టీచర్ గారమ్మాయ్

టీచర్ల పిల్లలకి చదువు బాగా వస్తుందని ఒక టాక్ ఉంది లోకంలో. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ టీచర్ల పిల్లలకి నిజంగా వచ్చేవి ఏమిటో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా ఆ పిల్లలు చదివే స్కూల్లోనే వాళ్ళ అమ్మో, నాన్నో పని చేస్తుంటే...అబ్బో...ఆ కథే వేరు.

నాకూ, మా తమ్ముడికీ దగ్గరదగ్గర స్కూల్ చదువు అంతా మా అమ్మగారు పని చేసిన స్కూల్లోనే గడిచింది. అది మా ఊళ్ళో అన్నిటికన్నా గొప్ప పేరున్న స్కూల్. 40-50 మంది టీచర్లలో మా అమ్మగారు ఒక తెలుగు టీచరు. అక్కడున్నంతసేపూ ఆవిణ్ణి "Miss" అనే పిలిచేవాళ్ళం. మేము తుమ్మినా, దగ్గినా ఆవిడకి తెలిసిపోతూ ఉండేది. పరీక్ష అంత బాగా రాయని రోజున "బాగానే రాశాన"ని చెప్పేసినా, మాకు తెలిసేలోపే మా అమ్మగారికి మా మార్కులు తెలిసిపోయేవి. ఇక అల్లరి పనుల కంప్లైంటులకి అయితే హద్దూ-పద్దూ లేదు. వారానికి రెండు-మూడు సార్లైనా మాలో ఒకరి మీద ఏదో ఒక కంప్లైంట్ మా అమ్మగారిని చేరేది.

మాకు బ్యాండు-బాజా ఉందని తెలిసినరోజు సాయంత్రం, ఆవిడ నడుస్తూ ఇంటికొచ్చేలోపు సైకిళ్ళ మీద మేము త్వరగా వచ్చేసి, ఎప్పుడూ చేయని పనులు చేసేసేవాళ్ళం. అంటే...కాళ్ళకి వేసుకున్నసాక్సు లాగి పారేయటం కాకుండా జాగ్రత్తగా చుట్టి తీసి, షూలో చక్కగా పెట్టటం, షూని స్టాండ్ మీద పెట్టటం, క్యారేజీ గిన్నెలు బుట్టలో ఉంచేయటం కాకుండా తోమే దగ్గర తెరిచి పెట్టి నానటానికి నీళ్ళు పోయటం, ఆరేసిన బట్టలు తెచ్చి మడతలు పెట్టేయటం, కాళ్ళూ-చేతులూ-మొహం కడిగేసుకుని బట్టలు మార్చుకోవటం...ఇలాంటివి అన్నమాట. ఆవిడ వచ్చేసరికి పుస్తకం తెరిచి కూర్చుని, గేటు తెరిచిన చప్పుడుకి కూడా తఃల ఎత్తకుండా చదివేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆవిడ వచ్చి ఈ వింతలన్నీ చూసేసరికి, ఆవిడ మర్చిపోయిన కంప్లైంట్ ని కూడా గుర్తుచేసినట్లయ్యేది. కానీ అప్పట్లో ఈ నిజం మేము గ్రహించలేకపోయాం. మళ్ళీ మళ్ళీ అల్లరి పనులు చేసిన ప్రతిసారీ ఇలాగే ఉండేది మా షెడ్యూలు. ఒక్కొక్కసారి అయితే ఆవిడకి కంప్లైంట్ అందకపోయినా, అందింది అనుకుని ఇలా ప్రవర్తించటం వల్ల, ఆవిడకి అనుమానం కలిగి "ఏం చేసొచ్చావ్ ఈరోజు?" అని అడిగి మరీ తెలుసుకుని డోసు ఇచ్చేవారు.

మా స్కూల్లో ఎవరి పుట్టినరోజైనా వస్తే క్లాసులో పిల్లలకి ఒకటే చాక్లెట్ ఇచ్చినా టీచర్లకి రెండు-మూడు ఇచ్చేవారు. మా క్లాసులో పాఠం చెప్తున్న టీచరుకి చాక్లెట్ వచ్చిందంటే అక్కడ మా అమ్మగారికి కూడా వచ్చిందని సంతోషించేదాన్ని. ఇక సాయంత్రం వరకు ఆవిడ పర్సునీ, అందులోని చాక్లెట్టునీ ఊహించుకుంటూ ఉండేదాన్ని. ఇది బాగా చిన్నప్పుడులెండి.

మా నాన్నగారు కూడా టీచర్ గానే పని చేసేవారు. గవర్నమెంట్ హైస్కూల్లో ఆయన ఉద్యోగం. ఎప్పుడైనా వాళ్ళ స్కూల్లో యానివర్సరీలకో, పిక్నిక్లకో వెళ్తే పెద్ద princess ని చూసినట్లు "సంస్కృతం మాష్టారమ్మాయ్" అంటూ కొత్తగా, వింతగా చూసేవారు అక్కడ పిల్లలు.

న్యూ ఇయర్ డే వస్తోంది అంటే సందడి మొదలయ్యేది. చాలామంది పిల్లలు టీచర్లకి గ్రీటింగ్ కార్డులు ఇచ్చేవారు. మా తల్లిదండ్రులకి వచ్చేవాటిలో ఒక్కొక్కదాని విలువ అర్థరూపాయి నుండి అరవై రూపాయల వరకు రకరకాలుగా ఉండేది. painting వేసిన కార్డులు, cartoons ఉన్నవి, message ఉన్నవి, పూలు, స్వీట్లు...ఇలా రకరకాల కార్డులు డిసెంబర్ 31 నాటికి ఇంటికి చేరేవి.  చాలామటుకు కార్డులు బైటవైపు బొమ్మ ఉండి, పుస్తకం తెరిచినట్లు తెరవగానే ఏదో ఒక greeting message ఉండేది. 

కొన్ని కార్డులు మాత్రం చాలా వింతగా ఉండేవి. పుస్తకంలా కాకుండా, పోస్ట్ కార్డ్ లాగా ఒకటే పొర ఉండేది. ముందువైపు చుట్టూ  పసుప్పచ్చని రంగులో మెలికల మెలికల బోర్డర్ ఉండి, మధ్యలో చిరంజీవి, వెంకటేష్, సౌందర్య, రాశి...ఇలాంటి వాళ్ళ ఫోటో ఉండేది. వెనుక వైపు ఖాళీగా ఉండేది. అంటే ఆ ఖాళీలో వాళ్లకి నచ్చినది వాళ్ళు రాసి ఇచ్చేవారు. ఆ రాతల్లో కూడా చాలా వెరైటీ కనిపించేది.

ఒక కార్డు మీద పైన "మీ సుజాత" అని, మధ్యలో "wish yu hapy new yaear" అనీ, అడుగున "మాష్టారు గార్కి" అనీ ఉండేది. 
ఇంకొక కార్డు మీద చిన్నాభిన్నమై ఉన్న అక్షరాల్ని కూడదీసుకుని చదవగా "నుతన సంవచ్చరం సుబాకంక్షలు మాస్టారు గారు మేడంగారు" అని ఉండేది.
మరో అభిమాని ఇచ్చిన కార్డులో "ప్రియమైన సంస్కృతం మాస్టారు గారండీ, ఈ సంవత్సరం మీరు కోపం పడకూడదు" అని ఉండేది.

కొందరు పిల్లలు చక్కగా వాళ్ళే రంగురంగులలో గ్రీటింగ్ తయారు చేసి ఇచ్చేవారు. అసలు పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకుని, చదువు చెప్పే టీచర్లకి గ్రీటింగ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళ అభిమానం, ఆప్యాయత, అమాయకత్వం చాలా గొప్పవి. నేను మా తల్లిదండ్రులకి వాళ్ళ 'పిల్లలు' ఇచ్చిన గ్రీటింగ్స్ అన్నీ దాచేదాన్ని.

టీచర్ గారి అమ్మాయి అయినందుకు నాకు ఒకొక్కసారి ఉడుకుమోతుతనం వచ్చేది. మా స్కూల్ పిల్లల్ని అందరినీ ప్రతి సంవత్సరం కర్నాటక, హైదరాబాద్...ఇలా ఏదో ఒక టూర్ కి తీసుకెళ్ళేవారు. పిల్లల్ని చూడటానికి టీచర్లు కూడా వెళ్ళాలి కదా? ఒక్కొక్క టీచర్ కిందా 7-8 మంది పిల్లల్ని ఎసైన్ చేసేవారు. మా క్లాస్ అమ్మాయిలు వేరే టీచర్ కింద ఉండగా, నన్ను మా అమ్మగారి టీం లో వేయాలని మూడు క్లాసులు తక్కువ ఐన పిల్లలతో వేసేవారు. నాకేమో మావాళ్ళతో ఉండాలని ఉండేది. టూర్ రూల్స్ లో కొబ్బరినూనె తెచ్చుకోవద్దని ఉండేది (పిల్లలు చేతకాక మూతలు సరిగ్గా పెట్టకపోయినా, వాడటం చేతకాకపోయినా ఒలికి అన్నీ పాడు చేసుకుంటారని). అది విని నేను ఎగిరి గంతేశాను. వారం రోజులు నూనె తప్పించుకోవచ్చని, ఒక్క జడ, పోనీటైల్...ఇలా రకరకాల హెయిర్ స్టైల్ చేసుకోవచ్చని. కానీ మా అమ్మగారు "అవన్నీ అమ్మలు పక్కన లేని పిల్లలకి. మనం తీసుకువెళ్ళచ్చు" అంటూ చక్కగా నూనె సీసా తీసుకొచ్చి, తలంతా నూనె రాసి, స్కూల్ కి వేసినట్లు రెండు జడలు రిబ్బన్లతో అల్లి వేసేవారు. నేను ప్రతిరోజూ మధ్యాహ్నం అయ్యేవరకు మొహం కందగడ్డలా ఎర్రగా చేసుకుని ఉండేదాన్ని. అప్పట్లో నాకు రెండు జడల్లో ఉన్న అందం ఎక్కడ తెలుసు? ఇప్పుడు ముచ్చటగా వేసుకుందామన్నా కుదరదు!

కానీ ఏమాటకామాటే! తన స్కూల్లోనే పిల్లల్ని చదివిస్తూ, నిరంతరం యోగక్షేమాలు కనుక్కునే తల్లి ఉండటం ఎంతమందికి దొరికే అదృష్టం? ముఖ్యంగా పిల్లల్ని చదివించే తీరిక కూడా దొరకని కొందరు ఈ కాలపు తల్లుల్ని చూస్తుంటే అనిపిస్తుంది....I am pround to be teachers' daughter. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మాత్రమే కాకుండా ఒక టీచర్ గా కూడా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు నడవడికను తీర్చిదిద్దే సత్తా 'ఉన్నవాళ్ళ' కడుపున పుట్టిన అదృష్టవంతురాలిని నేను. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నా, దానికి నాకు వాళ్ళు చెప్పిన/చెప్పించిన 'చదువే' కారణం. అందుకే నాకు నన్ను 'పెంచిన' ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవం. ఎప్పటికైనా 'టీచర్' ని అయ్యే అవకాశం వస్తే తప్పక ఉపయోగించుకుంటాను.




కామెంట్‌లు

Chaitanya చెప్పారు…
Article chaala baagundi. Kaani okka paragraph ki inkoka paragraph ki sambandham unnatlu ledu. Andukani eesari raasetappudu edo oka melikapetti article complete cheyi. Appudu chadivevaallaki interest kalugutundi. Conclusions chaala baagunnayi.
అజ్ఞాత చెప్పారు…
Okkasari ma teachers ni gurthu techaru 😊
Really those days were golden!!!!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్