పునఃదర్శన ప్రాప్తి ఈనాటికి ఇలా
ఏమిటా ముఖాలు?
ఈ బ్లాగ్ కి నేనెప్పుడు సబ్ స్క్రైబ్ అయ్యానా అని అర్థం కాక చూస్తున్నారా?
బాబర్ తన మనవడు అక్బర్ కి పట్టాభిషేకం చేయటానికి ఏర్పాట్లు చేయమని రాజోద్యోగులకు పనులు పురమాయించిన రోజుల్లో ఒక బలహీన క్షణంలో మీరే మీ టైమ్ బాగోక ఆ సబ్ స్క్రైబ్ అనే మీటని నొక్కారులే.
అది... అదే అదే... మీకు గుర్తొచ్చింది కరక్టే. నేను నేనే. బాగానే పనిచేస్తోంది మీ జ్ఞాపకశక్తి.
గోడమీద పుస్తకం పెట్టి, రాయటానికి ప్రయత్నించి, గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇంకు మరోవైపుకి పాకిపోగా రాయటం మానేసిన రీఫిల్ ఉన్న పెన్నుని దులిపి దులిపి, రాసేలా చేసుకొని, పట్టుదల అనే బూజుకర్రతో ఇన్నాళ్ళూ అటక మీదున్న ఈ బ్లాగుని దించి, దీనికి పట్టిన బూజుని ఈరోజు దులిపేయాలని నిర్ణయించేసుకున్నాను. ఈపాటికి ఈ దుమ్ముకి మీకు తుమ్ములు వస్తూ ఉండాలే? ఏం కంగారు పడకండి. అవసరమయితే ఆ రెండు తుమ్ములూ తుమ్మేసి మళ్లీ ఇది చదవటం మొదలుపెట్టండి.
మధ్యాహ్నం రమారమి మూడు గంటల సమయం. ఉల్లికారం కూరిన గుత్తివంకాయ కూర, చుక్కకూర పచ్చడి, వేడి వేడి చారు, కమ్మటి పెరుగు కలుపుకొని తిన్న అరగంటకి... "ఇంకా ఏం కూర్చుంటావులే, ఇక నిద్రలోకి జారుకో"మని కళ్ళు, ఒళ్ళు బలవంతపెడుతూ ఉండగా, "సిగ్గులేదూ? రాత్రీ, పగలూ నిద్రేనా? చేయటానికి పనే లేదూ నీకు?" అని బుర్ర తిట్టిపోస్తుండగా, ఈమెయిల్ తెరిచాను.
ఒకప్పుడు బాగా బ్రతికి చెడ్డ ముఖపుస్తకం అప్పుడప్పుడూ మనలాంటి వాళ్ళని మళ్లీ తన వద్దకు రప్పించుకోవటానికి ఓటమి లేని ఆశతో, తన ముఖం చూడకపోవటం వల్ల మనమేదో చాలా రకాలుగానే నష్టపోతున్నామంటూ ఈమెయిల్స్ పంపుతూ ఉంటుంది కదా? అలాంటి ఒక ఈమెయిల్ వేలు పట్టుకొని అటుగా అడుగులు వేశాను చాన్నాళ్ళ తర్వాత.
"నీకున్న రెండొదల మంది స్నేహితులు కాక, నీతో స్నేహం చేయాలని పని లేకుండా కాచుకొని కూర్చున్నవారు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళలో ఎవరిని ఇబ్బంది పెడతావో నువ్వే తేల్చుకో"మంటూ వరుసగా పేర్లు చూపించింది. అందులో ఒక పేరు నా బంధువు బంధువుది. ఆ పిల్లకి గత ఏడాది పెళ్లి అయ్యిందన్నారు కదా, పోనీ ఒకసారి చూద్దాంలే అనుకొని అటు తొంగిచూశాను. అలా ఆ పిల్ల భర్త బ్లాగు వైపుకి లాగబడ్డాను.
నా వేలు విడిచిన మేనమామ గారి కొడుకు వేలుని పట్టుకున్న భార్యకి చేయిచేయి పట్టుకొని పెరిగిన చెల్లెలి చేయందుకున్న భర్త అతను. తన బ్లాగులో ఎంత చక్కగా కబుర్లు చెప్పాడంటే, చెప్తూ చెప్తూనే ఈ బూజుకర్రని అతనే అందించాడు. కబుర్లు చెప్పటం తెలిసినా, ఏం కబుర్లు చెప్పాలో తెలియక ఇన్నాళ్ళూ అడ్డంగా ఉందని అటక ఎక్కించాను దీన్ని. మళ్లీ జీవిత భవసాగరాలు ఈదేస్తున్నానని, అందుకే కుదరట్లేదని అబద్ధాలు! చెప్పే వాళ్ళకి వినేవాళ్ళు లోకువ అని ఈరోజు మళ్లీ గుర్తొచ్చింది. ఓహో, బయటకి అనేశానా ఆ మాట? ఇహిహీ... నా ఉద్దేశం.. వినేవాళ్ళ చెవులకి లేని అభ్యంతరం చెప్పే వాళ్ళ నోటికి ఎందుకని.
నాకు మీరున్నారుగా? ఇక కబుర్లు చెప్తూ ఉంటాను. అనుభవించండి. మళ్లీ కలుద్దాం. సెలవు. సత్ శ్రీ అకాల్. షబ్బాఖైర్. అల్విదా. సాయొనారా. బై.... మాటలంటున్నానే గానీ కదిలి వెళ్ళట్లేదు చూశారా? కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు, ఇన్నా(న్నే)ళ్ళ తర్వాత మిమ్మల్ని కలిశానుగా? వెళ్ళబుద్ధి కావట్లేదు మరి. సరే, మళ్లీ కలుద్దాం. ఉంటానిక.
కామెంట్‌లు