2013 లో మేము ఒక చంటిపిల్ల మొదటి పుట్టినరోజు పార్టీకి వెళ్ళాము. మా చిన్నమ్మమ్మగారింట్లో ఏదో కార్యక్రమానికి మా అమ్మమ్మగారితోపాటు, ఊళ్ళో ఉన్న మా అమ్మగారిని, నన్ను కూడా పిలిచారు. అది పూర్తయి బయలుదేరదాం అనుకుంటుంటే, మమ్మల్ని ఒక పార్టీకి తీసుకువెళ్ళారు వద్దువద్దంటున్నా.

    ఆ పుట్టినరోజు జరిగింది ఎవరింట్లోనో చెప్తాను, వినండి. మా అమ్మమ్మగారి చెల్లెలి పెద్దకూతురి ఒక్కగానొక్క కూతురికి కాబోయే భర్తగారి అన్నగారి భార్యగారి పుట్టింట్లో! ఇంతకంటే పెద్ద తోచీతోచనమ్మలు ఎవరైనా మీకు తెలుసా అని నా ఛాలెంజ్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్