గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మాజీ గృహకార్య సహాయకురాలు వెంగళమ్మ (సెక్యూరిటీ రీజన్స్ కోసం, నా ఆత్మసంరక్షణ కోసం పేరు మార్చటం జరిగింది) గురించి ఈ కథ.

"గృహకార్య సహాయకురాలు" పదం కొత్తగా ఉంది కదూ? పనమ్మాయి, పనిపిల్ల, పనిమనిషి... ఇటువంటి పదాలు మనకి అలవాటు. కానీ ఇంకా మర్యాదాపూర్వకంగా ప్రస్తావించటానికి ఏ పదమైతే బాగుంటుందా అని పలుపలు విధముల ఆలోచిస్తుండగా, "అసలు ఇంగ్లీష్ లో ఏమంటారబ్బా?" అనుకున్నాను. వాడుక భాషలో "మెయిడ్" అంటారు. కానీ అందుకు సరైన అనువాదం మళ్లీ పైన చెప్పిన పదాలే. "ఇంకా ఏమంటారబ్బా?" అని ఆలోచించగా "డొమెస్టిక్ హెల్ప్" అని గుర్తొచ్చింది. దాన్ని మక్కీకి మక్కీ అనువదించలేక, ఉన్నంతలో దగ్గరగా "గృహకార్య సహాయకురాలు" అన్న పదానికి ఫిక్స్ అయ్యాను అన్నమాట.

సహాయకురాలే లేకుండా ఆరేళ్ళు గడిపేశాను బాగానే. కానీ అనివార్య కారణాల వల్ల సహాయకురాలిని నియమించుకున్నాక, ఇక సహాయానికి అలవాటు పడిన ప్రాణం "లేకపోతే నీ జత పచ్చే" అనేసింది. మరి తప్పలేదు!

మా ఇంట్లో అంతవరకు సహాయకురాలిగా చేసిన లక్ష్మి (అసలు పేరే, ఇక్కడ భయం లేదు కనుక) కడుపున కాయ పడటంతో (అలా ఎందుకంటారో!) పని చేయలేనంది. మరొక సహాయకురాలిని (ఈసారి పేరు గుర్తు కూడా లేదు) పెట్టుకున్నాను. ఆమె నాలుగంటే నాలుగే రోజులు చక్కగా, చకచకా, చురుకుగా, అందంగా పని రుచి చూపించాక, "అత్తారింటికి వెళ్లిపోవాలి, ఇక కుదరదు" అంది. అంటూనే వెంగళమ్మను పరిచయం చేసింది. "వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు వెతకక్కరలేకుండానే తీగ లాంటి గృహకార్య సహాయకురాలు దొరికిందోచ్" అని సంతోషించాను.

పనితనంలో దిట్ట మా వెంగళమ్మ. గిన్నెలు తోమేది. మళ్లీ తోముకొనేదానిని. ఇల్లు శుభ్రం చేసేది. మళ్లీ శుభ్రం చేసుకొనేదాన్ని. ఇవన్నీ పర్వాలేదులే అని అడ్జస్ట్ అయిపోయాను. కానీ వాకిట్లో ముగ్గు
వేసే విషయంలో చిత్తుచిత్తైపోయాను.

ఒకటో రోజు ముగ్గు వేయలేదు. మరచిపోయిందేమో అనుకున్నాను. రెండో రోజు అడిగాను. "ముగ్గులు నాకు రావు మే..డాం.." అంది. అది వెంగళమ్మ మార్కు పిలుపు. ఏమడిగినా "మే..డాం.." తో జవాబు ముగుస్తుంది. కొన్నాళ్ళకి ఎవరు ఎవరిని మేడమ్ అని పిలిచినా నా బీపీ రైజ్ అయిపోసాగింది వెంగళమ్మ దెబ్బకి. "ముగ్గులు రాకపోవటం ఏమిటమ్మా? అలా సగం పని చేసి సగం మానేస్తే ఎలా? ఏదో ఒక పువ్వో, నక్షత్రమో, ఏదో ఒకటి వెయ్యి" అన్నాను. "ఏమీ రావు మే... డాం..." అంది. ముగ్గే రాకుండా ఏ భారత స్త్రీ అయినా ఉంటుందా? అసలు పువ్వు బొమ్మ కూడా వేయకుండా పెరుగుతుందా? నేను నమ్మలేదు తన మాటని.

మా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు మేనేజింగ్ స్కిల్స్ గురించి. ఆ పాఠాలన్నీ మననం చేసుకొని వెంగళమ్మతో అన్నాను "ఎలా వస్తే అలాగే వెయ్యి, నేను చూస్తాను" అని. కేవలం పని తప్పించుకోవటానికి రావని అంటోందని నా మనసు గట్టిగా బల్ల గుద్దింది. "సరే, నీ కర్మ" అన్నట్టు ఒక్క లుక్ ఇచ్చింది వెంగళమ్మ. అప్పుడు అర్థం కాలేదు. పనంతా అయిపోయాక "ముగ్గు వేసేశాను, వెళ్ళొస్తాను" అంది. సరేనని, ఒక రెండు గంటలు పోయాక ఏదో పని ఉందని వాకిట్లోకి వెళ్లి చూశాను. నా జీవితానికి సరిపోయే షాక్ తగిలింది.

ఆకుపచ్చ రంగు సుద్దముక్కతో అందంగా దిద్దిన రంగవల్లిక (ఈ పదం కనిపెట్టిన వారు బ్రతికి ఉంటే ఈ కళాఖండానికి ఈ చక్కటి పదాన్ని వాడినందుకు నన్ను చంపేయటం ఖాయం). జలగలన్నీ ఒకే చోట సమావేశం అయినట్టు, వానపాములన్నీ త్రిశూలాలు పట్టుకొని యుద్ధం చేసుకుంటున్నట్టు, మంత్రశక్తులతో ఎవరో రాక్షసుడు ప్రపంచ నాశనానికి ఖగోళంలో విష తరంగాలు సృష్టించినట్టు, సింకులో టీకప్పులన్నీ ఎవరో పడేస్తే అవన్నీ బద్దలైపోయి, వాటి శకలాలన్నీ కుప్పలుగా పడి ఉంటే అందులోంచి మిగిలిన టీచుక్కలు కారుతున్నట్టు... షాక్ లో నిశ్చేష్టురాలై నిలబడిపోయిన నన్ను మా ఆయన నీళ్ళ చుక్కలు మొహాన కొట్టి కాపాడారు. ఇది ముగ్గా?


"అంతం కాదిది, ఆరంభం" అని అప్పుడు నాకు తెలియలేదు. మర్నాడు "ఆ ముగ్గేమిటి వెంగళమ్మా? సరిగ్గా వెయ్యి, చిన్నదైనా పర్వాలేదు" అన్నాను. మామూలుగా అయితే అంత ధైర్యం చేసేదాన్ని కాదు. అది వెంగళమ్మ వేయకుండా తనతో రోజూ వస్తున్న తన ఎనిమిదేళ్ళ కూతురితో వేయించిందేమో అని చిన్న ఆశతో ఈరోజు మళ్లీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ మాట అడిగాను, ఎరక్కపోయి. ఈరోజు తెల్లటి సుద్దముక్కతో మరింత ప్రస్పుటంగా కనపడేలా వేసింది. ఎండ ఎక్కువై కళాఖండం కరిగి కొద్దిగా దూరంగా పారింది కూడాను.


ఎత్తుగా ఒక బుట్టని తగిలిస్తే అందులోంచి జలగలు "కాపాడండీ..." అని అరుస్తూ కిందకి పడిపోతున్నట్టు ఉంది. మధ్యలో ఒక నాగు పాము, ఒక కొబ్బరిమట్ట కూడా ఉన్నాయి! ఇదంతా సరే, ఈ వికార ఆకారాలకి కొంత దూరంలో రెండు చిన్న ఆకారాలు వేసింది. అవి ఇంగ్లీష్ అక్షరాలు hQ ఆకారంలో ఉన్నాయి. అంటే తన ముగ్గు "హై క్వాలిటీ" ముగ్గని వెంగళమ్మ ఆత్మవిశ్వాసం కాబోలు. ఆ అక్షరాలకు మళ్లీ అండర్లైన్ కూడా చేసింది!

ఆ సాయంత్రం మా కాలనీ వీధుల్లో వాకింగ్ చేసే స్త్రీలందరూ మా ముగ్గు దగ్గర ఆగి ఈ కళాఖండాన్ని డీకోడ్ చేయటం మొదలుపెట్టారు. బయట సందడిగా ఉంది, ఏమిటా అని తలుపు తీసి చూసేసరికి దాదాపు ఒక డజను మంది చేరారు. ఆ అద్భుతసృష్టిలో వాళ్ళకి గణేశుడు కనిపించాడు. దూరంగా ఉన్న చిన్న ఆకారం మూషిక వాహనమట. భక్తాగ్రేసరులకు వైష్ణవ నామాలు, శంఖచక్రాలు గోచరించగా, యుక్తవయసు వారికి హార్ట్ సింబల్స్, మేఘసందేశాలు అగుపించాయి. సంగీత కళజ్ఞులకి అందులోనే తంబూరా, తబ్లా లాంటి వాయిద్యాలు వినిపించాయి.

వెంగళమ్మ ముగ్గులని కళాఖండాలు అంటే తప్పు లేదు, అవి నిజంగానే ఖండఖండాలుగా విరగ్గొట్టబడి ఉన్నాయి కనుక. ఇక మూడో నాటికి వెంగళమ్మ కళాపోషణకి ఉబ్బితబ్బిబ్బైన నాకు ఆ codes అలవాటైపోయి ముగ్గు ముద్దుగా, ముచ్చటగా అనిపించింది. మా కాలనీ స్త్రీలకున్న creative eye నాకెందుకు లేదు, మనమూ డీకోడ్ చేద్దామని వాళ్ళు వాకింగ్ కి రాకముందే నేనే ప్రయత్నం మొదలుపెట్టాను. ఈసారి నాకు అందులో స్వర్గం కనిపించింది. బయట ఇంద్రుడి ఐరావతం పార్కు చేసి ఉంది. దేవతలందరూ లోపల మీటింగ్ లో ఉన్నారు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు అందరూ ఆసీనులై ఉన్నారు. ఎవరో మీటింగ్ కి వస్తూ ఐరావతం పక్కనే చెప్పులు విడిచి వచ్చారు. స్వర్గంలో ఒక పెంపుడు పిచుక కూడా ఉంది. ఇంకా ఏదో మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్ నన్ను దహించేస్తోంది. ఇంకా ఏదో ఉంది, నాకు తెలియట్లేదే అని అలాగే ముగ్గులోకి చూస్తూ ఉండిపోయాను. ముగ్గుచేత hypnotize అయిన నన్ను మళ్లీ మా ఆయన నీళ్ళు కొట్టి స్పృహ తెప్పించారు.



ఇంక ఇలాగే రోజూ ఈ ముగ్గులని చూస్తుంటే బ్రహ్మజ్ఞానం ఎక్కడ వచ్చేస్తుందో అని భయం వేసి, ముగ్గులు నేనే వేసుకుందామని నిర్ణయానికి వచ్చాను. వెంగళమ్మకి పూర్తి జీతం ఇచ్చేదాన్ని, సగం పని నేనే చేసుకునేదాన్ని. ఒకసారి మా అమ్మమ్మ గారింటికి ఊరు వెళ్ళాను. వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తూ ఉండమని, మొక్కలకి నీళ్ళు పోయమని, పూర్తి జీతం ఇస్తానని వెంగళమ్మకి చెప్పి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఒకావిడ వెంగళమ్మ ముగ్గుని చూసి ఆనందోత్సాహాలకు గురై నాకు ఫోటో తీసి పంపారు. ఈసారి రకరకాల రంగుల సుద్దముక్కలను మార్చిమార్చి వేసింది పూర్తి జీతం వస్తోందనే ఉత్సాహంతో కాబోలు!

అది చూడగానే నేను కొన్ని అద్భుత సత్యాలను గ్రహించాను. ఖచ్చితంగా వెంగళమ్మ career లో కొన్నాళ్ళు ఎవరో అఘోరాల దగ్గర trainee గా చేసింది. Top left corner లో సుబ్రహ్మణ్య స్వామి. ఆ కింద pole dancer. మధ్యలో box లో విష్ణు నామాలు (ఆ box కి corners లో మళ్ళీ special effects). ఆ కింద దీపావళి fire works. Pink chalk తో గీసినవి అన్నీ olympics లో జరిగే వివిధ gymnastics పోటీల symbols. వెరసి వెంగళమ్మ చెప్పదలచుకున్న సారం... ఆటైనా, పాటైనా, వెలుగైనా, చీకటైనా, అంతా దైవేచ్ఛ, జగన్నాటక సూత్రధారి ఆయనే అని.




ఈసారి ఫోన్ చూస్తూ బిగుసుకుపోయిన నా ముఖం మీద నీళ్ళు కొట్టటం మా అమ్మమ్మ గారి వంతయ్యింది. అక్కడ మా అమ్మమ్మ గారింట్లో పని చేస్తున్నది గృహ సహాయకుడు. పాపం చాలా అమాయకుడు. అతను ముగ్గు కూడా పెడతాడట. ఆ మాట విని ఆశ్చర్యచకితురాలినై పరుగుపరుగున వాకిట్లోకి వెళ్లి చూశాను. బుజ్జిగా రెండు straight lines, నాలుగు curved lines తో ఎంత ముద్దుగా ఉందో ఆ ముగ్గు. ఆపాటి ముగ్గు కూడా మా వెంగళమ్మకు రాదాయే అని నిట్టూర్పు విడవటం నా వంతయ్యింది.


వేరే ఎవరింట్లోనూ వెంగళమ్మ పని చేసేది కాదు. వేరే ఇల్లు చూసుకోమంటే ఆ ప్రయత్నమే చేసేది కాదు. నాకు తెలిసిన ఒకావిడ తనని వాళ్లింట్లో పని చేయమని అడిగితే, ఎక్కువ పని ఉంటుందని చేయననేసింది! అద్భుతమైన పనిగత్తె వెంగళమ్మ... అందరిచేతా రిజక్ట్ చేయబడ్డ వెంగళమ్మ... తనే ఆఫర్ ని రిజక్ట్ చేసేసింది. అంటే... నాలాంటి పిచ్చిమొహం దగ్గర పని చేయటం తనకి చాలా ఈజీగా ఉందనే కదా? కర్మ, కర్మ!

ఒక ఏడాది తన పనితనాన్ని, తన కూతురి అల్లరిని, ఎడ్డితనాన్ని భూదేవంతటి ఓర్పుతో భరించాక, ఇక నావల్ల కాదని తెగించి రెండు నెలల నోటీస్ పీరియడ్ ప్రకటించేశాను. ఒక్క నెలలోనే వేరే మూడు ఇళ్ళు చూసుకుంది... మూడు! మూడు! ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ఎప్పుడో నాకు విముక్తి దొరికేది కదా? పాపం, వేరే ఏ ఇళ్ళలోనూ చేయట్లేదు, నేనూ తీసేస్తే ఎలా బ్రతుకుతుందో ఏమిటో అనుకొని ఉంచుకొని భరించాను ఇన్నాళ్ళూ. పిచ్చిమొహాన్ని కదా మరి?

నా జీవితంలో వెంగళమ్మ ఒక మరచిపోలేని కళాఖండం. ఆమె గుర్తొచ్చినప్పుడల్లా చెవుల్లో "మే... డాం..." అన్న స్వరం ప్రతిధ్వనించి ఒక్క క్షణం బీపీ అలా పెరిగి ఇలా పడిపోతూ ఉంటుంది. నన్ను అన్నాళ్ళు సహనంగా భరించినందుకు గాను, నాకు modern art లోని వైవిధ్యమైన వినూత్నమైన కోణాన్ని పరిచయం చేసినందుకు గాను, గృహసహాయకురాలిని పెట్టుకొని కూడా ఒళ్ళు వంచి పనిచేసుకొనేలా చేసినందుకు గాను... ఈ పోస్టు రాసిన సందర్భంగా వెంగళమ్మకు "గృహకార్య సహాయక సామ్రాజ్ఞి" అనే బిరుదును ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఏ ఇంట్లో ముగ్గులు పెడుతోందో ఏమిటో! May God bless that మే..డాం...

కామెంట్‌లు

Shyamala M చెప్పారు…
బాగుందండి, మీ వెంగళమ్మ తో మీ అనుభవం😊
Unknown చెప్పారు…
Super. Hilarious.....
Bharath Bhushan Reddy చెప్పారు…
..కడుపుబ్బా నవ్వించారు “మే .. డాం..“
శ్రీ లక్ష్మి కామెడి గుర్తొచ్చింది..
ఈ కళా ఖండ ఖండ కండాలు .. స్రృష్టించిన సామ్రాగ్నికి( స్పెల్లింగ్ మిస్టేక్ ఇంటెన్సనల్ :-)) .. చెత కోటి వందనాలు...మొదట్లో
మీరు ఎక్ష్ప్రెస్ చేసిన భయం.. కడు బాధ్యాతాయుతం ..
ముగ్గు కింద U/A అని రాయాలి. అంటే పిల్లలు, పెద్దల పర్యవేక్షణలో చూడాలి ..
:-)

కాలనీ వాసులది.. మీది డీ కోడింగ్ .. హిలారియస్ :-) .. ఇంకొంచెం కష్ట పడితే .. పాకిస్థాన్‌కు .. సొరంగ మార్గం దొరుకుతుందేమో..

Finest piece .. nice writing
Sita Burugula చెప్పారు…
Abbabba, em navvinchavamma. Ee kadha maa vari ki, maa ammayiki vinipinchi padi padi navvukunnam. Mee vengalamma kanipiste sashtangam oettadaniki nischayinchu kunna
Anupama Yeluripati చెప్పారు…
ఒక్క పూటలో 100 views దాటాయి. అనూహ్యమైన ఈ అభిమానానికి, ఆశీస్సులకి ధన్యవాదాలు.
అజ్ఞాత చెప్పారు…
Computer decoding vallaki ivvachu Mee Ma..dam gari muggulu
Chaala bavundi 😊
Pedda Atta చెప్పారు…
Excellent Anupama. నువ్వు సినిమాలలో హాస్య సంభాషణలు రాయచ్చు. Try cheyyi. ప్రేక్షకులకు ఒక మంచి writer దొరికే ఛాన్స్ ఉంటుంది.
Unknown చెప్పారు…
😀😀😀 mariachipoleeni experience.. very hilarious
Sai's blog చెప్పారు…
Me Gruha sahayakuralu me jeevithamlo vesina mudraku mariyu aaa mudranu intha baga varninchinanduku meeku na abhinandanalu...

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

మా మల్లి బాబాయ్