ఈ ఒక్కసారికీ ఇలా కానిద్దాం
ఉదయం కాఫీ తాగేసి, మా అత్తయ్యగారితో "కొంచెం టిఫిన్ ఏర్పాట్లు మీరే చేసేయండ"ని అడిగి, డాబాపైకి వచ్చి బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాను. ఎర్రటి ఎండాకాలంలోనే వడియాలు పెట్టాలని పెద్దవాళ్ళు అనటంతో పెరట్లో దానంతట అదిగా పెరిగిన పాదుకి పది కాయలు కాసి, "నన్ను వాడు, నన్ను వాడు" అని రోజూ అడుగుతున్నా, ఎండాకాలం తీవ్రరూపం దాల్చేవరకు ఆగాను. రెండు కాయలతో పెడదాం అనుకున్నా, నిన్న ఒక్క కాయని తరగటానికే మూడు నాలుగు గంటలు పట్టింది. మరి తునాతునకలు చేయాలి కదా? అందుకని రెండవ కాయకి న్యాయం చేయలేక, పూర్తిగా అన్యాయమూ చేయలేక, పొరుగింటి వాళ్ళని వడియాలు పెట్టుకోమని ప్రోత్సహించాను.
నిన్న నేను తరిగిన ముక్కలను వడవేసి, పిండి రుబ్బి, కారం, ఉప్పు లాంటి రుచులు కలిపి సిద్ధం చేసి అత్తయ్యగారే ఇచ్చారు. తడి చీరపై వడియాలు పెడుతూ ఆలోచనలో పడ్డాను. అసలు ఒక కాయను బుల్లి బుల్లి ముక్కలుగా కోసి, రుబ్బిన పిండిని కలిపి ఇలా ఎండబెట్టి, దాచుకొంటే, కొన్ని నెలల తర్వాత అయినా వేడి నూనెలో వేయిస్తే పువ్వులా పొంగుతాయని ఎవరు కనిపెట్టారో కదా? మొన్నే మా స్నేహితురాలు ఒకావిడ నాలుగు కాయలతో వడియాలు పెట్టానన్నారు. నేను ఒక్కటి తరిగేసరికి ఏదో కష్టపడిపోతున్నట్టు ఎందుకు అనిపిస్తోందో!
కరోనా వ్యాప్తి వల్ల లాక్ డౌన్ లో ఉంది దేశమంతా. కమ్యూనిటీ లోకి పనమ్మాయిలెవ్వరినీ రానివ్వటం లేదు. అందరం ఎంచక్కా ఎవరి పనులం వాళ్ళు చేసుకుంటున్నాం నెలన్నర నుండి. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు గానీ, మొదట్లో కష్టమనిపించినా అలవాటు అయిపోతోంది.
కాకపోతే ఇదే పనిని పనమ్మాయి గంటన్నరలో చేసి అవతల పడేసేది. నాకెందుకు నాలుగు గంటలు పడుతోంది? పోనీ, పడితే పట్టింది. నా పని నేను చేసుకుంటున్నాను, లాక్ డౌన్ అయ్యేలోపు కనీసం నాలుగు మిల్లీగ్రాములు తగ్గుతానని అత్యాశతో అలా ముందుకు సాగచ్చు. కానీ లాక్ డౌన్ కు పూర్వం ఇవే నాలుగు గంటలను నేను ఏం చేస్తూ గడిపేదాన్నో! అప్పుడు చేసిన పనులు ఇప్పుడూ చేస్తున్నానాయే!
ఇల్లు ఊడ్చుకొనేసరికి మళ్లీ దుమ్ము పడిపోతోంది, అంట్లు తోముకునేసరికి మళ్లీ సింకులో అంట్లు తయారవుతున్నాయి. నాకే ఇలా ఉంటే, ఏ సంబంధమూ లేకుండా మా ఇంట్లో అంతటి పనీ రోజూ చేయటానికి పనమ్మాయి మనసు ఎంత చివుక్కుమంటూ ఉండేదో! అసలు ఈ లాక్ డౌన్ పుణ్యమా అని పనమ్మాయి మీద గౌరవ మర్యాదలు పెరిగిపోతున్నాయి రోజురోజుకీ. నేనే కాదు, నా స్నేహితురాళ్ళలో కొంతమంది అయితే, కరోనా లాక్ డౌన్ అయిపోయి, పనమ్మాయి వచ్చే రోజున ఉదయమే లేచి, ఇల్లు అలికి, ముగ్గులు వేసి, తోరణాలు కట్టి, హారతిపళ్ళెం సిద్ధం చేసి, అల్లంత దూరంలో పనమ్మాయి వస్తూ కనపడగానే పరుగెట్టుకుంటూ ఎదురు వెళ్లి, ఆమెను కౌగలించుకొని ముద్దుల వర్షం కురిపించేలా ఉన్నారు. వడియాల పిండి సగం అయ్యింది.
ఇంటి పని సరే, వంట పనీ ఈమధ్య బాధిస్తోంది. భర్త ఆఫీసుకి వెళ్ళే రోజుల్లో తొమ్మిదింటి లోపు పూర్తయ్యే వంట పని ఇప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట అయినా అవ్వట్లేదు. అయ్యిందమ్మా అనుకొని పిల్లకి తినిపించి, ఇంట్లో అందరం తిని గడియారం చూసేసరికి రెండున్నర! మరి ఇంతసేపూ కష్టపడిపోయాను కదా, కాసేపైనా నడుము వాల్చాలనిపిస్తోంది. ఆ బృహత్తర బాధ్యత కూడా తీర్చుకొని, మళ్లీ గడియారం వైపు చూసేసరికి ఐదు. మళ్లీ టీ, స్నాక్స్ ఏర్పాట్లు, మొక్కలకి నీళ్ళు పోయటం, వాకిలి ఊడవటం, ముగ్గు వేసుకోవటం, ఇలాంటి పనులు అయ్యేసరికి రాత్రి భోజనం ఏర్పాటు చేయాల్సిన సమయం అయిపోతుంది.
ఇదంతా విని ఈ మహా ఇల్లాలు రోజూ నవకాయ పిండివంటలతో ఇంటిల్లిపాదికీ వండి వార్చేస్తోంది అనుకుంటే పొరపాటే. రెండు మూడు రకాల పదార్థాలతో మధ్యాహ్న భోజనం, ఉదయం, రాత్రి ఏవో టిఫిన్లు. అంతే. చేసినవే అటుతిప్పి, ఇటుతిప్పి మళ్లీ మళ్లీ వండి, వడ్డించి, తిని విసుగు తెప్పించేస్తున్నాను ఇంట్లో అందరికీ. పూర్వకాలంలో గృహిణులు బోలెడన్ని పనులు చేసేసుకుంటూ, బోలెడంత మంది పిల్లలని కనేసి, పెంచేసి, అయినా సరే బోలెడంత ఆరోగ్యంగా ఎలా ఉండేవారో ఏమిటో! ఒక్క గుమ్మడికాయ కోసి వడియాలు పెట్టటానికే కాలినడకన సంపూర్ణ భారతదేశ పర్యటన చేసినంత ఆయాసం వచ్చేస్తోంది నా మనసుకి. వడియాల పిండి దాదాపుగా చివరికి వస్తోంది.
ఇలా నాకు ఈమధ్య ఆత్మపరిశీలన, జీవితజ్ఞానం పెరిగిపోయి వైరాగ్యంగా మారిపోతోంది. త్వరలో సన్యాసం పుచ్చుకుందామన్న నిర్ణయానికి వచ్చేశాను. ఈ వడియాలు పెట్టటం అయిపోగానే బయల్దేరి వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ ఈమధ్య మా అమ్మాయి ముద్దులు పెడుతుంటే, మురిపాలు ఆడుతుంటే వాటికోసం ఆగాలని టెంప్ట్ అయ్యాను. ఇప్పుడు దాని వయసు మూడేళ్ళు కనుక, టీనేజ్ వస్తే ఎలాగూ నామీద అరుస్తుంది కనుక, అప్పుడు నాకు ఎలాగూ మళ్లీ జీవితంపై విరక్తి కలుగుతుంది కనుక, ఒక్క పదేళ్ళు ఆగుదాం అని తీర్మానించుకున్నాను. ఈలోపు సంవత్సరానికి ఒకటి చొప్పున పది సన్యాసిని చీరలు కొనుక్కుంటాను.
వారంలో రోజుకొకటి చొప్పున ఏడు ఉండగా, ఇంకో మూడు చేతిపట్టుకి ఉంటాయి. వర్షం పడి బట్టలు ఆరకపోతేనో, ఏ పెద్ద స్వామీజీనో, మాతాజీనో విజిట్ కి వచ్చినప్పుడో ఉంటాయి. అడవుల్లో ఏ ట్రిప్పుకో వెళ్ళినప్పుడు ఏ ముల్లుకో పట్టేసి చీర చిరిగిపోతే కుట్లు వేసిపెట్టటానికి ఎదురింటి షహీన్ నాతో పాటు సన్యాసం పుచ్చుకొని కుట్టుమెషిన్ తో సహా రాదు కనుక, ఆ పై మూడు చీరలూ చేతిపట్టుకి ఉంచుకోవటమే నయం.
కాకపోతే కాలికి పాముకోళ్ళు కొనుక్కోవాలి. ఎక్కడ దొరుకుతాయో ఏమిటో! సన్యాసులకి జుట్టు ఏ రంగులో ఉన్నా పర్లేదు కనుక ఈ పదేళ్ళలో తెల్లజుట్టు పెరిగినా, హెన్నా లాంటి ప్రాపంచిక సుఖాల మీద ఖర్చు అనవసరం. అదొక లాభం. ఉన్న బట్టలు ఈ పదేళ్ళకూ సరిపెట్టేస్తే, బట్టల ఖర్చు మిగులే. కనీసం సంవత్సరానికి ఐదువేలు చొప్పున ఈ పదేళ్ళలో ఒక యాభై వేల రూపాయలు ఆదా అవుతాయి. జిహ్వచాపల్యం కాస్త తగ్గించుకుంటే మరీ మంచిది. వడియాల పిండి చివరికొచ్చేసింది. ఇంకొక్క రెండు పెడితే అయిపోతుంది. ఇవి కరకరలాడేలాగే ఉన్నాయి. ఎండ బోలెడంత ఉంది కదా? కింద నుంచి అత్తయ్యగారు చేసిన ఉప్మా వాసన ఘుమఘుమలాడుతూ డాబా మీద వరకు వస్తోంది. పోపుతో సహా జీడిపప్పు వేయించి, అల్లం, కరివేపాకు సమపాళ్ళలో వేసినట్లున్నారు. ఒక్క నిమ్మకాయ చెక్కని పిండారని కూడా అనిపిస్తోంది. మిక్సీ ఆడిన శబ్దం ఇందాక వినిపించింది కనుక, ఏ పల్లీ పచ్చడో చేసినట్టే ఉన్నారు. అసలే ఆవిడ చేయి తిరిగిన వంటగత్తె. ఆ ఉప్మాని ఆ పచ్చడితో ఒక్క పట్టు పట్టేసి, అప్పుడు మళ్లీ జిహ్వచాపల్యం మీద కృషిచేయటం మొదలుపెడతాను. ఈ ఒక్కసారికీ ఇలా కానిద్దాం.
కామెంట్లు