మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

నాన్నగారూ, మీకు కొద్దిరోజుల్లో షష్టిపూర్తి.

గడచిన 60 ఏళ్ళను తరచి చూసుకొంటే మీరు ఎటువంటి అనుభూతిని పొందుతారో, ఎన్ని విజయాలకు వెన్ను చరుచుకుంటారో, ఏమేమి నిర్ణయాలకు ఈనాటికీ నాలుక కరచుకుంటారో, ఏమేమి జ్ఞాపకాలకు ఆనందంతో కంటతడి పెడతారో, ఏ తీపి గుర్తులకు చిరుమందహాసం చిందిస్తారో గానీ, నేను నా మదిలో ముచ్చట్లను మీకు చెప్తాను ఈ సందర్భంగా.

మీ గతంలో నా ముచ్చట్లేమిటి అంటారా? 60 లో మొదటి 26 తీసేయగా మిగతా 34 ఏళ్ళ ప్రయాణంలో నేనూ ఉన్నాను మరి. అది చాలదూ? 34 సంవత్సరాల పరిచయంలో మీ పట్ల నాకు చాలా అసంతృప్తులు ఉన్నాయి. 10 కంప్లెయింట్లు ఉన్నాయి. అవి ఈరోజు మీకు వెళ్ళబోసుకోవాలని నిర్ణయానికి వచ్చేశాను. వినక తప్పదు మీకు.


1) మీరు నాచేత రోజూ ఊరు ప్రయాణం చేయించేవారు

నా తొమ్మిదేళ్ళ వయసు లోపు  మనమున్న ఊరిలో లైబ్రరీ లేదని పక్కనున్న పెద్ద ఊరికి సైకిల్ తొక్కుకుంటూ తీసుకువెళ్ళేవారు. మీరు పేపర్ చదువుతూ కూర్చొనేవారు. నాకు ఏ పుస్తకం కావాలంటే అది చదువుకోమనేవారు. మళ్లీ వెనక్కి సైకిల్ తొక్కుకుంటూ వచ్చే దారిలో నేనేం చదివానో ఆ కథ చెప్పమనేవారు. దీనితో నాకు reading habit అలవడటం మాత్రమే కాక, జ్ఞాపకశక్తి, ధారణా శక్తి కూడా పెరిగాలని మీ ఉద్దేశం అయ్యుంటుంది. కదా?

2) చిన్నప్పుడే పెద్దపెద్ద పుస్తకాలతో నాకు చుక్కలు చూపించారు

రాయల ప్రపంచ అట్లస్ ఉండేది మన ఇంట్లో. అందులో ఇండియా మ్యాప్, రాష్ట్ర మ్యాప్, ప్రపంచ మ్యాప్ చూపించి ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, ఊళ్ళు, నదులు, ఉపనదులు, సముద్రాలు, పర్వతశ్రేణులు, రవాణా వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, ఖగోళం, భూగోళం, శాటిలైట్లు, శౌర వ్యవస్థలు అన్నీ నా కళ్ళకి కట్టారు. ఈనాటికీ ఆ జ్ఞానం నా అతిపెద్ద 'ఆస్తి'.

3) ఎంతో దూరం నడిపించేవారు

నిత్యం రాత్రి భోజనం అయ్యాక కుటుంబ సమేతంగా వాకింగ్ చేసేవాళ్ళం తిన్నది అరిగేవరకు. తిథులు, నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు, శ్లోకాలు, పద్యాలు, పాటలు, అంతే కాక రామాయణ మహాభారత కథలు, పంచతంత్ర కథలు, ఇతర నీతి కథలు, అబ్బో... ఇక లెక్క లేదు మన కబుర్లకి. ఇలా కథలు, కబుర్ల ద్వారానే మా బాల్యం గడిచేసరికి ఎన్ని జీవితపాఠాలు నేర్పి ఉంటారో వేరే చెప్పక్కరలేదుగా?

4) ఎత్తులు, జిత్తులు నేర్పించేవారు

ఆరేడేళ్ళ వయసులో చదరంగంలో ఎత్తులు నేర్పారు. త్వరగా పనులు పూర్తి చేసుకొని క్యారమ్స్, లూడో, వైకుంఠపాళీ అందరం కలసి ఆడుకొనేవాళ్ళం. మా మొదటి స్నేహితులు మీరు, అమ్మ. గెలిచి ఉడికించేవారు, ఓడినట్లు నటించి గెలవనిచ్చేవారు. పడుతూ లేస్తూ సైకిల్ నేర్చుకున్నాను మీ నుంచే. సాధారణంగా ఆడపిల్లలకు ఎవరూ నేర్పనిది... చేతక్ నడపటం నేర్పారు. కార్ నడపటం కూడా మీరు నేర్పినదే. జయంట్ వీల్ లాంటివి ధైర్యంగా ఎక్కటం నేర్పారు. ఈనాటికీ ఎన్నో విషయాల్లో నా వెన్ను తట్టి ముందుకు నడుపుతున్నారు.

5)  పోటీలకి నాకు సాయం చేయమంటే "నో" అన్నారు

Inter-school, intra-school competitions జరుగుతూ ఉండేవి చిన్నప్పుడు. పాటల పోటీలకు అమ్మ నేర్పిన పాటలతో ఎలాగోలా ఏదో ఒక బహుమతి తీసుకొనే ఇంటికి వచ్చేదాన్ని. Essay writing, elocution competitions ప్రకటించినప్పుడు మిమ్మల్ని అడిగేదాన్ని నాకు matter చెప్పమని, చదువుకొని రాస్తానని/మాట్లాడతానని. కానీ ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఆ అంశం మీద నాతో చర్చించేవారు. దాని ప్రాముఖ్యత ఏమిటి, మంచిచెడ్డలు ఏమిటి, సమస్య-పరిష్కారాలు ఏమిటి, పర్యవసానాలు ఏమిటి ఇలా కూలంకషంగా నాకు బోధపడేలా మాట్లాడేవారు. "ఒక వ్యాసం రాస్తే, చదివే వారికి ఒక మనిషి తమ పక్కన కూర్చొని కబుర్లు చెప్తునట్లు ఉండాలి, ఒక ప్రసంగం ఇస్తే వినేవారికి ఒక మహాగ్రంథం చదువుతున్నట్లు ఉండాలి" అని నాకు నాటుకొనేలా చెప్పారు మీరు. ఎలా రాస్తే ఆపకుండా చదువుతారో, ఎలా మాట్లాడితే ఇంకా వినాలని జనం కోరుకుంటారో వివరించారు. దానితో ఏ ఒక్క పోటీలోనో గెలిచే matter నాకు ఇవ్వలేదు మీరు, జీవితంలో ఎప్పుడు ఏమి రాసినా, ఎప్పుడు ఏం మాట్లాడినా సరిపోయే అంత matter ఇచ్చారు.

6) నన్ను ఎప్పుడూ కూర్చోపెట్టి చదివించలేదు

మీ ఉద్యోగం ఒక మంచి పెద్ద పల్లెటూళ్ళో ఉండేది. హాయిగా గడిపేయచ్చు అక్కడ. రిటైర్మెంట్ వరకు అక్కడే ఉండిపోయినా అడిగేవాళ్ళు లేరు. అద్దె కూడా తీసుకోకుండా ఉండటానికి ఇల్లు ఇచ్చిన ఒక ఉత్తమురాలు, పూల మొక్కలు, చెట్లు, చేమలు, కావలసినంత ఆక్సిజన్ ఉన్న విశాల ప్రాంగణం. మాస్టారిగా ఊరంతా గౌరవం. మాకు ఇంగ్లీష్ మీడియం చదువు నేర్పగల ఒక స్కూల్, ఆసుపత్రి, లైబ్రరీ, సినిమా హాల్ లాంటి హంగులు అన్నీ ఉన్న ఊరే.

కానీ ఈలోపు అమ్మకి పక్కనే ఉన్న పట్నంలో పెద్ద స్కూల్లో తెలుగు టీచర్ గా ఉద్యోగం వచ్చింది. చాలా మంచి స్కూల్. మీరిద్దరూ "అక్కడ పిల్లల్ని చేర్చితే ఎలా ఉంటుంది?" అనుకున్నారు. "ఫీజ్ భరించగలమా?" అని కలవరపడ్డారు. "ఇంతవరకు లేనివి, పట్నంలో కొత్తకొత్త ఖర్చులు మోయగలమా?" అని కంగారుపడ్డారు. చివరికి మా ఇద్దరి భవిష్యత్తు కంటే మీ శ్రమ ముఖ్యం కాదనుకున్నారు.

పట్నానికి మారాము. మీరే రోజూ ఉద్యోగానికి ఆ ఊరు వెళ్లిరావటం మొదలుపెట్టారు. మిమ్మల్ని పెంచి పెద్ద చేసిందన్న గౌరవంతో ప్రవృత్తిగా పౌరోహిత్యాన్ని కొనసాగించేవారు వీలున్నప్పుడల్లా. పెరుగుతున్న ఖర్చుల రీత్యా ట్యూషన్ క్లాసులు చెప్పటం కూడా మొదలుపెట్టారు. తెలిసిన వాళ్ళు మొహమాటపెట్టి, బలవంతపెట్టటంతో వారానికోసారి గంటల కొద్దీ ప్రయాణం చేసి వేరే ఊరిలో ఏదో కాలేజీలో కూడా బోధించటానికి ఒప్పుకున్నారు.

ఒక్కోసారి ఇంటికి తిరిగి వచ్చి మా ముఖాలు చూసేలోపే మేము నిద్రపోయేవాళ్ళం. చదివించటం సంగతి దేవుడెవరు, కబుర్లు కూడా చెప్పే సమయం మిగిలేది కాదు. ఏదో నాలుగు రూపాయలు సంపాదిస్తే మా ఫీజ్ కట్టచ్చు, మాకు ఏదో అమర్చచ్చు అనే ఉద్దేశంతో మీకే తెలియకుండా మీరొక కొవ్వొత్తిలా కరిగిపోయేవారు. అలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఆ శ్రమ ఫలితమే అద్దె ఇల్లు సొంత ఇల్లు అయ్యింది, పెంకుటిల్లు డాబా అయ్యింది. మాతో ఏ కొద్దిసేపు గడిపినా మా జీవితానికి పనికొచ్చే పాఠాలు నేర్పేవారు అడుగడుగునా.

7) మమ్మల్ని ఎప్పుడూ ఏ టూర్ లకీ తీసుకువెళ్ళలేదు

మా కోసం జీవిత భవసాగరాలు ఈదటంలో బిజీ అయిపోయిన మీకు అంత సమయం ఎక్కడ మిగిలింది? మమ్మల్ని మాత్రం మాన్పించలేదు. అమ్మమ్మ, తాతగారితో మావయ్యల ఇళ్ళకి పంపేవారు. చెన్నై, అమృతసర్, చండీఘర్, హిమాలయాలు... అన్నీ చూసి వచ్చిన మా కళ్ళలోని ఆనందాన్ని చూసి మీరూ అవన్నీ తిరిగి వచ్చినంత సంబరపడ్డారు.


8) ఏళ్ళ తరబడి మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు

నేను డిగ్రీలోను, తమ్ముడు ఇంటర్ లోను చేరేసరికి మీకు యూఎస్ రమ్మని ఆఫర్ వచ్చింది. అభిరుచి కొద్దీ మీ దగ్గర సంస్కృతం నేర్చుకున్న ఒక ఎన్నారై డాక్టర్ గారు మీ బహుముఖ ప్రజ్ఞను గుర్తించి పరదేశంలో ఉన్న భారతీయులకు మీ సేవలు బాగా ఉపకరిస్తాయని అనిపించి అక్కడి ఒక వేంకటేశ్వరస్వామి గుడిలో ఉద్యోగంలో చేరమని ప్రోత్సహించారు. మాకు, ఉన్న ఊరికి, మీ వాళ్ళందరికీ దూరంగా వెళ్ళలేక కాదనుకున్నారు. కానీ డాక్టరు గారు, ఆయన సన్నిహితుల అకుంఠిత ప్రోత్సాహం చూసి "పోనీ, మనకి ఏమి రాసిపెట్టి ఉందో! ఈ ఒక్క అడుగు వేయటంతో మన పిల్లలు తమ జీవితాల్లో ఎన్ని అడుగులు ముందుకి వెళ్ళగలరో! సరస్వతి సేవలో ఉన్న నన్ను  స్వామివారు చూసి తన సేవ చేసుకోమని ఆహ్వానిస్తున్నారేమో!" అనుకున్నారు.

అన్నీ అనుకూల వాయువులు వీయటంతో ఒక్కొక్క ఏడు, ఒక్కొక్క ఏడు జరుగుతూ వెళ్ళాయి. విమానం మొదటిసారి ఎక్కి మీరు ఖండాంతరం వెళ్లింది మొదలు... మళ్లీ మనం నలుగురం ఒక చూరు కింద ఒక కుటుంబంగా జీవించలేదు. టీనేజ్ లో ఉన్న ఇద్దరు పిల్లల చదువులతో, అవసరాలతో, అహంకారాలతో అమ్మ ఒంటరి పోరాటం ఇండియాలో చేస్తుంటే, మీరు మీ సహచరితో వారానికోసారి ఐదు నిముషాలు మాత్రమే మాట్లాడుతూ (ఆనాటికి ఇప్పుడు ఉన్నంత సాంకేతిక అభివృద్ధి లేదు. కాలింగ్ కార్డులు కొనుక్కొని ఖరీదైన అంతర్జాతీయ కాల్స్ మాత్రమే చేయగలిగేవారు) పరిచయస్తుల సహాయంతో, చేతనయ్యీ చేతకాని వంట చేసుకొని తింటూ యూఎస్ లో ఏకాకి జీవితం గడిపారు ఎన్నో ఏళ్ళు. మీ ఇద్దరి శ్రమ, త్యాగాల పుణ్యమా అని మేము పట్టభద్రులం, ప్రయోజకులం అయ్యాము.

9) ఒక అయ్య చేతిలో నన్ను పెట్టేసి చేతులు దులుపుకున్నారు

ఏ ఆడపిల్లకి అయినా పెళ్లి అయ్యేవరకు భర్త, అత్తమామలు, ఆడపడుచులు అపరిచితులే. మీరు ఎప్పుడూ నాకు అత్తారింటిని భయంకరంగానూ చిత్రీకరించలేదు, స్వర్గధామంగానూ ప్రదర్శించలేదు. ఒక్క సూత్రం మాత్రం చెప్పారు. "అత్తారింట్లో అయినా, వృత్తి జీవితంలో అయినా జడంగా ఉండకూడదు. మంచినీటిలా పారాలి. నీటిని గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారం తీసుకుంటాయి, బిందెలో పోస్తే బిందె ఆకారం తీసుకుంటాయి, గిన్నెలో పోస్తే గిన్నె ఆకారం తీసుకుంటాయి. అలా ఉన్న వాతావరణానికి, అవసరానికి, అవకాశానికి తగ్గట్లు మనల్ని మనం మలచుకోగలిగితే మనం విజయాల కోసం వెంపర్లాడక్కరలేదు. మన జీవితంలో అడుగడుగునా విజయమే మన వెన్నంటి ఉంటుంది" అని జీవిత సారాంశాన్ని కాచి వడబోసి నాకు పోశారు.

ఎదిగినకొద్దీ ఒదగాలి అన్నారు. జీవితం ఏ తలుపు చూపిస్తే ఆ తలుపుకి తాళం చెవిని నా దగ్గర సిద్ధంగా ఉంచారు. తెరుచుకున్న తలుపును దాటి వెళ్ళాక ఎదురయ్యే ప్రతి ఆనందాన్ని ఎలా ఆస్వాదించాలో, ప్రతి ఆటంకాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తర్ఫీదునిచ్చారు. మీ వేలుని పట్టుకొని 21 ఏళ్ళు నడిచాక, మీకు ఏమాత్రం తీసిపోకుండా నా వేలును పట్టుకొని నడిపించగల ఒక అద్భుతమైన సహచరుడికి నా చేతిని అందించారు.

10) నాకు కష్టం వస్తే మీరు ఓదార్చరు.

"ఫలానా కష్టం వచ్చింది" అని మీతో చెప్పుకోవలసిన అవసరం మీరు నాకు మిగల్చలేదు. మీకు చెప్పుకొని బాధపడవలసినంత కష్టంగా నేను దేనినీ భావించను. దేనినైనా జీవితంలో ఒక భాగంగా స్వీకరించటం మీరు నాకు నేర్పారు. ఉసూరుమనటం కంటే ఉత్సాహంతో ముందుకి సాగటంలో ఎంత ఆనందం ఉంటుందో మీరు ఆచరించి మాకు చూపించారు.

నాన్నగారూ, ఎంతమంది నాన్నలు తమ కూతుళ్ళని ఇంత బాగా చూసుకుంటారో, ఇంతకంటే బాగా చూసుకుంటారో నాకు తెలియదు. నాకు మాత్రం మీరు నా మొట్టమొదటి స్నేహితుడు, మొట్టమొదటి గురువు, ఆటల్లో మొట్టమొదటి ఉజ్జీ. మీరు నా Super Dad. నా జీవిత లక్ష్యం ఒక్కటే. నా షష్టిపూర్తి నాటికి ఇంతే గర్వంగా మా అమ్మాయి నన్ను Super Mom అని అనుకొనేలా జీవించాలి. చివరిగా... 34 సంవత్సరాల్లో ఎప్పుడూ నోటితో పైకి అనని ఒక మాట... ఐ లవ్ యూ , డ్యాడ్.

https://www.koumudi.net/Monthly/2020/december/index.html




Image may contain: one or more people, people sitting, child, guitar and indoor
Image may contain: one or more people and people standing
Image may contain: 6 people, including Radha Murali and Anupama Yeluripati, people standing





కామెంట్‌లు

Unknown చెప్పారు…
Excellent pinni
Shyamala M చెప్పారు…
తల్లిదండ్రుల ఋణం ఏ విధంగానూ తీర్చుకోలేనిది, కానీ.........
తమ గురించి, తమ పిల్లల కోసం తాము చేసిన పనుల గురించి, పిల్లలు గుర్తించటమే కాకుండా, చెరిగిపోని జ్ఞాపకం గా దాచుకుని, మనస్ఫూర్తి గా మదిలో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కన్నా మధురమైన అనుభూతి తల్లిదండ్రులకి ఇంకేం ఉంటుంది చెప్పండి.
ఆ భావాన్ని సందర్భం వచ్చినప్పుడే వ్యక్తం చేస్తారు పిల్లలు........
అప్పుడు కలిగే అనుభూతి అనిర్వచనీయం......
అసలు మామూలుగా మనం ఎవరి కోసమైనా, ఏదైనా చేసినప్పుడు, అది వారు గుర్తించారంటేనే చాలా ఆనందంగా ఉంటుంది.
అలాంటిది, *తల్లిదండ్రులది బాధ్యత*, అనుకునే చాలా మందికి...., మీరు రాసింది వారిపట్ల మనకుండాల్సిన బాధ్యత ని, అంటే...., కనీసం, *మిమ్మల్ని మేము గుర్తించామనే* సంతృప్తి కలగ చేయాలనే కనీస కర్తవ్యాన్ని గుర్తు చేసినట్టయ్యింది
Unknown చెప్పారు…
అమ్మా నాన్న అమృతం, ఇక నాన్న గురుంచి ఎంత చెప్పిన అది చాలా చిన్నదే అవుతుంది. మీ ముచ్చట్లు చదివాక నాకు నేను ఆల మ నాన్న గారితో నా చిన్నప్పటి బాల్యం లోకి వెళ్ళిపోయాను.కంట తడితో కాసేపు వుండి పోయాను,

Thank you,mi ముచ్చట్లను చదివే అవకాశం ఇచ్చినందుకు.


అనన్య చెప్పారు…
"కౌముది" web magazine డిసెంబర్ 2020 ఎడిషన్లో ఈ వ్యాసం ప్రచురింపబడింది...

https://www.koumudi.net/Monthly/2020/december/index.html
Bharath Bhushan Reddy చెప్పారు…
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Bharath Bhushan Reddy చెప్పారు…
అనుపమ గారు కంట తడి పెట్టించారు.
నాన్న గురించి పిల్లలు రాయడం సాధారణమే అయినా, నాన్న చేతుల్లో పెరుగుతున్న కూతురిగా మీ స్వంత అనుభవాలలో వివరించారు. మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. మీ స్వానుభవమే అయినా మీ నాన్న గారి తదుపరి తరాల వారిగా మాకు ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పిల్లలను పెంచడంలో వ్యక్తిగత స్వేఛ్చ మరియు స్వావలంబన ఎంత అవసరమో మీ వ్యాసం ద్వారా వివరంగా తెలుస్తుంది. మీ నాన్నగారి ఆలోచానా విధానం మీ స్వభావం మీద దాని ప్రభావం మీ అనుభవాల ద్వారా స్పష్టంగా వివరించారు. ఒక సంతోషకరమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి తల్లిడండ్రుల ఆలోచనా విధానం ఎలా వుండాలో తెలియపరుస్తుంది. తన వారి కోసం నాన్న ఎటువంటి కష్టాలు ఓర్చుకుంటాడో తెలియజేస్తూ మీ నాన్న గారు తీసుకున్న నిర్ణయాల గురించి రాసిన వాఖ్యాలు మనసును చలింపజేశాయి. వందనాలు... మీకు, మీ నాన్న గారికి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్