నయా "గారం"
ఈనాటి కోరిక కాదు ఇది. చిన్నతనంలో దాని గురించి విన్నప్పటి నుండి ఎందుకో అదంటే ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. రెండేళ్ళ క్రితం వరకు "ఆ...ఇది జరుగుతుందా, పెడుతుందా?" అనుకునేదాన్ని. కానీ జరుగుతుంది అని తెలిశాక, కొన్ని నెలలుగా "ఎప్పుడెప్పుడా?" అనుకుంటూ గడిపాను. తీరా కన్ను మూసి తెరిచేసరికి ఐపోయింది..అని ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు.
'నయాగరా జలపాతం'...ఎటువంటి 'మూడ్' లో ఉన్న మనిషికైనా నూతనోత్సాహాన్ని నింపగల మాయ తెలిసిన మహాద్భుతం. అమెరికా దేశంలో అడుగు పెట్టిన భారతీయులెవ్వరూ దీన్ని పలకరించకుండా వెనక్కి బయల్దేరరు. ప్రత్యేకించి భారతీయులు అని ఎందుకు అంటున్నానంటే...ప్రకృతి అంటే మనవాళ్ళు ప్రాణం పెడతారు, నాకు ఇతర దేశీయులతో పరిచయమూ లేదు. నాకూ అమెరికా వస్తానని తెలిసిన దగ్గర నుండి ఎప్పుడు వెళ్లి నయాగరాను చూడాలా...అని ఆరాటం ఉండేది.
మా అత్తగారు, మామగారు మమ్మల్ని చూడటానికి అమెరికా వచ్చినప్పుడు కొన్ని మంచి మంచి ప్రదేశాలు చూపించాలి అని ప్లాన్ వేసుకుని, ఆ లిస్టు లో మొట్టమొదట దీని పేరు రాసేశాం. వాళ్ళ ఆరు నెలల అమెరికా ప్రయాణంలో రెండున్నర నెలలు ఐపోయాక చికాగో వెళ్లాలని అనుకున్నాం. ఇంకొక నెలన్నర కౌంట్ డౌన్ అయ్యేవరకు మాకు ఏ వీకెండూ ప్రకృతి సహకరించలేదు. ఇక ఒకరోజు చికాగో వద్దు, నయాగరా వెళ్దాం అనుకున్నాం. అంతే..ముహూర్తం కుదిరితే ఎవ్వరూ ఆపలేరన్నట్లు అనుకున్నదే తడవుగా మర్నాడు ప్రయాణమయ్యాం నయాగరాకి. ప్రకృతీ కిమ్మనకుండా ఉంది.
శనివారం పొద్దున్నే బయల్దేరుతాం అనగా శుక్రవారం రాత్రే రెండు పూటలకి సరిపడా వండుకుని సర్దేసుకున్నాం. 'పొద్దున్నే మూడింటికి లేచేశాను' అన్న బద్ధకం గానీ, 'కారు రెంటుకిచ్చిన వాడు (లెర్నర్స్ పెర్మిట్ మాత్రమే ఉన్న) నన్ను నడపద్దు అన్నాడ'న్న బాధ గానీ, 'సమయానికి నయాగరా కోసమని దాచుకున్న డ్రెస్ టాప్ కనిపించలేద'న్న బెంగ గానీ లేకుండా కార్ లో ఉల్లాసంగా కూర్చుని ప్రయాణం చేశాను. పాపం ఎనిమిదిన్నర గంటల ప్రయాణం..మా ఆయన ఒక్కరే కార్ నడిపారు. నలుగురం కలిసి పాటలు పాడుకుంటూ ఝాం ఝాం మని ప్రయాణం చేశాం. మధ్యలో వండుకుని తెచ్చుకున్న ఇడ్లీలు లాగించినా, హోటల్ రూం కి చేరేసరికి కడుపులో గణగణా గంటలు మోగేస్తున్నాయ్ నలుగురికీ. ప్యాక్ చేసి తెచ్చుకున్న లంచ్ పూర్తి చేసేసి గబగబా తయారైపోయి బైల్దేరాం.
నయాగరా జలపాతం హోరు మొదట ఎవరు వింటారు, పాతాన్ని మొదట ఎవరు చూస్తారు...అని పందేలు పెట్టుకుంటూ వెళ్లాం. కొద్దిగా దారి తప్పినా, మొత్తానికి చేరుకున్నాం. తీరా వెళ్లి చూద్దును కదా...నా ఉత్సాహం కొద్దిగా నీరు కారింది. మా మీద అలిగినట్లు జలపాతం ఒక్క 125 డిగ్రీలు అటువైపుకి తిరిగి నుంచుంది. నేను ఇంటర్నెట్ లో, పుస్తకాల్లో చూసిన ఫోటోలలో లాగా మనకి ఎదురుగా జలపాతం మన వైపుకి పడుతూ దర్శనం ఇస్తుందనీ, కనుచూపు మేరలో ఎడమ వైపు చివర నుండి కుడి వైపు చివర వరకు జలపాతమే ఉంటుందనీ ఊహించుకున్నాను అంతకుముందు. ఇప్పుడు అలా లేదు సరికదా, పక్కకి (ఇంకా చెప్పాలంటే వెనక్కి) తిరిగి దాక్కుంది ఇది. నేను చూసిన ఫొటోలన్నీ కెనడా వైపు నుండి తీసినవి కాబోలు అనుకున్నాను.
అయితే 'maid of the mist' అనే బోట్ రైడ్ తీసుకున్నప్పుడు నా కల నెరవేరింది. ఆ నీటి ప్రవాహం అలా కిందకి పడి, రాళ్ళకి కొట్టుకుని, చింది అల్లంత దూరాన ఉన్న మన మీదకి పడుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం. దీన్ని నేను గంగావతరణంతో పోల్చాలా, క్షీరాభిషేకంతో పోల్చాలా, ఇంకేమైనా ఉపమానాలు వెతకాలా అని ఆలోచించాను, చివరికి ఆ ప్రయత్నం మానుకుంటున్నాను. కొన్ని పోల్చకుండా, వర్ణించకుండా ఉండటమే కరెక్ట్ కదా?
అది అయిపోయాక, చీకటి పడ్డాక వేసే 'ఇల్ల్యూమినేషన్ షో' చూడటం కోసం మేము చాలాసేపు ఆ పక్కనే ఉన్న పార్కులో కూర్చున్నాం జలపాతం ఉన్న వైపు చూస్తూ. అంతసేపు మేము కూర్చున్నందుకు, పాపం మా ఆయన ఎనిమిదిన్నర గంటలు కారు నడిపి తీసుకు వచ్చినందుకు, జాలి పడి ఆ జలపాతం ఒక్క పది నిముషాలు ఇటు వైపుకి తిరిగి నుంచుని, మళ్ళీ అటు తిరిగిపోవచ్చు కదా...అనిపించింది. ఆ రాత్రి షో మరొక చక్కటి అందం. ఏమైనా హోలీ ఆడుతున్నట్లున్న ఆ నయాగరా తల్లి కుడి చెంపని మాత్రమే చూడగలిగాం మేము.
హోటల్ కి వచ్చి, మారు మాట్లాడకుండా ఆ అందాన్ని కళ్ళలో నింపుకుని నిద్రలోకి జారుకున్నాం. మర్నాడు మళ్ళీ తొమ్మిది గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాం. నా చిరకాల వాంఛలలో ముఖ్యమైన దీన్ని మా ఆయన తీర్చారు. అయితే ఆ చిన్న 125 డిగ్రీ అసంతృప్తి మిగిలిపోయింది. ఈసారి కెనడాలో ప్రాజెక్టు సంపాదించమంటూ మా ఆయన దగ్గర 'నయా' 'గారా'లు పోయాను నేను.
కామెంట్లు