మా మల్లి బాబాయ్

బాబాయ్ అంటే చిన్నతండ్రి, తండ్రి తర్వాత తండ్రి అంటారు. కానీ మా మల్లి బాబాయ్ 'అంతకు మించి'. మా అందరికీ తండ్రే కాదు, ఒక స్నేహితుడు, ఒక గురువు, ఒక మార్గ నిర్దేశకుడు, ఒక అన్నయ్య.

మా అమ్మకి నా మీద బోలెడంత కోపం వచ్చేసినప్పుడు, ఆ సిట్యుయేషన్ ని తేలిక చేయటానికి తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాల్లో పాటలకి సాహిత్యంతో సంబంధం లేకుండా నటుల నోటి కదలికలు ఎలా ఉంటాయో చెప్పి చెప్పి అందరినీ నవ్వించినా మల్లి బాబాయే.

"మ్రేప సోకమే లవలో డపిన పంపా సిపడువా" (ప్రేమ కోసమే వలలో పడెనే పాపం పసివాడు) అంటూ పాటల్ని తిరగేసి పాడినా, "హిల్ విలేజ్ కింగు హార్టు లుక్కరా బులక్కు ఓ బులక్కు" (కొండవీటి రాజా గుండె చూడరా) అంటూ తెలుగు పాటకి ఇంగ్లీషు రూపం ఇచ్చినా, మాయాబజార్ లో లంబుజంబులు మాటల్ని పొడి చేసి పిప్పి చేసినట్టుగా పాటల్ని తూట్లు పొడిచేసి, పొడి చేసి, పిప్పి చేసి పెట్టి పిల్లలమైన మా అందరినీ పడి పడి నవ్వించినా మల్లి బాబాయే. "ఈపాదం పుణ్యపాదం ....., నమో వేంకటేశా .... పాటలకి అనుకరణని అడిగి అడిగి చేయించుకుని, పడీపడీ నవ్వి, నవ్వలేక పొట్టలు పట్టుకునేవాళ్ళం. ఆ సందడికి, ఆనందానికీ కారణమైనా మల్లి బాబయ్యే.

మా ఊరు వచ్చినప్పుడు మాకు రోజూ మా అమ్మనాన్నలు దఫదఫాలుగా చెప్తున్న రామాయణ కథలో ఆరోజు చెప్పవలసిన సుందరకాండను నాకు, మా తమ్ముడికి కళ్ళకు కట్టినట్టు చెప్పినా మల్లి బాబాయే.

చప్పిడి సీను గారి షాపు నుంచి వీడియో కేసెట్లు, వీసీఆరూ తెప్పించి, మాయాబజార్, నర్తనశాల లాంటి పౌరాణిక ఆణిముత్యాలను, అప్పుచేసి పప్పుకూడు, మిస్సమ్మ లాంటి నిత్య హరిత హాస్య చిత్రాలను చూపిస్తూ, సీనుసీనుకీ తనవైన అద్భుతమైన వ్యాఖ్యానాలతో వాటి పట్ల మక్కువను పెంచినా మల్లి బాబాయే.

పద్యాలు, దేశభక్తి గీతాలను ఖంగుమనే కంఠస్వరంతో చెప్పి, ఆ పాత్రల్లో జీవించేసినా మల్లి బాబాయే.

నాకు తారాజువ్వలు ఎగరేయటం నేర్పినా బాబాయే, "ఇక చాలు బాబోయ్, మా వల్ల కాదు" అనిపించే అన్ని టపాకాయలు తెచ్చి "దీపావళి పండుగంటే తోగుమ్మిలో జరిగేదే" అని మా మనసుల్లో చెరగని ముద్ర వేసినా మల్లి బాబాయే.

మూడు నాలుగు తరాల ఇంటల్లుళ్ళను అందగాళ్ళని పొగుడుతూ సిగ్గుతో వాళ్ళ బుగ్గలు ఎరుపెక్కేలా చేసినా మల్లి బాబాయే, ఓసారి కూతుళ్ళ వైపు మాట్లాడుతూ, ఓసారి అల్లుళ్ళ వైపు మాట్లాడుతూ తానే గిల్లుతూ, తానే మందు రాస్తూ, మొత్తానికి ప్రతి జంటకీ తామింకా కొత్త జంటేనేమో అనిపించేలా కవ్విస్తూ నవ్వులు పండించినా మల్లి బాబాయే.

దగ్గరుండి మా పెళ్లిళ్ళు, పేరంటాలు అన్నిటినీ వైదికంగా గానీ, వైభవంలో గానీ ఎక్కడా లోటు లేకుండా జరిపించినా మల్లి బాబాయే.

తన వృత్తిలో తాను ఎవరెస్ట్. కానీ అంతటితో తన ఆకలి తీరలేదు. ఇంకా ఏదో చేయాలి అనుకున్నాడు. శంఖంలో పోస్తే తీర్థమవుతుందన్నట్టు ఒక అధికారిక ధృవీకరణ ఉంటే మంచిదనిపించి, తన జ్ఞానం మొత్తం ఒక పరిశోధనా గ్రంధంగా రాసి, అందరికీ దాని ఫలం అందేలా అందుబాటులోకి తేవాలి అనుకున్న నిజమైన "పురోహితుడు". అలా చేయాలంటే, తనకి ముందు అధికారికంగా డిగ్రీ పట్టా ఉండాలి కనుక, ఐదు పదుల వయసులో అక్షరం కూడా ప్రిపేర్ అవ్వకుండా, కేవలం లోకజ్ఞానంతో పరీక్షలు రాసి, రోజూ కాలేజీకి వెళ్లిన వాళ్ళందరినీ దాటి మొదటి ర్యాంక్ తెచ్చుకున్న ఆదర్శ విద్యార్థి. చదువుకి, జ్ఞానసముపార్జనకి వయసుతో నిమిత్తం లేదని నిరూపించి, నాలాంటి ఎందరికో ఆదర్శంగా నిలచిన బంగారు తండ్రి మా మల్లి బాబాయ్.

నా ఆనందం తన ఆనందం, నా కష్టం తన కష్టం అన్నట్టు భావిస్తాడు. చిత్రం ఏమిటంటే, నా ఒక్కదానికే కాదు, తన కడుపున పుట్టిన పిల్లలకే కాదు, సుందర గోవింద పరివారంలోని ప్రతి ఒక్కరికీ, ఇంకా ఆ పైన బంధువర్గానికి, ఇంకా ఆ పైన బంధువర్గంలోని వారికీ కూడా అలాగే అనిపించి తీరుతుంది. తననెరిగిన ప్రతి ఒక్కరికీ తను "తలలో నాలుక" అంటే అతిశయోక్తి కాదు. తానెరిగిన పరిధిలో ప్రతి ఒక్కరికీ శ్రేయోభిలాషి, గురువు, తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, స్నేహితుడు.

బాబాయ్ ఎక్కడుంటే అక్కడ గలగల. తాను గురుస్థానంలో ఉంటే ఝాంకారంతో అందరినీ ఎలా మంత్రముగ్ధుల్ని చేసి కూర్చోపెడతాడో, ఒక తమ్ముడిగానో, మరిదిగానో, బాబాయ్ గానో, బామ్మరిది గానో కూర్చుంటే చుట్టూ ఉన్నవాళ్ళకి నవ్వి నవ్వి పొట్టనొప్పులు, దవళ్ళ  నొప్పులు, కొండొకచో తలనొప్పులు కూడా తెప్పిస్తాడు.

టీవీ యాంకర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, చేతనయ్యీ చేతకాని టీచర్లు, కూతుళ్ళ చెలికత్తెలు మాట్లాడే భాషలోని అక్షర దోషాలు... తన శిష్యులో, యజమానులో ఒకొక్కప్పుడు పాపం అయోమయ పరిస్థితుల్లో చేసే చిన్నచిన్న పొరపాట్లు... కావేవీ బాబాయి కామెడీకి అనర్హం.

సాధారణంగా అక్కడున్న బంగారం మావయ్యో, భాస్కరం మావయ్యో, అలా ఎవరో ఒకరు విక్టిమ్ అవుతూ ఉంటారు బాబాయ్ వ్యంగ్య ప్రసంగాలకి. విచిత్రం ఏమిటంటే, వాళ్ళు కూడా దాన్ని ఆస్వాదిస్తారు. ఒకవేళ ఏమాత్రం ఒక్క రవ్వ నొచ్చుకుంటున్నారని సందేహం వచ్చినా వెంటనే వాళ్ళని ఐస్ చేసేసే మ్యాజిక్ కూడా బాబాయ్ సొంతం.

మనం తన ఇంటికి వెళ్ళినా, తాను మనింటికి వచ్చినా, ఇంకెక్కడైనా కలిసినా తను మన కోసం ఉంటాడు. ఎప్పుడూ మల్లి నాకు దొరకలేదు అనిపించడు. అలా తన కుటుంబానికే కాక అందరికీ అందుబాటులో ఉండటం కోసం తన నిద్రని త్యాగం చేసి, చేసి అరిగిపోయాడు. కొవ్వొత్తిలా కరిగిపోయాడు.

మీరు గమనిస్తే, నా కబుర్లన్నిటిలోనూ "బాబాయ్ ఇలా చేసేవాడు" అనటానికి నాకు చేతులు రాలేదు. వర్తమాన కాలంలోనే మాట్లాడాను. సంవత్సరీకాల సందర్భంగా అచ్చవుతున్న పుస్తకం కోసం బాబాయ్ గురించి చెప్పమని విహారి అన్నా కూడా, తాను మన మధ్య లేక సంవత్సరం అయిపోయింది అని నాకు అనిపించటమే లేదు.

రాజకీయాల్లో లేకుండా, సినిమా సెలబ్రిటీ కాకుండా, ఇన్ని వందల (వేల?) మందికి ఇష్టుడవ్వటం, తాను లేని లోటు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నా, మళ్లీ తాను లేడనే విషయమే నమ్మలేని నిజంగా ఇంతమందికి అనిపించటం ఏ మనిషికి సాధ్యం అసలు?

మా మల్లి బాబాయ్ నిజంగా చిరంజీవే.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి