బట్టల కొట్టు


మా చుట్టాలాయన ఒకాయన అంటుంటారు "బట్టల కొట్టుకి వెళ్తే కళ్ళ ఎదుట టేబుల్ మీద వంద చీరలు వేసినా, ఇవన్నీ కాదని ఆడవాళ్ళు నూట ఒకటో చీర కోసం చీరల అరలో వెతుకుతార"ట!!

ఆడవాళ్ళు బట్టల కొట్టులోకి వెళ్తే ఒక పట్టాన బయటకి రారని ఎవరన్నారో కానీ, వాళ్ళు సరిగ్గా రీసెర్చి చేసైనా ఉండరు, లేక నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం కలవారైనా అయ్యుండరు. కచ్చితంగా మగవారు మాత్రం అయ్యుంటారు.  బట్టలంటే ఇష్టం లేనిది అసలు ఎవరికండీ? అసలు నన్ను అడిగండి...నిజమైన నిజాలన్నీ నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా చెప్పేయగలను. భార్య బట్టల కొట్లోకి వెళ్తే కొట్టు బైట స్కూటర్ మీద కూర్చుని ఎదురుచూసే భర్తలకి ఒకటే భయం. లోపలకి వెళ్తే వాళ్ళు ఎక్కడ tempt అయ్యి కొట్లో సగం సరుకు కోనేస్తామో అని. పైకి మాత్రం చెప్పరు. వాళ్లకి సరిగ్గా తెలిస్తేగా?

కొన్ని విషయాల్లో ఆడవాళ్ళకి ఉన్నంత నిర్ణయ శక్తి, ఆత్మ నియంత్రణ మగవారికి ఉండనే ఉండవు. అందులో బట్టల కొనుగోలు ఒకటి. వీళ్ళు పదిపన్నెండు రకాలు ఎంచి చూసి, ఏడెనిమిది రకాలుగా ఆచితూచి, ఐదారు కోణాల్లో ఆలోచించి, నాలుగైదు అనుభవాలు పరిగణలోకి తీసుకుని, రెండుమూడు సలహాలు తీసుకుంటూ, చివరికి ఒకటి సెలెక్టు చేస్తారు.

"ఏది మనకి అవసరం, ఏది కాదు?"
"ఏ క్లాతు ఎంత పలుకుతుంది? నిజంగా దానికి అంత విలువ ఉందా, అది కొట్లో నడుస్తున్న AC బిల్లు తాలూకు వడ్డనా?"
"పక్క మార్కెట్టులో ఇదే చీర ఇంత చెప్పలేదే?"
"మనమ్మాయికి ఈ రంగు నప్పుతుంది, కానీ డిజైను నచ్చకపోవచ్చు."
"చంటాడు ఆటలాడి మాపుకున్నా ఈ రంగైతే కనిపించకుండా ఉంటుంది."
"డిటర్జెంట్ వేసి నానపెడితే ఈ dye నిలవదేమో!"
"అత్తయ్యగారికీ, అమ్మకీ దగ్గర దగ్గర రంగులయితే ఎలా? ఆవిడ ఛాయకి ఇదే బాగుంటుంది."
"పండక్కి ఖర్చు ఉంటుంది కనుక బట్టలకి ఈమాత్రం ఖర్చుతో ఆగుదాం. వచ్చే పండక్కి అవి కొనచ్చులే."
"ఈ నెల చిన్నత్తయ్య గారు వస్తారు. ఆవిడకి చీర పెట్టాలి. ఆవిడ పాలిస్టర్ కడుతున్నారో, మానేశారో!"

......ఇలాంటి లక్ష ఆలోచనలతో కూడిన పేద్ధ పని అయినా శాంతంగా, సహనంగా ఇష్టం తో చేస్తారు ఆడవాళ్ళు. ఇక మగమహారాజులు వీటిలో ఒక్కటీ ఆలోచించరు సరికదా.....

"నీకు బట్టలంటే అంత పిచ్చి ఏమిటీ?"
"మొన్నే కదా కొన్నాం? ఏం? పక్కింటావిడ కొనుక్కున్నారా ఏమైనా?"
"ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆఫ్టరాల్ బట్టలు కొనటానికి ఇంత టైమా?"
"ఎన్ని షాపులు తిరుగుతావ్? ఒక పట్టాన నీకు ఏమీ నచ్చవేం?"
"ఇప్పుడు మ్యాచింగ్ లేకపోతే ఏమిటట నష్టం?"
"ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు ఎందుకూ? ఏమీ అక్కరలేదు. టీవీ లో మ్యాచ్ ఉంది."
" నేను ఇక్కడే నుంచుంటాను. ఎందుకు లోపలకి రావటం?"

...ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. వాళ్ళు షాపులోకి వచ్చి బుర్ర పెట్టనంతవరకే. ఎప్పుడైనా సొంత నిర్ణయంతో షాపింగ్ చేయాల్సిన అవసరం పడ్డప్పుడు తేటతెల్లం అవుతుంది వాళ్ళ టాలెంట్. ఆడవాళ్ళ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ టైము పడుతుంది పని అయ్యేసరికి. లేదూ, సగం టైములోనే ముగించుకుని వచ్చారా...ఇక ఆ సెలెక్షను సంగతి సరేసరి.

వాళ్ళు మాత్రం ఏం చేస్తారులెండి? మరి బట్టల షాపింగ్ అంటే అంత సులభమా? ఆ షాపు వాళ్ళు కష్టమర్లపై చేసే మాయాజాలం అలాంటిది.

మన శ్రేయస్సు కోసమే తపిస్తున్నట్టూ; అసలు మనం ఎప్పుడు షాపుకి వస్తామా, ఎప్పుడు మన సేవ చేసుకుని తరిద్దామా అని ఎదురు చూస్తున్నట్టూ; మనకన్నా అందగాళ్ళూ, అందగత్తెలూ వాళ్లకి ఎప్పుడూ కనపడనట్టూ; షాపు లాభాలూ-తన జీత భత్యాలూ కన్నా, మనకి తక్కువ ధరకి మంచి బట్టలు దొరకటమే వాళ్ళ జీవితానికి పరమావధి అన్నట్టూ మాట్లాడేస్తూ, ప్రవర్తించేస్తూ ఉంటారు!

"మేడం! మీకు ఇదే బాగుంటుంది."
"అది ఎందుకండీ? ఇప్పుడు ఎవరూ కట్టట్లేదు." (మరి ఎందుకు ఇంకా అమ్ముతున్నట్లో!)
"ఈ రంగు మరీ బ్రైట్ అయిపోతుంది మేడం. అది అయితే నీటుగా ఉంటుంది."
"ఇప్పుడు గళ్ళ డిజైను నడుస్తోందండీ. చుక్కలు ఎవరూ కట్టట్లేదు." (వాళ్ళ దగ్గర చుక్కలవి లేవన్నమాట!)
"ఆ రంగు నిన్నే ఐపోయాయండీ. మళ్ళీ రెండు రోజుల్లో వస్తాయి. కానీ ఈ రంగు చూడండి ఈలోపు."
"ఆ పెద్ద పువ్వులు బక్కగున్నావాళ్లకి. మీరు నిండుగా ఉన్నారు. మీకు చిన్న పువ్వులు బాగుంటాయ్." (లావుపాటి ఆవిడతో)
"ఆ చిన్న పువ్వుల డిజైను లావాటి వాళ్ళకండీ. నాజూకు వాళ్లకి పెద్దవి నయం." (బక్కావిడతో)
"అంచు రంగు కన్నా చీర రంగు అయితేనే జాకెట్ బాగుంటుందండీ." (దూరం నుండి చూసే వాళ్లకి తిడుతున్నాడేమో అనిపించే వాయిస్ లో!)
సహజంగానే ఆడవాళ్ళకి ఇంత లౌక్యం తెలియదు. అందుకే మగవాళ్ళే ఎక్కువ కనిపిస్తారు సేల్స్ లో.

ఇక బట్టల కొట్లలో పెట్టే "సేల్స్" మాట చెప్పుకోక తప్పదు. పండగల ముందు ఒక రకం డిస్కౌంట్ సేల్, పండగనాడు ఇంకొక రకం డిస్కౌంట్ సేల్, పండగ ఐపోయాక మరొక రకం డిస్కౌంట్ సేల్ పెడతారు. ఏ పండగా లేని సీజన్ అనుకోండీ..."పుట్టింటి చీరలు", "అక్కాచెల్లెళ్ల చీరలు" అంటూ కొత్త "రకం" చీరలు కనిపెడతారు. ఇక సినిమా చీరల మాట చెప్పే అక్కరలేదు. "దసరా బుల్లోడు చీరలు", "ప్రేమనగర్ చీరలు", "చూడాలని ఉంది చీరలు", "వర్షం శారీస్"...ఇలా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈమధ్య ఐదారేళ్లుగా నడుస్తున్న ట్రెండ్ "వర్క్ శారీస్". మామూలు సిల్క్ చీరలైనా, జరీ చీరలైనా, పట్టుచీరలైనా...ఏ చీరైనా సరే...దాని పైన దారాలతోనో, రాళ్ళతోనో, రతనాల తోనో...జిగేలుమనిపిస్తే చాలు...ఆ చీర విలువ పది రెట్లు పెరిగిపోతుంది!! బట్టల కొట్లలో దాగి ఉన్న "మయసభ" తెలుసుకోగలగటం మయుడి వల్లైనా కాదు! ఆ సభని కట్టే పనివాళ్ళు ఆ బట్టలకొట్టు 'సేల్స్ మెన్'.

మామూలుగానే వాళ్ళ వలలో చిక్కక తప్పించుకోలేము. ఇక పెళ్ళిళ్ళ సీజన్ వస్తే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు అనుకునే పట్టుచీర మనం కొనకపోతే మనం ఇన్నాళ్ళూ గడిపిన జీవితం అంతా వృధా అనిపించేటట్లు మభ్యపెట్టేస్తారు. మనమ్మాయికి పెళ్లి తలపెట్టి కనీసం 'ఇంత' రేంజ్ లో పట్టుచీర కొనకపోతే పిల్లకి అన్యాయం చేసినట్లే అని నమ్మించేస్తారు. పెట్టుబడికి ఎలాంటివి పెట్టాలో డిసైడ్ కూడా చేసేస్తారు. చీరలు కొన్నాక లైనింగ్ పీసులు, ఫాల్స్ లాంటివి కూడా వాళ్ళ షాపులోనే కొంటే మనం ఎంత ఆస్తులు కాపాడుకున్నట్లో కూర్చోపెట్టి, కూల్ డ్రింక్ ఇచ్చి మరీ కూలంకషంగా చర్చిస్తారు. ఒకవేళ హడావిడిలో పడి మనం మర్చిపోయినా.....

"పంచలు ఏమైనా చూస్తారా?"
"పిల్లల బట్టలు వద్దా?"
"పెళ్లి కొడుకు బట్టలు కొత్త మోడల్స్ వచ్చాయి."
"మీ అల్లుడికి సూటు పెడుతున్నారా, షేర్వాణీ పెడుతున్నారా?" (అది అయితే టై-బెల్ట్, ఇదైతే తలపాగా, బూట్లు కొనిపించాలి మరి.)
"కొన్ని పాలిష్టరు, కొన్ని వాయిల్ చీరలు కొనండి పెట్టుబడికి"
"ఆడపడుచుకి ఇంకో చీర కూడా పెడతారు కదండీ...మూడే కొన్నారు?"

....అంటూ గుర్తుచేసి మరీ మన ఇంటి పెళ్లి ఏర్పాట్లలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఆరోజుతో పూర్తి చేయిస్తారు. మళ్ళీ రేపో, ఎల్లుండో అయితే అక్కడికే వెళ్తామని గారంటీ లేదుగా?

వాళ్ళ సంగతి అలా ఉంచితే, పెళ్లి బట్టలు తక్కువకి కొనుక్కోవటం కోసం చార్జీలు పెట్టుకుని ఎక్కడికో వెళ్లి కొనేవాళ్ళ గురించి చెప్పుకోవాలి మనం. రాజమండ్రి బజార్లో తక్కువకి కొనుక్కోవచ్చని హైదరాబాద్ వాళ్ళు అక్కడకి వెళ్తే, హైదరాబాద్ లో చవకని రాజమండ్రి వాళ్ళు ఇక్కడకి రావటం నేను చూశాను. ఇంక కంచి, చీరాల, మంగళగిరి, పోచంపల్లి, వేంకటగిరి, ధర్మవరం...ఇలాంటి పేరు పొందిన 'మార్కు' బట్టల కోసం అక్కడికి వెళ్లి మరీ కొంటారు ఎంతోమంది. 'గంప లాభం చిల్లు కూడపెట్టింది' అన్నట్టు...'అక్కడకి వెళ్ళిన వాళ్ళ బస్సు/రైలు చార్జీలు (ఒక్కరం ఎలాగూ వెళ్ళం), ఆటో చార్జీలు, భోజనం, ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే మిగిలేది ఎంతో పాపం' అనిపిస్తుంది నాకు. ఎంతో కొంత లాభం ఉంటుందేమోలెండి.

ఏది ఏమైనా ఒక్కటి నిజం..మనిషికి కూడు-గూడు-గుడ్డ అవసరం అంటారు. 'ఎంత చెట్టుకి అంత గాలి' అన్నట్లు ఎవరి తాహతుని బట్టి వాళ్ళు బట్టలు తప్పక కొంటారు.  'అవసరం' స్థాయి దాటి, 'ఆడంబరం' స్థాయి దాటి, 'వెర్రి' స్థాయి కూడా దాటుతూ ఉంటుంది ఒక్కొక్కసారి బట్టల విషయం. అది వాళ్ళవాళ్ళ అభిప్రాయాల్ని బట్టి ఉంటుందనుకోండి...

మనం అప్పుడప్పుడూ పక్క వాళ్ళ బట్టలని చూసినప్పుడు, "అయ్యో. అయితే నేను ఎక్కువ పెట్టి నష్టపోయాను అన్నమాట" అని కానీ, "ఏమైనా నా మోడలే  బాగుంది. ఆమాత్రం కర్చుపెట్టటంలో నష్టం లేదులే" అని కానీ, "అమ్మయ్య. నేను డిస్కౌంట్ లో కొనటం వల్ల చాలా లాభం పొందాను" అని కానీ అనుకుంటూ ఉంటాం.

అయితే.....నిజానికి చివరకి ఎవరికి లాభం?...కోనేవారికా? కట్టేవారికా? కుట్టేవారికా? అమ్మేవారికా? నేసేవారికా? మధ్యవర్తులకా? అనేది ఆ పైవాడికే తెలియాలి.







This essay got published in the souvenir of NATS (North America Telugu Society) "Sambaraala Sanchika" in July 2011.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
Well said Anupama. You ended your thought with a question -- "who gets benefited at the end? purchaser? user? weaver? seller? tailor? or middle men?"

I think, the answer is all the above and more. Each time you spend a penny, Government gets a cut out of it. Since Government is "by the people, for the people and of the people", all these people will be benefited.

In other words, you are helping the money to be in circulation -- that is a winning habit.

Hope, I am not giving an idea to you to spend all that you have on cloths. Am I?

As long as you and your partner are consulting, budgeting and spending per the planned budget, you are the winner my dear.

"saMpAdiMchu, koMta podupu cheyyi, koMta kharchu cheyyi" -- apai enjoy cheyyi.

-- seema sastri.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్