పండగ పెసల్


సంక్రాంతి పండగకి అంతా సొంత ఊరు వెళ్తారని తెలుసు కానీ మరీ ఇంతమంది ఒకేసారి ఊళ్ళు ఖాళీ చేసి వలస పక్షుల్లా ఎగిరిపోతారని ఎప్పుడూ అనుకోలేదు. సరే, నిజంగా పక్షుల్లా ఎగిరితే అసలు సమస్యే  ఉండదు కదా? రోడ్ల నిండా ఇసక వేస్తే రాలనన్ని బస్సులు. అసలు ఇన్ని బస్సులు ఇన్నాళ్ళూ ఎక్కడ దాక్కున్నాయి?! ఒక్కసారిగా తేనెపట్టు మీద ఎవరో రాయెత్తి కొడితే రేగినట్టు ఒకటే రొద, ఒకటే హడావిడి. దేశంలో ఇన్ని ప్రైవేటు బస్సు కంపెనీలు ఉన్నట్టు గానీ, ఒక్కొక్క కంపెనీకీ ఇన్నేసి బస్సుల ఆస్తి ఉన్నట్టు గానీ ఎప్పుడూ ఊహించలేదు.

అసలు తెల్లవారు ఝామున ఐదింటికి వెళ్లి నుంచున్నా 'తత్కాలటిక్కట్లు కూడా దొరక్క గానీ, లేకపోతే ఈ తంటా ఎందుకు? ఇది దాదాపు పది-పన్నెండేళ్ళ క్రితం మాట కదా? అప్పట్లో ఇప్పటిలా అరచేయి కంటే పెద్దవైన ఫోన్లు, మునివేళ్ళ అంచుల్లోనే ప్రపంచాన్ని చాపలా పరిచి చూపించగల ఇంటర్నెట్టు లేవులెండి. పైగా మన ఇళ్ళలో ఉండే ఇంటర్నెట్ తో పని చకచకా జరగదని, రైల్వే బుకింగ్ కౌంటర్లో ఇంటర్నెట్ వేరేగా ఉంటుందని, టికెట్లు దొరికేస్తాయని ఎవరో హితవు పలకటంతో ఓహో అనుకున్నాము. కాకపోతే ఉదయాన్నే అయిదింటికి వెళ్ళాలి అని చావు కబురు చల్లగా చెప్పారు. అలా వెళ్తే మాత్రం తత్కాల టిక్కెట్లు ఎందుకు దొరుకుతాయి చెప్పండి? లుంగీ పంచలూ , తుండు గుడ్డలూ నేల మీద పరుచుకుని ఒక ఇరవై మంది వరకు రైల్వే రిజర్వేషను కౌంటరు దగ్గరే ఒక 'వరస'లో పడక వేశారు. ఇక రెండింటికో, మూడింటికో నిద్రమ్మని పక్కకి నెట్టి బండెక్కి బయల్దేరిన వాళ్ళు మరికొందరు.

పదింటికి కౌంటరు తెరుస్తారు అన్నారు. నేను వెళ్ళేసరికి నా ముందు మూడు వరసల్లో ఇరవయ్యేసి మంది ఉన్నా కూడా, "ఆ.. వీళ్ళంతా రాజమండ్రికే  ప్రయాణమవుతారా ఏమిటి?" అని నన్ను నేను మభ్యపెట్టుకుని లైన్లో నుంచున్నాను. నా ముందు ఒక తమిళం పెద్దమనిషి నవల తెచ్చుకుని నుంచున్నాడు. నాకు ఈ తెలివి తేటలు లేకపోయాయే అనుకుంటూ మిగతా వారిని చూశాను. చేతిల్లో న్యూస్ పేపర్ గానీ, లాప్ టాప్, ఐపాడ్ లాంటి పరికరాలు గానీ లేని వాళ్ళు ఎవరూ లేరు! వాళ్ళు ఈపాటికి ఈ తత్కాల్ వ్యవహారంలో తల పండిపోయి ఉంటారు. ఈ మాట ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను అంటే, ఈసారి తిన్న దెబ్బతో నేను మళ్ళీ వచ్చేసారి ఖాళీ చేతులతో వెళ్తానేమిటి?


నా వెనుక ఉన్న చింపిరి జుట్టాయన పాన్ కార్డు జిరాక్స్ తీయించుకొస్తాను, తన ప్లేసు తనకే అట్టేపెట్టమని చెప్పి వెళ్ళాడు. ఇంకా లేటుగా వచ్చిన వాళ్ళు ఈ వరసలని చూసి అలాగే చల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. 'స్త్రీ' లైను ఏర్పాటు చేద్దాం అని లోపలకి దూసుకొని వెళ్ళబోయిన వనితామణులు  కొందరు నిరాశులై వెనక్కొచ్చారు. ఇంట్లో పనులు చక్కబెట్టుకొని భర్తలను రిలీవ్ చేయటానికి భార్యలు వస్తున్నారు. వాళ్ళను లైన్లో నుంచోపెట్టి భర్తలు ఇళ్ళకి వెళ్లి ముఖాలు కడుక్కొస్తున్నారు. ఎలాగూ పండక్కి బ్యాగ్ సర్ది ఉంచాము కదా అని అది తెచ్చుకొని పీఠంగా వేసుకొని కూర్చుంటున్నారు ఇంకొందరు. అటు పీఠమూ, ఇటు పుస్తక కాలక్షేపమూ లేకపోయినా, ఎలాగో ఒకలా ఆ నాలుగైదు గంటలూ వెళ్ళదీశాను. ఇందాకనగా ప్లేసు పెట్టి ఉంచమన్న పెద్దమనిషి ఇంకా రాలేదు. టీ కాఫీలు, టిఫిన్లు అమ్మొచ్చాయి.


ఇంకో అరగంట ఉంది అనగా, లైన్ల పక్కన మెట్లమీద కూర్చున్న కొందరు చరచరా వచ్చి లైన్లలో కలుస్తున్నారు. వాళ్ళని చురచుర చూపులతో భస్మం చేయ ప్రయత్నిస్తూనే వెనక్కి వెనక్కి జరిగి రోడ్డెక్కింది కౌంటరు వద్ద మొదలైన లైను. ఇంతలో ఇందాకటి చింపిరి జుట్టాయన వచ్చాడు, ఈసారి దువ్విన జుట్టుతో! ఒక్కసారిగా గొల్లుమన్నారు జనం. ఇంతకుముందే వచ్చి వెళ్ళానంటూ నన్ను సాచ్చికం అడిగాడా పెద్దమనిషి. నేను అవునని తల ఊపే అవకాశం కూడా ఇవ్వకుండా విరుచుకుపడ్డారు ఆ ఆసామిపై అందరూ. పంపుసెట్టు బిందెలాటలకు ఏమాత్రం తీసిపోకుండా సాగింది కోలాహలం. "ఇంటికి వెళ్లి పడుకొని వచ్చినట్టున్నావు, నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది, మేము పిచ్చివాళ్ళమా లైన్లో నుంచున్నందుకు?" అంటూ అతన్ని అదరగొట్టి, బెదరగొట్టి మొత్తానికి లైన్లో ఒక్క తలకాయను తగ్గించారు తత్కాల సామ్రాట్లు.

 

ఇంకో ఐదు నిముషాలు ఉన్నాయనగా కౌంటరు తలుపులు తెరుచుకున్నాయి. కంప్యూటర్ల ముందు పరీక్ష రాయటానికి సిద్ధంగా ఉన్న కాలేజీ పిల్లల్లా కూర్చున్నారు రైల్వే అధికారులు. లైన్లలో జనమందరూ సైన్య శిక్షణ పొందే కొత్త కుర్ర సైనికుల్లా ఊపిరి బిగపట్టి నిటారుగా నిలబడ్డారు కౌంటరు వైపుకే చూస్తూ. గంట పదయ్యేసరికి తమతమ కంప్యూటర్ల మీద కుదిరినంత వేగంగా వేళ్ళు ఆడిస్తూ సహకరిస్తున్నారు పాపం రైల్వే ఉద్యోగులు. అయినా సరే, పక్క కౌంటరు దగ్గర కూర్చొన్న అధికారి మన కౌంటరు వాడికంటే గబగబా టికెట్లు ఇచ్చేస్తున్నాడని, అక్కడ నిలబడితే బాగుండేదని వేడివేడి నిట్టూర్పులు వదులుతున్నారు పిచ్చిజనం.

 

ఒక ఆసామి పది టికెట్లు ప్రింటు కొట్టించుకున్నాడు. అంతే, వెనుక ఉన్న జనం ఒక్కసారిగా అతనిపై దుమ్మెత్తిపోశారు. ఆ టికెట్లు ప్రింట్ అవుతున్న ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంగా గడిచింది. ఏ రైల్లో వెళ్ళాలో రాయలేదు కొందరు, ఎంతెంత వయసులో రాయలేదు మరికొందరు. అలా ఫారం సరిగ్గా నింపని వాళ్ళని కౌంటరు అధికారి తిట్టుకుంటుంటే, వెనుక నుంచున్న జనం మరికొంత కారాలు మిరియాలు నూరి వారిపై చల్లుతున్నారు.


గోడనున్న గడియారం పది గంటల 4 నిముషాలు చూపించేసరికే అన్ని రైళ్ళలో అన్ని టికెట్లూ అయిపోయాయంటూ కంప్యూటర్ స్క్రీన్ వెక్కిరించగా, ఆ మాట చెప్పిన కౌంటరు అధికారులపై కళ్ళతోనే శాపనార్థాలు పెడుతూ, నిర్లిప్తంగా బయటకు నడవసాగారు. నేనూ పిచ్చిమొహం వేసుకొని ఇంటికి బయల్దేరాను. ఇది జరిగిన అరగంటకి బస్సు టికెట్ వేట మొదలయ్యింది మా ఇంట్లో. 

 

సాధారణంగా 700 రూపాయలు దాటని టికెట్లు ఇప్పుడు 2-3 వేల పైమాటే ఉన్నాయి. కళ్ళు నులుముకొని సరిగ్గా చూశాము కంప్యూటర్ స్క్రీన్ వైపు. నిజమే! పోనీలే, ఊళ్ళో పెద్దవాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారని, వాళ్ళని ఎందుకు నిరాశపరచాలని, ఈసారికి ఇలా కానిద్దాములే అని ఖర్చుకి సిద్ధపడిపోయాం. ఒక్కొక్క బస్సు సర్వీస్ మీదా మేము క్లిక్ చేయటం, స్క్రీన్ మీద "పిచ్చిమొహాల్లారా, ఇంకా టికెట్లు ఎందుకుంటాయి? పొండెహ" అని మెసేజ్ రావటం! ఆఖరి ప్రయత్నంగా ఒక వెబ్సైట్ లో ప్రయత్నించాము. ఖాళీలు కనిపించాయి. ఒక్కొక్క టికెట్ 2000 రూపాయలు, ఏసీ సెమీస్లీపర్ అని ఉంది. అమ్మయ్య అనుకొని, టకటకా వివరాలు కొట్టేసి టికెట్ కొనేశాం, ఇవి కూడా ఎక్కడ అయిపోతాయో అని.

 

మర్నాడు రాత్రి గబగబా తయారై బస్టాప్ కి వెళ్లి బస్సు కోసం ఎదురు చూస్తుండగా, కళ్ళు నమ్మలేనన్ని బస్సులు. "హైదరాబాద్ నగరంలో ఇన్ని బస్సులకి చోటుందా" అనిపించే అన్ని. ఏ బస్సు దగ్గరకొస్తున్నా మాదేనేమో అని చూసి చూసి, కాసేపు గడిచాక విసుగొచ్చి బస్సుల నేమ్ ప్లేట్ల మీదున్న నంబర్లను టోటల్ చేయటం, ఊరు వెళ్తున్న జనాల ముఖాలని పరిశీలించటం, ఏ రంగు బస్సులు ఎన్ని వెళ్తున్నాయో లెక్కకట్టటంఏ రంగు బట్టలు ఎంతమంది వేసుకున్నారో పోల్చి చూడటంపెళ్ళైన మనుషుల్లో బట్టతలలూ, బానపొట్టలూ ఎందుకు పెరుగుతాయో దీర్ఘాలోచన చేయటం, ఏ బస్సు ఏ ఊరిదో ఊహించటం.. ఇలాంటి అత్యవసర ఘనకార్యాలు చేస్తూ గడిపాము. మూడు గంటలు ఆలస్యంగా మా బస్సు రానేవచ్చింది.

 

ఏసీ బస్సన్నారు, టీవీ ఉందన్నారు, అవేమీ లేవేమిటని మా తోటి ప్రయాణీకులు బస్సు ఉద్యోగులపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. మా సారథి మాత్రం ఏమీ ఎరుగనట్టు జనం అంతా ఎక్కారో లేదో లెక్కచూసుకొని వెళ్లి మళ్లీ నత్తనడక కొనసాగించాడు. విరుచుకుపడ్డ వారికి బీపీ బాగా పెరిగిపోతోంది. అందులో ఒకతనికి అసలు ఉదయం నుంచే రోజు బాగా గడిచినట్టు లేదు. ఆవేశంతో ఊగిపోతూ మా అందరిలో విప్లవం లేపే ప్రయత్నం మొదలుపెట్టాడు.

 

"ఏమిటి సార్ ఇది? మనం ఏమీ మాట్లాడకపోతే ఏమైనా చేయచ్చు అనుకుంటారు వీళ్ళు. ఏమిటీ బస్సుమీరు కూడా ఆ వెబ్సైట్ లోనే బుక్ చేసుకున్నారా? మీరు కూడానా? మీరు కూడానా?" అంటూ జనాభిప్రాయం సేకరించి, "వాళ్ళపై మనం కేస్ పెట్టాలి" అన్నాడు. ఉన్న వాళ్ళలో కొందరు మాత్రం "ఎందుకొచ్చిన గొడవ? ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్లి పడితే చాలు కదా? ఏసీ ఉంటేనేం? ఉండకపోతేనేం?" అని సణుగుతున్నారు. విప్లవవీరుడు మాత్రం తగ్గలేదు.

 

"దీన్ని అసలు బస్సంటారా? ఏసీ, టీవీ లేవు సరే. ఆ వెనుక ఉండాల్సిన గ్లాస్ ఏది? ఏదో ఆక్సిడెంట్లో పగిలిపోతే అట్టపెట్టె అడ్డంగా వేలాడదీశారు. లైట్లు వెలగట్లేదు. లైట్లు ఉండాల్సిన చోట వైర్లు వేలాడుతున్నాయి. అడ్డంగా వేసిన టేపులు కూడా ఊడిపోతున్నాయి. మన పిల్లలు అక్కడ వేళ్ళు పెడితే దిక్కేమిటి? లగేజ్ పెట్టుకొనే స్థలం లేదు. ఉన్నది విరిగిపోయింది. ఏదో ఆక్సిడెంటై మూల పడున్న బస్సుని పండక్కి బయటకి తీసి మనల్ని రిస్కులో పెడుతున్నారు. దీనికసలు పర్మిషన్ ఉందో లేదో! కనీసం సీట్లైనా సరిగ్గా లేవు. నట్లు ఊడి ఊగిపోతున్నాయి..." ఇంకా ఇలా ఏవేవో చెప్తున్నాడు.

 

పాసెంజర్లందరూ లేజర్ షో చూస్తున్న ప్రేక్షకుల్లాగా అతను ఎటువైపు చూపిస్తే అటువైపుకి మెడలు తిప్పి చూస్తూ "నిజమే, నిజమే" అన్నట్టు అసంకల్పితంగానే తలలు ఊపుతున్నారు. మొత్తం మీద బస్సులో విప్లవం వర్ధిల్లింది. కేసు పెట్టాలనే తీర్మానానికి ఆమోదముద్ర పడ్డాక విప్లవవీరుడు, ఆ తర్వాత మిగతా కామ్రేడ్లు కూడా గాలి ఆడకపోయినా ఏదో ఒక రకంగా రెప్పవాల్చారు. రాత్రి మూడున్నర అయ్యింది. ఆ తర్వాత కాస్త వేగం పెరిగినప్పటికీ రాజమండ్రి వెళ్ళేసరికి బారెడు పొద్దెక్కి, "సంక్రాంతి పండగ కదా? జనవరి నెల కదా?" అన్న కనికరం కూడా లేకుండా సూర్యుడు "ఢమకు ఢమకు ఢమ తకిట తకిట ధిమి" అని ఆకాశంలో విలయతాండవం చేస్తున్నాడు, రాత్రి బస్సులోని విప్లవవీరుడిలా.

 

ఇంతలో అతను లేచి మళ్లీ హెచ్చుస్థాయి అందుకొని, గాంధారం కిందకి దిగకుండా, పంచమం పైకి పోకుండా ఏదేదో చెప్పాడు. ఎవరినీ బస్సు దిగవద్దని, బస్సుని తిన్నగా పోలీస్ స్టేషన్ కే పోనివ్వాలని పట్టుబట్టారు కామ్రేడ్స్ అంతా కలిసి. ఆడ పాసెంజర్లని స్టేషన్ కు దూరంగా ఒక చెట్టుకింద నుంచోమని, మగ పాసెంజర్లంతా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి కంప్లేంట్ రాయించి, సంతకాలు పెట్టి అంతటితో శాంతచిత్తులై "ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అనుకొని ఎవరిళ్ళకు వాళ్ళు ఆటోలెక్కి బయల్దేరారు. అది ఎంతవరకు చేసుకుపోయిందో పైవాడికే తెలియాలి. ఎందుకంటే మాకైతే ఇంకెప్పుడూ చట్టం నుంచి ఎటువంటి కబురూ రాలేదు మరి!

 

మొత్తానికి ఇది మాకు ఒక మరచిపోలేని అనుభవం అయ్యింది. అసలు ముందునుంచే బస్సు ప్రయాణాలను ఇష్టపడని మేము, ఆ తర్వాత ఎప్పుడూ బస్సులో వెళ్ళలేదు, సంక్రాంతి పండక్కి అసలే వెళ్ళలేదు.

 

ఊళ్ళ నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు, పట్టణాలకు వస్తున్న వలస పక్షులు ఏడాదికోసారైనా సొంతగూటికి చేరటానికి ఎంత తహతహలాడుతున్నాయో బాగా అర్థమయ్యింది. అవసరార్థం వలసలు జరుగుతూనే ఉన్నా, కన్నతల్లి, సొంత ఊరిపై ప్రేమాభిమానాలు ఉన్నంత కాలం మన భారతదేశపు అస్తిత్వానికి ఏ లోటూ రాదు.

 

కామెంట్‌లు

Unknown చెప్పారు…
Good naration.
Sita Burugula చెప్పారు…
We had a vivid picture of what happened there. Excellent narration. Mastery over Telugu language is evident. Great job ma
kishan చెప్పారు…
Well written

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్