అన్ని రోడ్లూ అక్కడెక్కడికో చేరుతాయటగా?

అన్ని రోడ్లూ రోము నగరానికే చేరిపోవటం మాట ఎలా ఉన్నా, రోడ్లపై ఎడ్రస్సులు వెతికి పట్టుకోవటం ఒక చాలెంజ్ అనే చెప్పాలి. అమెరికా లాంటి దేశాల్లో కొత్త ఎడ్రస్ తెలుసుకోవటం కష్టం అంటారు కొందరు, సులభం అంటారు మరికొందరు. బాగా కొత్తగా అమెరికాకి వచ్చిన వాళ్ళు జీపీయస్ ని చుసి, "ఇది భలే ఉంది. మన దేశం ఇలా ఎప్పటికి అవుతుందో" అనుకుంటారు. కొంత కాలం ఉన్న వాళు దానికి బాగా అలవాటు పడతారు. ఇంకా చాన్నాళ్ళు ఉన్నవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళతో "జీపీయస్ కి అలవాటు పడకండి. మ్యాప్స్ చూడండి, జ్ఞ్యాపకం పెట్టుకోండి" అని హితబోధ చేస్తారు. ఇది మనందరం చూసే ఉంటాం.

మన దేశం లో మాత్రం కొత్త ప్రదేశాలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దారి వెతికి పట్టుకోవటం ఎంత సులభమో అంతే కష్టం. ఈ సందర్భంలో ఒక సంఘటన చెప్పాలి.

ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్ళటం కోసం హైదరాబాద్ లో పెద్దగా పరిచయం లేని ఒక ప్రదేశానికి వెళ్ళాను. బస్ లో అక్కడ వరకు చేరాక, ముందుగా అనుకున్న ప్రకారం అక్కడ నేనూ మా తమ్ముడూ కలుసుకున్నాం. తనకీ ఆ ప్రాంతం కొత్తే కావటం తో, అదివరకు ఎప్పుడో ఒకసారి వెళ్ళిన నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. నేను తన బైక్ ఎక్కి కూర్చుని నా జ్ఞ్యాపకశక్తి పై ఉన్న విశ్వాసంతో "అటు పోనీ" అన్నాను.

పోనిమ్మన్న నాకూ, పోనిస్తున్న తనకూ తెలియని విషయం ఏమిటంటే రానున్న గంట సేపూ పోనిస్తూనే ఉండాల్సి వస్తుందని. నాకు బలంగా గుర్తున్న విషయం... గుడి కమాన్ దగ్గర నుండి లోపలకి కాస్త దూరం వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. గుడి పక్క నుండి ఇంకా నాలుగు అడుగులు వేస్తే ఎడమ వైపు నీళ్ళ ట్యాంకు వస్తుంది. అదీ దాటాక రెండో సందులో కుడి వైపుకి తిరిగితే కుడి వైపు వచ్చే ఆఖరి ఇంట్లో నాలుగో అంతస్తుకి మేము వెళ్ళాలి. తెలియని బుజ్జి విషయం ఏమిటంటే మేము నుంచున్న కమాన్ కి ఒక ఫర్లాంగు అవతల అసలు కావాల్సిన కమాన్ ఉందని.

ఇంకెక్కడి వెంకటేశ్వర స్వామి గుడి, ఇంకెక్కడి నీళ్ళ ట్యాంకు, ఇంకెక్కడి రెండో సందు, ఇంకెక్కడి ఆఖరి ఇల్లు, ఇంకెక్కడి నాలుగో అంతస్తు? బైక్ ఎక్కి వెళ్ళటం మొదలు పెట్టాక ఎంత సేపటికీ గుడి రాదాయె! చాలా దూరం వెళ్ళాక మా తమ్ముడితో అన్నాను "గుడి ఇంత లోపలకి ఉన్నట్టు గుర్తు లేదు నాకు" అని. ఎవరినైనా అడిగి వెళ్దాం అని నిర్ణయించుకున్నాం.

ఎవరిని అడగాలి అనే విషయం లో కొందరికి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. ఆడవాళ్ళు దారులని పట్టించుకోరనీ, అడగటం దండగ అనీ కొందరి వాదన. బాగా చదువుకుని సూటూ, బూటూ వేసుకునే వాళ్ళ కన్నా పెద్దగా చదువుకోని వాళ్ళని అడగాలని కొందరి భావన. నడుస్తున్న వారిని గానీ వాహనాలు నడుపుతున్న వారిని గానీ అడిగితే మనల్ని విసుక్కుంటారు, కనుక రోడ్డు పక్కకి నుంచున్న వారినే అడగాలని కొందరి ఉద్దేశం. ఆటో డ్రైవర్లని అడగాలి అని ఇంకొందరి అభిప్రాయం. షాపుల్లో ఉన్న వాళ్ళని అడిగితే బాగా చెప్తారని మరి కొందరి ఆలోచన. మిట్టమధ్యాహ్నం ఎర్రటి జూన్ నెల ఎండలో, ఒక పక్క చేరాల్సిన చోట ఫంక్షన్ కి ఆలస్యం అవుతూండగా మాకు ఇవేమీ ఆలోచించుకునే అవకాశం లేదు. మనిషి కనిపిస్తే చాలు అనే పరిస్థితి.

మొత్తానికి ఒక ఆసామిని పట్టుకున్నాం. "ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడండీ?" అని అడిగితే బుర్ర గోక్కుంటూ "వెంకటేశ్వర స్వామి గుడా?" అంటూ అటు చూశాడు, ఇటు చూశాడు, "ఇక్కడ గుడెక్కడుంది?" అన్నాడు. "మేము అడిగిందే మమ్మల్ని అడుగుతావేంటి నాయనా" అనుకున్నాం. బుర్ర గోక్కునే కార్యక్రమం మాత్రం మానకుండా మళ్ళీ అటు చూసి, ఇటు చూసి, "ఇక్కడెక్కడా గుడి లేదు" అని తేల్చి చెప్పాడు. "నేను ఇదివరకు వచ్చాను, ఉంది" అన్నాను నేను. నాకు తెలియదన్నాడు. అది ముందే చెప్పచ్చుగా అనుకుంటూ ముందుకి వెళ్ళాము.

ఈసారి ఒక కుర్రాడు సైకిల్ మీద వెళ్తూ కనపడ్డాడు. మా తమ్ముడి ముఖానికి హెల్మెట్ ఉండటంతో నేనే అందరినీ ఎడ్రస్ అడిగే పూచీ తీసుకున్నాను. ఆ కుర్రాణ్ణి ఎప్పుడూ ఆడవాళ్ళు ఎడ్రస్ అడగలేదు కాబోలు. ఎడ్రస్ గురించి మాట్లాడేది తక్కువ, మురిసిపోయేది ఎక్కువ. నవ్వేస్కుంటున్నాడు, సిగ్గు పడిపోతున్నాడు. సిగ్గుకీ, సిగ్గుకీ మధ్యలో, ముసినవ్వుకీ, మురిపానికీ మధ్యలో వచ్చిన మాటలన్నీ ఒక చోటకి చేరిస్తే సారాంశం "రైట్ తీయండి, సక్కగా పొండి, మల్ల లెఫ్ట్ తీయండి, సక్కగా పొండి" అని. అలాగే పోవటం మా వంతయ్యింది. "ఆ కుర్రాడు మనకి ఎడ్రస్ చెప్పిన సంతోషం తో రాత్రి నిద్ర కూడా పోయేటట్లు లేడక్కా" అన్నాడు మా తమ్ముడు.

కుర్రాడు చెప్పినట్లు వెళ్ళాక ఇందాకటి కన్నా నిర్మానుష్యం గా ఉన్న సందులోకి వెళ్ళాం. అక్కడ ఉన్నది వెంకన్న గుడి కాదు, శివాలయం. ఆ కుర్రాడు తక్కువ సిగ్గు పడి, ఎక్కువ శ్రద్ధ పెట్టి మేము అడిగింది విని ఉంటే ఇటు వచ్చేవాళ్ళం కాదేమో. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ రోడ్డు కి కలిసినా, కరెక్ట్ గా వెళ్తామని మాకు గారంటీ లేదు. ఎవరైనా కనిపించకపోతారా అనుకుంటూ ముందుకే వెళ్ళసాగాము. తప్పు దారిలోనే ఇంకా ఇంకా లోపలకి వెళ్ళిపోతున్నాం మేము తెలియకుండా. వెనక్కి రోడ్డు మీదకు వచ్చెస్తే కనీసం దారి వెతుక్కోవటం సులభం అయ్యేదేమో. తన చేతులో బైక్ ఉండటం వల్ల, ట్యాంకులో పెట్రోలు అయ్యేలోపు ఎడ్రస్ దొరక్కపోదులే అని వెతకసాగాము.

ఒక మెకానిక్ షెడ్ దగ్గర ఫ్రెష్ గా రిపేరు చెయించుకున్న బైక్ ని స్టార్ట్ చేస్తూ ఒక గడ్డం అతను కనిపించాడు. అతని దగ్గర బండి ని ఆపి అడిగాము. ఇతను మరో నమూనా మానవుడు. మేము సమీపిస్తుండగానే బండి కిక్కు కొట్టటం ఆపేసి ఎంతో శ్రద్ధగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడ్డాడు. మేము అడగటమే తడవు గా, నోటిలో మాట పూర్తి కాకుండానే దారి గబగబా చెప్పేసి పనైపోయిందన్నట్లు గట్టిగా ఊపిరి తీసుకు వదిలాడు. అతను చెప్పిన దారిలో వెళ్తూ ఒక నిముషం మౌనం గా ఉండిపోయాం మేమిద్దరం అతని ప్రవర్తనకి విస్తు పోయి. ఎవరో ఎప్పుడో అతన్ని గట్టిగా శపించేసి, "శాప విమోచనం కావాలంటే ఇలా ఓ జూన్ నెల మధ్యాహ్నం ఒక బైక్ పై అక్కా తమ్ముళ్ళు వచ్చి, ఇదే మెకానిక్ షెడ్ దగ్గర నిన్ను ఒక ఎడ్రస్ అడుగుతారు, వాళ్ళకి దారి చెప్పగానే నీకు శాపవిమోచనం అవుతుంది" అని చెప్తే, అప్పటి నుండి ఎన్నో ఏళ్ళుగా ఆ మెకానిక్ షెడ్ వద్దనే బైక్ కిక్కు కొట్టుకుంటూ ఎదురు చూస్తున్న అభాగ్యుడు, శాప విమోచనం పొందే వేళ ఎలా ఉంటాడో అలా ఉంది అతని వాలకం. అతని గడ్డం చూస్తే ఈ ఊహ నిజమేనేమో అన్న అనుమానం కూడా కలిగుతుంది. ఎందుకైనా మంచిదని అతన్ని చల్లగా ఉండమని అనుకున్నా మనసులో.

శాపవిముక్తుడు చెప్పిన దారిలో వెళ్తుండగా ఇంకొక్క చోట చిన్న సందేహం వచ్చి నివృత్తి కోసం వాకిట్లో నుంచున్న ఒకావిడని అడిగాము. ఆవిడ "అవును. ఇదేనండీ దారి. అలాగెళ్ళి, రైట్ తిరగండి గుడి కనపడుద్ది" అంటూ ఎడమ వైపుకి చూపించారు. ఇలా చాలాసార్లు అవుతుంది. ఎంతోమంది రైట్ అంటూ లెఫ్టుకి, లెఫ్టంటూ రైటుకి చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నోటి మాట కన్నా సైగకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మాట తడబాటు ఉన్నా ఉంటుంది గానీ, మనసులో ఉన్న ఊహని బట్టే చేతి సైగ ఉంటుంది. ఐనా ఇప్పటికి ఐన సాహసాలు చాలనిపించి "లెఫ్టా?" అని అడిగాను ఎందుకైనా మంచిదని. "ఆ..అవునవును" అన్నారావిడ. ఈవిణ్ణి కూడా చల్లగా ఉండమని, ఆ దారిలో వెళ్ళాం.

కళ్ళెదురుగా వెంకన్న గుడి. శ్రీవారి దర్శనం ఐనంత ఆనందం కలిగింది. ఇక వాటర్ ట్యాంకు, రెండో లెఫ్టు, ఆఖరి ఇల్లు, నాలుగో ఫ్లోరూ కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాం. మేము ప్రయాస పడి చేరేసరికి ఇంకా ఫంక్షన్ మొదలు అవ్వలేదు సరికదా, మేమే అందరి కన్నా ముందు వచ్చిన అతిథులమయ్యాం.

మార్గదర్శి! సుఖీభవ!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్