ఆది గురువు

రోజు గురుపూర్ణిమ. ప్రతి ఏటా ఈరోజున నాకిష్టమైన గురువులను తలచుకోవటం నాకు అలవాటు. వారితో మాట్లాడే అవకాశం లేకపోయినా, కనీసం వాళ్ళతో కూడి ఉన్న జ్ఞాపకాల్లో గడుపుతుంటాను.

చిన్న క్లాసుల్లో మెరీనా సిస్టర్, కొంచెం పెద్ద క్లాసుల్లో లక్ష్మి మిస్, తులసి మిస్ (మిసెస్ లే అయినా ఎందుకో మా స్కూల్లో టీచర్లనందరినీ మిస్ అని పిలిచేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు అలా అనకూడదని తెలిసినా, ఆ అలవాటుని మార్చుకొని "లక్ష్మి మేడమ్", "తులసి టీచర్" అనలేను. ఎందుకంటే ఆ రూపానికి ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మార్చి పిలిస్తే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది), తర్వాత ఇంటర్ లో శంకరశాస్త్రి గారు, ట్యూషన్ చెప్పిన వరలక్ష్మి మిస్, మల్లేశ్ సర్... వీళ్ళంతా మనసులో ముద్ర పడిపోయేలా పాఠం చెప్పటమే కాక, నా వ్యక్తిత్త్వ వికాసంలో కూడా గొప్ప పాత్ర పోషించినవారే.

సగటున ఏడాదికి కనీసం ఐదారుగురు గురువులు చొప్పున మన చదువు పూర్తి అయ్యేలోగా కనీసం 15 ఐదులు 75 మంది గురువులు మనకి చదువు చెప్పి ఉంటారు. వీరు కాక ఆర్ట్స్, స్పోర్ట్స్ లాంటివి నేర్పినవారు, మాథ్స్, ఇంగ్లీష్ లాంటి ట్యూషన్లు చెప్పి మన చదువు స్థాయిని పెంచినవారు ఉండనే ఉన్నారు... అందరికీ వందనాలు. నిస్సందేహంగా అందరూ మనల్ని తీర్చిదిద్దినవారే, మనం వేసే ప్రతి అడుగు వెనుక వారి ప్రభావం ఉంటుంది. అందులో మనం ప్రత్యేకించి జీవితాంతం గుర్తుంచుకొనేవారు ఐదు లోపు ఉంటారు. వారికి మరిన్ని అభివందనాలు. ఈపాటికి మీరు కూడా మీ జీవితంలో ఉన్న ఆ ఐదుగురు ఎవరా అన్న ఆలోచనలో పడి ఉండాలే!

అయితే, వీరందరి కంటే ముందు మన గురువు అమ్మ. నవ్వు, నడక, మాట, పాట అన్నిటినీ మొట్టమొదట అమ్మ దగ్గరే నేర్చుకుంటాం. ఈ టాపిక్ మీద ఇప్పటికే చాలా కథలను, వ్యాసాలను, పుస్తకాల్లోను, వాట్సాప్ మెసేజుల్లోను చదివేశాం, సినిమాల్లో చూసేశాం, పాటల్లో వినేశాం. అమ్మ అమృతమూర్తి, ప్రేమ-త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం... ఇలాంటి జగద్విదిత సత్యాలను నేను మళ్లీ చెప్పినా చెప్పకపోయినా ఒకటే. ఎందుకంటే పాలు తెల్లగా ఉంటాయని, పంచదార తీయగా ఉంటుందని, నిప్పు వేడిగా ఉంటుందని, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని, వర్షం పడితే బయట ఆరేసిన బట్టలు తడుస్తాయని, స్మోకింగ్ కిల్స్ అని... ప్రత్యేకించి ఈరోజు నేను మీకు తెలియపరచాల్సిన పనిగానీ, ఒప్పించాల్సిన అవసరం గానీ లేదు కదా? అలాగే ఇదీను.

రోజు నాకు ఆదిగురువైన మా అమ్మ గురించి మట్లాడాలని నిశ్చయించుకున్నాను. ఏడాదిన్నర క్రితం తీరిగ్గా క్వారంటైన్ లో ఉన్న నేను మా నాన్నగారిని బాగా తలచుకొని ఒక వ్యాసం రాశాను. అప్పుడే అమ్మ గురించి ఎప్పుడు రాస్తారని ఎవరో అడిగారు. నేను ప్రత్యేకించి నాన్నగారి గురించి రాయాలని అప్పుడూ అనుకోలేదు. అది అప్పుడు కలిగిన భావావేశం, ఇది ఇప్పుడు కలిగిన భావావేశం. కాకపోతే, ఒక్కటే మార్పు. అమ్మ గురించి నేను సీరియస్ గానో, సిన్సియర్ గానో రాయదలచుకోలేదు. అలా రాస్తేనే బాగుంటుంది అన్న expectation మీకు ఉంటే వేరీ సారీ. ఈరోజు నేను చెప్పాలనుకున్నవి దాదాపుగా అన్నీ సరదా కబుర్లే.

బయటివారితో చెప్పేటప్పుడు "మా నాన్నగారు" అని వ్యవహరించినట్లే, "మా అమ్మగారు" అని ప్రస్తావించటం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ ఈరోజు "మా అమ్మ" అనే అంటాను. ఎందుకంటే, నా కబుర్లు వింటుంటే మీరు అందులో మీ అమ్మని ఊహించుకోవటానికి బాగుంటుంది కదా?

బియ్యం మీద ఉంగరంతో రాసిన పేరు కంటే వేరే పేర్లతోనే నన్ను మా అమ్మ ఎక్కువ పిలుస్తుంది. చెప్పుకుంటే నా పరువే పోతుంది కానీ, "ఏమే సోదీ!" అనో, "జిడ్డుశ్రీ" అనో, లేకపోతే మరీ ప్రేమ కలిగినప్పుడు మా నాన్నమ్మ పేరు పెట్టి "మహాలక్ష్మీ" అనో పిలుస్తుంది. ఏమిటో, నేనూ అవి నా పేర్లే అన్నట్టు పలికేయటం అలవాటైపోయింది.

మా అమ్మ చాలా మంచి గురువు. వృత్తిరీత్యా తెలుగు గురువు అయినప్పటికీ, ఇందాక చెప్పినట్టు నాకు ఎన్నో సబ్జక్టుల్లో మొదటి గురువు అమ్మే. జంతికలు, చేగోడీలను అక్షరాల, అంకెల ఆకారాల్లో వండి, ఒకొక్కటీ చదవటం, "ఆమ్మ్మ్" అని తినేయటం నేర్పింది. పక్కనుంచి అప్పు తెచ్చుకొని తీసివేతలు ఎలా చేయాలో, మీటర్లకు, మిల్లీ మీటర్లతో, డెకామీటర్లతో, డెసీమీటర్లతో, కిలోమీటర్లతో ఉన్న సంబంధం ఏమిటో, ఎక్కాలు కింద నుండి పైకి, పైనుండి కిందకి ఎలా చెప్పాలో, వాటిని షార్ట్ కట్ లో ఎలా గుర్తుంచుకోవాలో అన్నీ నేర్పింది.  (ఏ టు జెడ్ క్రమంలో) ఆంధ్రప్రదేశ్ - హైదరాబాద్ (అప్పట్లో లెక్క) నుండి వెస్ట్ బెంగాల్ - కల్కటా (అబ్బా, అప్పట్లో లెక్కని చెప్పా కదా?) వరకు చెప్పించింది. మాటలు వచ్చే రోజుల్లో "ఏమే, టైమెంతయ్యిందే?" అని నన్ను అడిగితే, నేను గడియారం చూసి వచ్చి, "పావ్తక్కా అయ్యింది (పావు తక్కువ అయ్యింది)" అని చెప్తుంటే మా అమ్మ మురిపెంగా నవ్వుకునేది. ఇంకొంచెం పెద్దయ్యాక, శ్లోకాలు, పద్యాలు, పాటలు నేర్పి, అందరి దగ్గర పాడించి, వాళ్ళు మమ్మల్ని పొగుడుతుంటే మురిసిపోయేది.

ఇప్పటికీ ఒక కొత్త కథ రాసినా, ఒక కొత్త పాట పాడినా మొదట అమ్మకే పంపిస్తాను. ఎంత పనిలో ఉన్నా అవి చదివో, వినో నాకు తన అభిప్రాయం చెప్తుంది. తప్పొప్పులు రెండూ ప్రస్తావించినా, తన మాటల్లో వినిపించే ఆ పిసరంత పుత్రోత్సాహం చాలు... ఇంకా ఇలాంటివి ఇంకో నాలుగు చేయటానికి నాకు అదే ఇంధనం. అసలు తెలుగు భాషలో నాలుగు ముక్కలు నాకు అబ్బటానికైనా, పాటల పట్ల నాకు ఆసక్తి కలగటానికైనా మా అమ్మే కారణం. నాకు సంగీత సాహిత్యాల్లో అక్షరాలు దిద్దించిన ప్రత్యక్ష సరస్వతి అన్నమాట.

అమ్మతో కలసి మేము మట్టి ముద్దలతో బొమ్మలు చేసుకొనేవాళ్ళం. పూల మొగ్గలు మాలలుగా గుచ్చుకొనేవాళ్ళం. గోరింటాకు పెట్టుకొనేవాళ్ళం. కథలు చెప్పుకొనేవాళ్ళం. పాటలు పాడుకొనేవాళ్ళం. ఈరోజు ఇంటర్నెట్ లో "పిల్లలతో బాగా సమయం గడిపితే బాండింగ్ బాగా ఏర్పడుతుంది" అని రాసిన వ్యాసాలు చదువుతూ ఇంటర్నెట్ తోనే బాండింగ్ పెంచుకుంటున్న నా తరం వారి కంటే, మా అమ్మ మాతో చాలా ఎక్కువ సేపే గడిపేది. ఒకే కంచంలో మెత్తగా అన్నం కలిపేసి, తమ్ముడికొక ముద్ద, నాకొక ముద్ద తినిపిస్తూ కథలు చెప్పే రోజులు మళ్లీ కావాలంటే వస్తాయా? ఒకవేళ అందరం ఆ సీన్ ఎలాగైనా పునరావృతం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించేసుకున్నా, ఖండఖండాంతరాల ప్రయాణాలు, హడావిడి! కొత్త కొత్త కూరలు, వంటలు, అప్పచ్చులు నేర్చుకొని కమ్మగా చేసి పెట్టేది అమ్మ.

నవ్వంటే అమ్మ నవ్వే నవ్వే. జోకంటే అమ్మ వేసే జోకే. అమ్మ ఏం చెప్తే అదే వేదం. అమ్మ ఏం చేయమంటే అదే కర్తవ్యం. కన్నెర్ర చేస్తే గడగడలాడిపోయేవాళ్ళం. రోజూ స్కూల్లో పెన్సిళ్ళు పోగొట్టుకొని వస్తున్నానని ఒకరోజు ఇంటి గేట్ బయట నిలబెట్టింది. ఊళ్ళోని ఒకావిడ రికమండేషన్ ఉండబట్టి లోపలకి రానిచ్చిందని, లేకపోతే శేషజీవితమంతా ఆ గేట్ బయటే గడిపేదాన్నని అనుకున్నాను అప్పట్లో.

తాను ఉద్యోగం చేసిన స్కూల్లోనే మమ్మల్ని చేర్చారు. స్కూల్లో ఉన్నంతసేపు "టీచర్", "మిస్" అనే పిలవమనేది. స్కూల్లో మేము ఏ వెధవ పని చేసినా నిరంతర వార్తా స్రవంతి టీవీ 9 లాగా రిపోర్టింగ్ అయిపోయేది. దీని గురించి గతంలో రాసిన "టీచర్ గారమ్మాయి" వ్యాసంలో కూలంకషంగా రాశాను, చూసుకోండి.

http://madilomucchatlu.blogspot.com/2011/01/blog-post.html

ఇంకా నా అల్లరిని అమ్మ ఎలా డీల్ చేసేదో కూడా "దొంగలందు తిండి దొంగలు వేరయా" అన్న దానిలో చదువుకోవచ్చు.

http://madilomucchatlu.blogspot.com/2010/12/blog-post_2791.html

ఎంత అల్లరి చేసినా భరించిన మహా ఇల్లాలు అని నేను చెప్పను. తేడా వస్తే తాట తీసేసేది అంతే. ఏం చేసినా పల్లెత్తు మాట అనేది కాదని అబద్ధం చెప్పను. ఒళ్ళు మండితే వీపు చీరేసేది. నిజం చెప్పొద్దూ? ఆమాత్రం చీరించుకోబట్టే నేను, మా తమ్ముడు ఈరోజున ఈమాత్రంగా ఉన్నాం. లేకపోతే దేశముదురులం అయ్యేవాళ్ళం.

ఎదుగుతున్నకొద్దీ పెద్దలు చెప్పినట్టు అమ్మ మాకు స్నేహితురాలుగా మారిపోయింది. మా ఇద్దరికీ వయోభేదం 18 ఏళ్ళే. కనుక నిజంగానే తల్లీకూతుళ్ళుగా కంటే అక్కచెల్లెళ్ళుగాను, స్నేహితురాళ్ళు గాను ఊసులు చెప్పుకుంటాము, అలుగుతాము, దెబ్బలాడుకుంటాము, మళ్లీ కలిసిపోతాము, నవ్వుకుంటాము. తన పై తరం వారికీ, తన తరం వారికీ, తన తరువాతి తరాల వారికి కూడా తను ఇష్టురాలే. ఎందుకంటే తను నిత్య సంతోషి. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన మనిషే. కానీ ఏనాడూ "నాకే ఇన్ని కష్టాలు వచ్చేశాయి" అన్న దిగులు తనలో కనిపించదు. "మన గతం, మన భవిష్యత్తు ఏదీ మన చేతిలో లేదు. ప్రస్తుత క్షణం మాత్రమే మన చేతిలో ఉంది. మన కర్తవ్యం మనం చేయటమే" అన్న సిద్ధాంతాన్ని అలవరుచుకొన్న జంట మా అమ్మానాన్నలు.

నా స్నేహితులందరికీ నాకంటే మా అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే, "నేనొక తల్లి హోదాలో ఉన్నాను. గౌరవానికి పాత్రురాలిని" అన్నట్టు తను ఎప్పుడూ ప్రవర్తించదు. నాకంటే చలాకీగా, నాకంటే సరదాగా ఉంటుంది వాళ్ళందరితోను. అంతెందుకు? మా అమ్మ, మా ఆయన టీమప్ అయ్యారంటే ఇక వాళ్ళని పట్టుకోలేము. నన్ను "యెహ, తప్పుకో" అని పక్కకి తోసేస్తారు!

అమ్మ టీచర్ ట్రెయినింగ్ లో భాగంగా సైకాలజీ కొంత చదివింది. ప్రపంచాన్ని చదవటం నాకు బాగా నేర్పింది. అదే సమయంలో, అందరినీ మంచి చూపే చూడటం కూడా నాకు తన నుంచే అబ్బింది. నిజంగా మనుషుల మనస్తత్త్వాన్ని చదవగలిగినవారు అందరినీ మంచివాళ్ళుగా చూడలేరు. ఆ రెండు లక్షణాలూ ఒకరి లోనే ఉండటం ఒక అరుదైన కాంబినేషన్. కానీ అదే తన బలం, బలహీనత కూడా. మనుమలు పుట్టినా కూడా పసి పిల్ల లాంటి నిష్కల్మషమైన మనసు తన సొంతం. ఖాళీగా కూర్చోకుండా ప్రయోజకత్వం ఉన్న ఏదో ఒక పని చేస్తూనే ఉండే తత్త్వం అమ్మది. అది అలవరచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉండే స్థితిలో ఉన్నాను ఇంకా నేను. ఇప్పటికీ ఎప్పటికీ నా వెన్నంటి ఉండే కొండంత బలం మా అమ్మ.

"ఇవన్నీ ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తోంది? అందరి తల్లులూ అంతే కదా?" అని మీకు అనిపించిందా? నా ఉద్దేశం కూడా మీకలా అనిపించాలనే. మదర్స్ డే నాడో, అమ్మ పుట్టినరోజు నాడో కూడా మనకి అంత తీరిక దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఇది చదువుతూ మీకు ఆదిగురువైన మీ అమ్మ గురించి ఒక్క క్షణం మీకు మధురంగా ఒక్క జ్ఞాపకం వచ్చినా, నా ఆశయం సిద్ధించినట్లే.




కామెంట్‌లు

Shyamala M చెప్పారు…
బాగుందండీ, మీ తొలి గురువు జ్ఞాపకాలను మాకు పంచటం బాగుంది. ఆదిగురువు అమ్మ అనేది అందరికీ తెలిసిన ఒప్పుకునే సత్యం. అయితే తొలి అడుగు, తొలి పలుకు,తొలి చేత, తొలి ఆట నే కాదు, తను చూసిన ప్రపంచాన్ని, తన అనుభవాలను, విలువలను , నీతి ని మనకు అర్ధమయ్యేలా కథల రూపంలో మన ముందుంచి, ప్రపంచాన్ని మనకు చూపించి, అర్దమయ్యేలా చేసి అందులో మనం ఇమిడి పోయేలా, ఆలోచించేలా, ఎదుర్కొనేలా మార్గనిర్దేశం చేసే అమ్మ గురువు అన్న పదానికి సరైన నిర్వచనం.
మీ అమ్మగారితో మీ అనుబంధం, అనుభవం ను చాలా చక్కగా అందించారు. ఆ శిక్షణ, క్రమ శిక్షణ ఇప్పటి మీ నడక, నడవడిక😊
మీ అమ్మగారి వ్యక్తిత్వాన్ని మాతో పంచుకుని, అందరం అద్భుతమైన, అపురూపమైన "తొలిగురువు అమ్మ" ని తలచుకుని భావోద్రేకానికి లోనయ్యేట్టు చేశారు.
Unknown చెప్పారు…
చాలా చాలా బాగుంది.నీ వ్యాసం కదిలించింది. మా బాల్యానికి తీసుకువెళ్ళింది. పుట్టేటప్పటికి మట్టి ముద్ద మనిషి. అమ్మ ఎలా మలిస్తే అలా మారతాం.అమ్మ ఒడి మొదటి బడి
అజ్ఞాత చెప్పారు…
అద్భుతంబుగా నుడివెను అమ్మ దనము
నుతియు కాదది జగతిస న్నుతియనగ
పదము పదమున రగిలించె పరవశమ్ము
మదిని మరిగించి సృజియించె మధుర రసము

(ప్రతి పాదము లోని మొదటి అక్షరాలను కలిపి చదవవచ్చు)

- చిర్రావూరి నాగ వెంకట శాస్త్రి
Sri Rama Lakshmi చెప్పారు…
చాలా బాగుంది. నాకు కూడా అపర్ణ అత్త అంటే అప్పట్లో terror. నిన్ను క్రమశిక్షణలో ఉంచే క్రమంలో ఆవిడ కొద్దిగా కఠినంగా ఉండే రోజుల్లో భలే భయమేసేది (మా అమ్మ కూడా అంతే strict అయినా కూడా). ఆ తర్వాత రోజుల్లో నీకంటే ముందే ఆవిడ స్నేహ మాధుర్యాన్ని నేనూ, మా అక్కా చవి చూశాము. ఈ సందర్భంలో అమ్మలకు జోహార్లు. మనసుకు నచ్చేలా కథనాల్ని అందిస్తున్న నీకు అభినందనలు👍

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్