కాగితం చూసి...


కొన్ని జ్ఞాపకాలు రాగానే మనలో మనం ముసిముసిగా నవ్వుకుంటాం. కొన్నిటికి మనసులో అలజడి కలుగుతుంది. కొన్ని గుర్తురాగానే "చ...అలా ఎందుకు జరిగిందిరా బాబూ? నేను ఆ పని చేస్తే బాగుండేది" అనిపిస్తుంది. కొన్ని గుర్తొస్తే మన మీద మనకే చిరుకోపం వస్తుంది. కొన్నిటికైతే సిగ్గుతో తల దానంతట అదే దిగిపోతుంది. నాకు ఇవన్నీ ఒకేసారి కలిసి వచ్చేస్తాయి ఒక విషయం గుర్తొస్తే.

అప్పుడు ఎంత వర్ణనాతీతమైన ఫీలింగ్ వస్తుందంటే...ఒక టైం మెషిన్ దొరికితే, ఎంత డబ్బులు కర్చు పెట్టైనా సరే, దాని టికెట్ కొనేసి ఒక పదహారు సంవత్సరాలు గిర్రున వెనక్కి వెళ్ళిపోయి, ఒక బటన్ నొక్కేసి అంతా మార్చేయాలి అనిపిస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు టైం మెషిన్ తయారు చేసేది ఎవరు? నాకు టికెట్ అమ్మేది ఎవరు?

నా చిన్నతనంలో, మేము పెదపాడులో ఉండే రోజుల్లో మా నాన్నగారు దసరాలకి చింతలపూడి వెళ్లి వస్తూ ఉండేవారు. అక్కడ విశ్వనాథ మఠం అనే ఒక ఆశ్రమంలో పండగ కార్యక్రమాల్లో భాగంగా ఉపన్యాసాలూ, ప్రదర్శనలూ ఏర్పాటు చేసేవారు. అందులో మా నాన్నగారి ఉపన్యాసం ప్రతిరోజూ ఉండేది. అలా ఒక ఏడాది మా నాన్నగారితో మేమందరం వెళ్ళాము. ఆ ఏడు దసరాకి మా నాన్నగారి గురువుగారు దోర్బల ప్రభాకర శర్మ గారు కూడా వచ్చారు వక్తగా.

ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. సృజనాత్మకత, అంకిత భావం సమపాళ్ళలో కలిపి ఒక రూపం ఇచ్చి ఆయన్ని కిందకి పంపాడు దేవుడు. ఆయనకి సంస్కృత భాష అంటే ఎంత ప్రేమ అంటే...ఆయన ఎవరితో అయినా సంస్కృతం లోనే సంభాషిస్తారు. కూరగాయలు అమ్మేవాడి నుండి, ఆయన శిష్యుల వరకు ఎవరితో అయినా సంస్కృతం లోనే మాట్లాడతారు. అవతల వాళ్లకి అర్థం కాదు అనే ప్రసక్తే లేదు. అంత సరళంగా, 'సంస్కృతం అంటే ఒక వింత బాష, ఒక కష్టమైన భాష' అనే భావనలు పోయి 'సంస్కృతం మన భాష' అనిపించేలా మాట్లాడతారు. ఎవరైనా ఫోన్ చేస్తే "హలో" అనటానికి బదులుగా " హరి:  ఓం" అంటారు. సంస్కృత భాష గురించి, దేశభక్తి గురించి...ఇలా ఎన్నో పాటలూ, పద్యాలూ రాసిన ఘనత ఆయనది.

చేసే అన్నిటిలోనూ ఇలా సృజనాత్మకతను చూపే ఆయనను ఆ ఏడాది చింతలపూడి ఆశ్రమం వారు ఉపన్యాసాలు ఇవ్వమని ఆహ్వానించారు. ఆయన అమ్మవారి వైభవం గురించి మామూలుగా ఉపన్యాసం ఇవ్వటం కాకుండా, ఒక నాటకం లాగా ప్రదర్శించాలని అనుకున్నారు. ఆశ్రమంలో ఆడుకుంటున్న నాలాంటి పిల్లల్ని ఒక నలుగురిని పిలిచి దేవతలుగా వేషాలు వేయమన్నారు. ఏది విన్నా, విన్న కాసేపటి వరకు అత్యుత్సాహంతో గంతులేసే వయసు అప్పుడు నాది. సరేనన్నాను. మిగిలిన పిల్లలకి చెప్పాల్సిన డైలాగులు ఏమీ లేవు. నేను 'ముఖ్యమైన అమ్మవారి' పాత్ర పోషించాను. నా పాత్రకు శ్లోకాలు చదివే పని ఉంది. నా పక్కన మామూలుగా కూర్చుని ఉండే చిన్న చిన్న అమ్మవార్లు మిగిలిన వాళ్ళు. మా తమ్ముడికి కూడా ఇంద్రుడి పాత్ర ఇచ్చారు.

ఒక చిన్న కాగితం మీద మా తమ్ముడికి తను చెప్పాల్సినది రాసిచ్చారు ఆయన. నాకు మాత్రం ఒక పెద్ద  తోక పుస్తకం లోని కాయితం చింపి, ఒక ఏడెనిమిది శ్లోకాలు రాసి ఇచ్చారు ఆయన. అవన్నీ కంటస్థం చేయమన్నారు. నేను సరేనంటూ ఆ కాయితం తీసుకుని పక్కకి వెళ్లాను. ఈలోపు కిలకిలమని నవ్వుతూ "కుంటాట" ఆడుకుంటున్న 'చిన్న అమ్మవార్లు' కనిపించారు. అంతే. ఇక కాగితం ఏమి కనిపిస్తుంది? అది అలాగే మడతపెట్టి గౌను జేబులో పెట్టుకుని, కుంటాట అమ్మవార్ల వైపు పరుగు తీశాను. మధ్యాహ్నం టయానికి కుంటాట అయ్యింది. ఆ తర్వాత  'అంటుకునే ఆట', 'స్తంభాలాట', 'కరెంట్  షాక్', ఇత్యాది ముఖ్య కార్యక్రమాలన్నీ అయ్యేసరికి సాయంత్రం అయ్యింది. ఇహ  అలసట  వచ్చింది. పగలంతా పరుగులు తీస్తూ, మధ్య మధ్యలో కాగితం తీసి, మళ్ళీ విప్పకుండానే జేబులో పెట్టేసుకుంటూ, గురువు గారి గదిని మాత్రం చాలా చాకచక్యంగా ఎవాయిడ్  చేస్తూ గడిపేశాను.

సాయంత్రం ఆడుకున్న ఫ్రెండ్స్ లో ఒకరైన లలిత ఇంటికి తనతో వెళ్లాను. వాళ్ళ అమ్మగారికి నాటకం గురించి చెప్పింది లలిత. ఆమెకు సరిగా చెప్పటం రాలేదు, వచ్చినా ఆవిడకి అర్థం కాలేదు. నేను విడమర్చి, విపులంగా వివరించాను. ఆవిడ స్టేజీ ఎక్కబోయే తన కూతురికి వాళ్ళ బట్టల కొట్టు నుండే ఒక కొత్త పట్టు చీర  తీసుకొచ్చి కట్టి, ముస్తాబు చేశారు. "నా కూతురు అమ్మవారి వేషం వేయబోతోంది" అంటూ మురిసిపోయారు. "నేను పెద్ద అమ్మవారిని" అని నేను మనసులోనే గర్వపడ్డాను. మళ్ళీ ఆశ్రమానికి పరుగు పరుగున వచ్చాను. లలిత చీర కట్టుకుని వస్తోందనీ, నాకూ నాటకానికి చీర కట్టమనీ మా అమ్మగారిని అడిగాను. ఆవిడ  తెచ్చుకున్న వాటిలో ఒక చీర తీసి కట్టారు. అది పట్టుచీర లా మెరవట్లేదు. అయినా సరిపెట్టుకున్నాను.

చీర కట్టించుకోవటం మీద ఉన్న ధ్యాస అప్పటికీ నేను శ్లోకాలను బట్టీ కొట్టటంలో పెట్టలేదు. అసలు గురువు గారు నాకు శ్లోకాలు రాసి ఇచ్చారని కూడా మా అమ్మగారికి తెలియదు. తెలిస్తే ఆడుకోనివ్వరని నేనే చెప్పలేదు. తీరా చల్లబాటు వేళ భక్తులు అందరూ చేరేసరికి నాటకం అని మైకులో ప్రకటించేశారు. నాకు ఆ ఏడెనిమిది శ్లోకాలలో రెండున్నర శ్లోకాలు మాత్రం వచ్చాయి. చిలకపచ్చ రంగు గళ్ళ చీరతో స్టేజీ ఎక్కేసి బల్ల మీద వాళ్ళు చెప్పినట్లు నుంచున్నాను. నా కాళ్ళ పక్కన  పట్టుచీర కట్టుకున్న లలితతో కలిసి నలుగురు చిన్న అమ్మవార్లు దక్షిణ హస్తాన్ని చూపిస్తూ కూర్చొని ఉన్నారు. నా దక్షిణ హస్తం కూడా జనాన్ని దీవిస్తూనే ఉంది. వామ హస్తం మాత్రం కొంగు వెనక గుప్పెట్లో ఉన్న కాగితాన్ని నలిపేస్తూ పట్టుకుంది. బల్ల పక్కన పంచ కట్టుకుని, తలపాగా పెట్టుకుని మా తమ్ముడు నుంచుని ఉన్నాడు. ఆ పక్కన గురువుగారు మైకు ముందు నుంచున్నారు.

మా తమ్ముడికి ఇచ్చిన పాత్ర 'ఇంద్రుడి' పాత్ర కదా? అతను అమ్మవారి గొప్పతనం అర్థం కాక దేవతలందరి తరఫునా "నీవెవరు?" అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు "నేనే అన్నీ, నేనే అంతా వ్యాపించి ఉన్నాను, నీలోనూ ఉన్నాను...." ఇలా రకరకాలుగా తనను గురించి తాను వివరిస్తుంది శ్లోకాలలో. ఇంద్రుడికి అర్థం కాక మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాడు. ఇలా ఇంద్రుడికీ, అమ్మవారికీ సంస్కృతంలో జరిగే సంభాషణని గురువు గారు తెలుగులోకి అనువదించి ప్రేక్షకులకి చెప్తూ ఉంటారు. అదీ ఆయన ఆలోచన.

ఇక నాటకం మొదలయ్యింది. గురువుగారు నాటకం నేపథ్యాన్ని వివరించారు ప్రేక్షకులకి. అప్పుడు మా తమ్ముడు అందుకున్నాడు. తన డైలాగు చెప్పాడు. "భవతీ కా?" (మీరు ఎవరు?). నేను నాకు బాగా వచ్చేసిన మొదటి శ్లోకాన్ని చెప్పేశాను. గురువుగారు విడమర్చి తెలుగులో చెప్పారు. మళ్ళీ మా తమ్ముడికి అర్థం కాలేదు. "భవతీ కా?" అన్నాడు. నేను రెండో శ్లోకాన్ని టకటకా చెప్పేశాను. నలుగురు చిన్న అమ్మవార్లూ బల్లపై వంకరగా సర్దుకు కూర్చోవటం వల్ల లాగుతున్న నడుములకి నిట్టూర్పులు విడుస్తున్నా ఓపిగ్గా కుడిచేత్తో జనాన్ని దీవిస్తూ ఉన్నారు. నా రెండో శ్లోకానికి గురువుగారు అర్థం వివరించారు.

అర్థం కాని ఇంద్రుడు మళ్ళీ "కా భవతీ?"అన్నాడు. అమ్మవారికి టెన్షన్ మొదలయ్యింది. మూడో శ్లోకంలో రెండు పాదాలు నిర్భయంగా చదివేసి, మిగిలిన రెండు పాదాలనూ కాగితంలో చూసి నట్టుకుంటూ చదివాను. ప్రేక్షకులు చిన్నగా నవ్వుతున్నట్లు అనుమానం వచ్చింది. తలెత్తి చూశాను. వయసు మళ్ళిన భక్తులు నన్ను చూసి నవ్వుతున్నారు. కొంచెం కోపం వచ్చింది నా భక్తుల మీద నాకే. గురువు గారు మూడో శ్లోకాన్ని కూడా వివరించారు. కోపంతో పాటే భయమూ వేసింది "సగం వచ్చిన శ్లోకానికే నవ్వారు, ఇకపై శ్లోకాలే రావు కదా?" అని.

ఇంద్రుడు "కా భవతీ?" అని అననే అనేశాడు మళ్ళీ! ఇక తప్పదు. గురువుగారు వ్యాఖ్యానిస్తూ "ఇంకా ఇంద్రుడికి అర్థం కాలేదు అమ్మవారి గొప్పతనం. ఇప్పుడు అమ్మవారు ఇంద్రుడికి అర్థం అయ్యేటట్లు కాగితం చూసి చెప్తుంది" అన్నారు 'కాగితం చూసి' అనే మాటని ఒత్తి పలుకుతూ. జనం అంతా గొల్లుమని నవ్వారు. ఈసారి అన్ని వయసుల వాళ్ళూ నవ్వారు. నా ముఖం కంద గడ్డలా మారింది. నలుగురు అమ్మవార్ల మధ్య నుంచున్న నాకు ఆ ఇరుకులో కాళ్ళు వణికాయి. కుడి చెయ్యి సన్నగా ఊగుతోంది. ఎడమ చేతిలో కాగితం చిన్నగా తడిసినట్లుంది. గొంతు పెగల్చుకుని నాలుగో శ్లోకాన్ని సాయం పట్టబోయాను. నా అవస్థ గ్రహించినట్లున్నారు, గురువు గారు "మొదటి శ్లోకమే మళ్ళీ చెప్పెసేయి" అని మెల్లగా చెప్పారు. నేను గణగణా మొదటి శ్లోకాన్ని చెప్పేశాను.

ఆయన మాత్రం చెప్పినదే చెప్పకుండా అనుకున్న ప్రకారం అసలు శ్లోకాల అర్థాలు చెప్పసాగారు. ఇంకా నాలుగు సార్లు మా 'ఇంద్రుడు' తమ్ముడు "కా భవతీ?" అనటం, నేను ఒకటో శ్లోకాన్నే మళ్ళీ మళ్ళీ అప్పచెప్పేయటం, ఆయన కొత్త కొత్త అర్థాలు చెప్పటం జరిగిపోయాయి. కానీ నాకు ఇవేమీ పట్టట్లేదు. "కాగితం చూసి" అని ప్రత్యేకంగా ఆయన పలకటం, అందరూ గొల్లుమని నవ్వటం..ఇదే పదే పదే నా మనసులో మెదులుతోంది. కళ్ళలో నీళ్ళు ఆపుకుంటూ, బుసలు వినపడనివ్వకుండా ఒకటో శ్లోకాన్ని చెప్తూ పోయాను.  ఇది అంతా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఉంది. చాలా కోపం, ఉక్రోషం, కుళ్ళు, బాధ అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. ఐపోయింది అనగానే పరుగు పరుగున స్టేజీ దిగిపోయి, చీర కుచ్చిళ్ళు పట్టుకుని రూముకి పరుగెత్తుకెళ్ళి దాక్కున్నాను.

తర్వాత జరిగినదేమీ నాకు తెలియదు. నిద్ర లేచేసరికి చాలా సిగ్గుగా అనిపించింది. "ఒక్కరోజు ఆడుకోకపోతే ఏం పోయింది? ఆ శ్లోకాలే చదివేయాల్సింది" అనిపించింది. కానీ అదృష్టం కొద్దీ ఎవరికీ అది గుర్తులేదు. మర్నాటి పూజా కార్యక్రమాల్లో అందరూ బిజీ అయిపోయారు. నాకు మాత్రం ఎంత సిగ్గో!

ఆరోజే కాదు. ఇప్పటికీ అది గుర్తొస్తే అనిపిస్తుంది "ఒక ఎనిమిది శ్లోకాలు చదివేస్తే ఎంత బాగుండేది?" అని!
టైం మెషిన్ ప్లీజ్.

కామెంట్‌లు

Rama చెప్పారు…
Mee anubhavalanu baga vivarincharu! telugu chala samvatsarala tarvatha cheduvyanu! experience bagundi. i understand your perceived embarrassment. Although long forgotten by the audience, you seem to relive the pain even after many years. Those feelings are well expressed!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్