ముప్ఫై ఏళ్ళ తర్వాత మళ్లీ... (క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి - 1వ భాగం)
"ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి" అని మాటల మాంత్రికుడు గారు అన్నారు కదా? ఏమిటో, నేను ఎక్కువసేపు పడుకున్నా, కాసేపే పడుకున్నా, కలలు వస్తాయి, అవి బాగా గుర్తుంటాయి కూడా. కలలు వస్తే, అవి గుర్తుంటే, అది సరైన నిద్రే కాదని డాక్టర్ల ఉవాచ. అంటే, "నీకేదీ చేత కాదు" అని ఎవరైనా నన్ను గట్టిగా తిడితే, ఆ చేతకాని పనుల జాబితాలో "సరిగ్గా నిద్రపోవటం" కూడా ఉందన్నమాట!
ఇంతకీ అలా నాకు వచ్చే కలల కేటగిరీల్లో బాగా తరచుగా వచ్చేది "పరీక్షలు".
సదరు "చదువుకొనుట" అనబడే పూర్వాశ్రమం ముగిసి 14-15 ఏళ్ళు కావస్తున్నా, "పరీక్షలు రాయుట" అనే బృహత్ కార్యక్రమం నిర్వహించుట అప్పటి నుండి ఒక్కసారీ జరగకపోయినా, ఆ కలలు నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి ఎందుకో! అందులోనూ మళ్లీ రకాలు ఉన్నాయండోయ్! ఒకోసారి పరీక్షలకి ఏమీ చదవనట్టు, ఇంకాసేపట్లో పరీక్ష అనగా ఆ విషయం నేను తెలుసుకున్నట్టు వస్తుంది. లేకపోతే పరీక్షకి ఆలస్యం అయిపోతున్నట్టు, ఎంత ఫాస్ట్ గా తొక్కుతున్నా సైకిల్ కదలనట్లు వస్తుంది. కలలోనే కాక బయట కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాను. ఒకోసారి కలల్లో తెగ ప్రిపేర్ అయిపోతూ ఉంటాను. స్టెప్పులు స్టెప్పులుగా పదో తరగతి లెక్కలు, ఎనిమిదో తరగతి కెమిస్ట్రీ ఈక్వేషన్లు నేను రాస్తున్నట్టుగా వస్తుంది. ప్రిపరేషన్ మాట ఇలా ఉంటే, ఒకోసారి పరీక్ష హాల్లో కూర్చున్నట్టు వస్తుంది. అందులోనూ... కొన్నిసార్లు నేను ఠావులకి ఠావులు నింపేస్తున్నట్టు, ఇంకొన్నిసార్లు నాకు ఒక్క ఆన్సర్ కూడా రాక వెర్రి మొహం వేసినట్టు వస్తుంది! ఏదో మూవీలో "కల గనే పద్మనాభసింహా", "కలలో పద్మనాభసింహా" అని హీరో బృందం బ్రహ్మానందానికి సృష్టించిన పాత్రల లాగా, "కలలోని" నా పాత్రకి అసలు చదువు వచ్చా, రాదా అని నాకు డౌటే!
అలా ఏళ్ళ తరబడి నన్ను కలల్లోనూ వెంటాడి వేధిస్తోందంటే, ఈ చదువుని నేను ఒకప్పుడు అంత ప్రేమించి ఉంటానా, అంత భయపడి ఉంటానా, అంత టెన్షన్ నిజ జీవితంలో ఏ ఎగ్జామ్ కైనా అసలు పడ్డానా అని నాకు చాలా ఆశ్చర్యం!
నన్ను పెంచిన వృత్తి కనుక నాకు టీచింగ్ అంటే మహా ఇష్టం. టీచర్ ని అయ్యుంటే మళ్లీ ఈ చదువు, పుస్తకాలు, పరీక్షల ప్రపంచంలో ఇంకా కొనసాగేదాన్ని. అందులోనూ కాలేజీ మాట ఎలా ఉన్నా, స్కూల్ చదువంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ఆలోచనలు వచ్చే అవకాశం ఎప్పుడూ రాలేదు నాకు.
నిజం చెప్పాలంటే, ఎప్పుడో నా స్కూల్ చదువు పూర్తి అయినప్పుడు మానేశాను స్కూల్ చదువుల గురించిన ఆలోచనలు. కనీసం మా తమ్ముడి స్కూల్ పూర్తి అయ్యేవరకు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే, అప్పుడు నా కాలేజీ జీవితంలో నేను యమా బిజీ అయిపోయాను కనుక. మళ్లీ మా అమ్మాయికి మూడేళ్ళు నిండుతున్నాయనగా స్కూళ్ళు, నేటి చదువుల మీదకి ధ్యాస వెళ్లింది. అక్కడితో అయోమయానికి మొదటి మెట్టు పడింది. "ఆఁ, ఇంత పిల్ల ఉంది, దానికే అంత టెన్షన్ ఎందుకు" అనుకుని పక్కకి పెట్టేశాను చాన్నాళ్ళు. తీరా ఆ సమయం వచ్చాక చూడాలి మా పాట్లు.
ముప్ఫై ఏళ్ళ క్రితం ఉన్నంత సింపుల్ గా ఇప్పుడు ప్రపంచంలో ఏదీ లేదు. పెంపకం అంటే పిల్లలకి తిండి పెట్టి, క్షేమంగా ఉన్నారో లేదో చూసుకుంటూ, ఆట-పాట తో పాటు చదువు-సంస్కారం నేర్పటమే ఒకప్పుడు. ఇప్పుడు పేరెంటింగ్ పేరుతో పెద్దపెద్ద పుస్తకాలు పిల్లలు పుట్టకముందు నుంచే మొదలు. గూగులమ్మ తల్లి చెప్పే సుద్దులు సరేసరి. పిల్లలు ఏమంటే చిన్నబుచ్చుకుంటారో, ఎలా మాట్లాడితే వాళ్ళ వ్యక్తిత్వపు పునాదులు కదిలిపోతాయో, ఏం మాటంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు నిలువునా కుప్పకూలిపోతుందో చెప్తూ భయపెట్టేస్తూ, కాళ్ళ లోంచి వణుకు పుట్టించేసే మహాగ్రంథాలు వేల కొద్దీ ఉన్నాయి మన అరచేతుల్లో.
అన్ని భయాల మధ్య ఏదో చేతనైనట్టు పెంపకాన్ని నెట్టుకొస్తుంటే, పిల్లకి నాలుగేళ్ళు నిండేసరికి పెద్ద సవాలు ఎదురయ్యింది. ఏ స్కూల్లో పిల్లని చేర్చాలి? మా చుట్టుపక్కల అందరూ తమతమ పిల్లల్ని పంపుతున్న స్కూల్ ఒకటుంది. ఆ స్కూలు ఆవరణలోకి మొదటి అడుగు పెట్టాలనే ఆలోచన మనసులోకి రావటానికి ముందే అక్షరాలా లకారం మన గుప్పెట్లో ఉండాలి. రెండో అడుగు మోపే ధైర్యం ఇంకా ఉంటే, మరొక లకారం కూడా రెండో గుప్పెట్లో పెట్టుకొని, ఆ చేతిని అందాక జేబులో పెట్టుకోవాలి. ఇదంతా తెలిసినప్పటికీ ఇంతమంది వాళ్ళవాళ్ళ పిల్లల్ని పంపుతున్నారంటే, ఖచ్చితంగా ఆ పుట్టలో ఉన్నది పూలదండే అయ్యుంటుందని అనుకొని మేము వెళ్ళాము ఎడ్మిషన్ కావాలంటూ.
వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నది పాత సామెత. ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఒక్క ఎడ్మిషన్ సంపాదించాలి అన్నది కొత్త సామెత. ఆ స్కూల్లో అప్పటికే చదువుకుంటున్న ఒక పిల్ల మాకు బంధువని, కనుక మాకు సీట్ ఇవ్వమని ఆ పిల్ల తల్లిదండ్రుల సలహా మేరకే చెప్పాము, మూడు గంటలు స్కూల్ ఆఫీస్ బయట పడిగాపులు అయ్యాక. శుభమా అంటూ మా అమ్మాయి చదువు బండి ఆ అబద్ధంతో మొదలయ్యింది. అలా చెప్పబట్టి "ఆలోచిస్తాం" అన్నట్టు ఆ స్కూల్ పెట్టింది ముఖం. ఏడాది ఎల్కేజీ చదువుకి నిర్ణయించబడ్డ ఆరంకెల ఫీజునీ ఏదో ఒక విధంగా కట్టటానికే సన్నద్ధం అయ్యాము. కానీ దానికి తోడు ఎడ్మిషన్ ఫీజు మరొక లకారం అన్నారు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొన్నాం. "ఇక్కడ మన పిల్లలు చదివితే చాలు, జీవితంలో తిరుగు లేదు" అన్న నమ్మకంతో పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తున్న తల్లిదండ్రులందరి ముఖాలను తలచుకున్నాం.
"లంచం ఇవ్వకుండా లైసెన్స్ రావాలి", "డొనేషన్ కట్టకుండా ఎడ్మిషన్ సంపాదించాలి" అనుకోవటం ఈరోజుల్లో "కళ్ళు మూసుకోకుండా నిద్రపోవాలి" అన్నంత అసంభవం అయిపోయింది కనుక, గుప్పెట్లోని ఆరంకెలనూ ఒకసారి గట్టిగా పట్టుకొని "ఇంకో మాట చెప్పచ్చు కదా?" అన్నాము. కొంచెం తగ్గినా ఏ పుస్తకాలకో పనికొస్తుంది కదా అనే ఆశతో. కిందటి ఏడాది వరకు ఎడ్మిషన్ ఫీజే తీసుకోలేదని వాళ్ళే చెప్తున్నారు. గొప్ప స్కూలని లోకమంతా కోడై కూస్తోంది. ఎన్నేళ్ళుగానో కూకటి వేళ్ళతో సహా పాతుకుపోయిన పరువు-ప్రతిష్ట దానికి ఉన్నాయి. ఇంక ఇప్పుడెందుకు ఎడ్మిషన్ ఫీజు? అయినా అడుగుతున్నారు కనుక, కట్టాల్సిందేనేమో అనుకొని బేరం అడిగాము. "మాదే మరో కొత్త కేంపస్ ఉంది, అక్కడైతే ఎడ్మిషన్ ఫీజు కట్టక్కరలేదు" అన్నారు. అప్పుడర్థమయ్యింది. ఆ కేంపస్ ని నింపటానికి ఈ పథకం అల్లారని.
ఎంతో దయతో మాకు రెండు రోజుల టైమ్ ఆలోచించుకోవటానికి ఇచ్చి, నేనింకా ఏదో మాట్లాడుతుండగానే లేచి గది లోంచి వెళ్లిపోయారు సదరు మేడమ్. బయటకు వచ్చి మరొక మేడమ్ ని ఇంకేదో అడిగితే వారు కూడా చెంప చెళ్ళుమనే సమాధానమేదో చెప్పారు. వెరసి "అంత ఇబ్బంది పడుతూ ఇక్కడే చేర్చాలని ఏముంది? పాపం మీ తాహతుకి తగిన స్కూలునే ఎంచుకోరాదూ?" అని ఉచిత సలహా ఇచ్చి, ఇహ దయచేయమన్నారు స్కూలువారు.
వెనక్కి వచ్చి ఇలా జరిగిందంటూ మా స్నేహితులకు వెళ్ళబోసుకుంటే, "అవును, అది మామూలే కదా? ఆ స్కూల్లో మేము అవమానాలు పొందుతూనే ఉంటాము. కొత్తగా చెప్తున్నావేమిటి? పిల్లలని చదివించాలంటే ఫీజు కడితే చాలదు, ఇలా అప్పుడప్పుడూ అవమానాలు కూడా పొందుతూ ఉండాలి. అవే మన బలానికి టానిక్కులు" అన్నట్టు సెలవిచ్చారు.
స్కూలువారు ఏ కళనుండి సలహా ఇచ్చినా, మాకు జ్ఞానోదయం అయ్యింది. అది తప్ప మరొక స్కూలే లేదా, అంతగా దినదినం దుఃఖిస్తూ అక్కడికే పంపాలా అనుకుంటూ మరొక 3-4 స్కూళ్ళు చూసి చివరకి ఒక స్కూల్లో చేర్చాము మా పుత్రికా రత్నాన్ని. ఇక మొదలయ్యాయి నాకు పరీక్షలు. కలలో కాదు. బయటే. ముప్ఫయ్యేళ్ళ తర్వాత మళ్లీ ఎల్కేజీలో చేరాను. ప్రస్తుతం బాగానే చదువుతున్నాను. ఈ నెలాఖరుకు నాకు క్వార్టర్లీ పరీక్షలు కూడా ఉన్నాయి తెలుసా?
పిల్లల్ని చదివించటం ప్రతి తల్లి సహనానికీ పరీక్షే. కానీ ఇప్పుడు కోవిడ్ కటాక్షేన ఆన్లైన్ చదువులు సంప్రాప్తించాయి కనుక ఇది మరింత విషమ పరీక్ష. అందులోనూ మా అమ్మాయికి ముమ్మూర్తులా నా గుణాలు కొన్ని (ఏమిటో చెప్పను, నా పరువే పోతుంది కనుక) అబ్బేయి కనుక, మరింత రసవత్తరంగా సాగుతోంది మా ఇద్దరి ఎల్కేజీ చదువు. నోటితో చెప్పాల్సిన రైమ్స్, నంబర్స్, ఆల్ఫబెట్ లాంటివి మహా ఉత్సాహంగా చెప్పేస్తోంది. ఎగురుతూ, గెంతుతూ చేయాల్సినవి అన్నీ మహా ఇష్టంగా చేసేస్తోంది. కానీ, చేతివ్రాత రాయవలసివస్తే మాత్రం నాకు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. దానికి మాత్రం నేను చుక్కలు పెట్టాలి (బాగా రాశావంటూ పేజీ చివరన పెట్టే స్టార్స్) ఎంత లేట్ గా రాసినా, ఎలా రాసినా. ఒకవేళ ఏరోజైనా లేట్ గా రాశావు కనుక స్టార్ పెట్టనని అన్నాననుకోండి, మర్నాడు నేను ఏ ఫోన్ కాల్ లోనో ఉన్నప్పుడు బుక్, పెన్సిల్ తెచ్చి స్టార్ పెట్టించేసుకోవాలని చూస్తుంది!
నాకు చుక్కలు కనిపించటం అంటే ఎలాగో చెప్తాను. ఉదాహరణకి B అని కాపీరైటింగ్ రాయాలనుకోండి. "స్టాం...డిం...గ్ ల...యి......న్....." అంటూ ఆ నిలువు గీత గీస్తుంది కొంచెం పైకో కిందకో. "క....ఱ్.....వ్....." అని నోటితో అంటుందే తప్ప కర్వ్ రాయదు. పెన్సిల్ అక్కడ వరకు తీసుకువెళ్తుంది. "ఇక రాసేస్తుంది, రాసేస్తుంది" అని నేను కూడా తన లాగే తల దగ్గరగా పెట్టి ఊపిరి బిగపట్టి చూస్తుంటాను. పెన్సిల్ పూర్తిగా బుక్కు మీద ఆనదు. దాన్ని దగ్గరగా చూస్తుంది, లాంగ్ షాట్ లో చూస్తుంది, 45 డిగ్రీల యాంగిల్ లో చూస్తుంది, మళ్లీ పెన్సిల్ ని కిందకి పెడుతుంది. నేను మళ్లీ బుర్ర వంచి ఊపిరి బిగపట్టి రాసేస్తుందేమో అని చూస్తుంటాను. మళ్లీ పైకి లేపుతుంది. పెన్సిల్ ముల్లుని పరిశీలిస్తుంది. నన్ను చూస్తుంది. నేను తననే చూస్తున్నానని గమనిస్తుంది. గబుక్కున పెన్సిల్ దింపుతుంది. కానీ కర్వ్ రాయదు.
మళ్లీ తల పైకెత్తి, పెద్దగా ఊపిరి తీసుకుని, ఒళ్ళు విరుచుకుంటుంది. "రాయి" అని గద్దిస్తాను. మళ్లీ భయపడ్డట్టు నటిస్తుంది. మళ్లీ పెన్సిల్ సగం దూరం వెళ్తుంది బుక్ వైపుకి. "అమ్మా, దాహం వేసేస్తోంది" అంటుంది బాధగా ముఖం పెట్టి. ఎవరైనా ఆ ముఖం చూశారంటే "కూతురికి మంచినీళ్ళైనా ఇవ్వని కసాయి తల్లి" అని హెడింగ్ పెట్టి నామీద పేపర్లో వేయిస్తారు. అంతటి మహానటి! "లాస్యా, వేషాలు వేయకు. ముందు ఆ B రాయి" అంటాను. "దాహం వేస్తోందన్నా రాయమంటావా?" అన్నట్టు నిష్టురంగా చూస్తూనే తల దించుతుంది. పెన్సిల్ మళ్లీ సగం దూరం వెళ్తుంది. మళ్లీ రకరకాల యాంగిల్స్ లో ఆ లైన్ ని చూస్తుంది, చక్రాలు విరిగిన విమానాన్ని ల్యాండ్ చేయటానికి అవస్థ పడుతున్న పైలట్ లాగా. మళ్లీ నన్ను చూస్తుంది. నేను కోపంగా చూస్తూ కనిపిస్తాను, ఇంక రాసేస్తుంది అనే దురాశతో. "అమ్మా, రాస్తాను, రాస్తాను" అంటుంది భయంతో కంపించిపోతున్నట్టు నటిస్తూ. ఎట్టకేలకు పెన్సిల్ దించి "క...ఱ్....వ్..." అంటూ మొదటి కర్వ్ ని రాస్తుంది. చాతుర్మాస దీక్షకు వెళ్ళే స్వామీజీలు భుజాన కర్రకి చివర మూట కట్టుకుంటారు కదా? అలా ఉంటుంది అది.
మళ్లీ దాన్ని చెరిపితే ఇంకెంత సేపు పడుతుందో అన్న భయంతో నేను ఊరుకున్నానే అనుకోండి, ఇంకా రెండో కర్వ్ ఉండనే ఉంది. మళ్లీ పైన చెప్పినంత ప్రహసనమూ జరుగుతుంది. ఆ అక్షరం అయ్యేలోపు ఎన్నో గుర్తువస్తాయి. "తొందరగా రాసేస్తే స్టార్ పెడతావా?" అంటుంది. "నీట్ గా రాస్తే షన్ను అక్క, అదితి అక్క దగ్గరకి పంపిస్తావా?" అంటుంది. "రాయకపోతే నీ పని చెప్తాను" అని నేనంటే, "అమ్మా, రాయకపోతే పని చెప్తావా?" అంటుంది యమా అమాయకంగా ముఖం పెట్టి.
"రాయకపోతే నాన్నకి చెప్తాను, కర్ర తీసుకొచ్చి కొడతారు" అన్నాను అనుకోండి, అంతే అమాయకంగా కళ్ళు, ముక్కు, మూతి, చెవులు అన్నీ పెట్టి,
"నాన్న కర్ర తీసుకొచ్చి.... కొట్టేస్తారా? అమ్మో!"
"కర్ర ఇక్కడే ఉందా?"
"కొడతారా?"
"నాన్నా?"
"నువ్వు చెప్తావా నాన్నతో?"
"నువ్వు కూడా కొడతావా?"
అంటూ నా బెదిరింపునే మళ్లీ అటు తిప్పి, ఇటు తిప్పి, active voice లోను, passive voice లోను, direct speech గాను, indirect speech గాను, simple, complex, compound sentences గాను, assertive, imperative, interrogative, exclamatory sentences గాను మారుస్తూ తిప్పి తిప్పి నన్ను కొడుతుంది తప్ప, ఆ రెండో కర్వ్ రాయదు. సామ, దాన, భేద, దండోపాయాలు అన్నీ వాడితే చచ్చి-చెడి ఒక్క B పూర్తవుతుంది. ఇంకా పేజీ అంతా రాయాలి! ఇహ ఊహించండి నా నిత్య కళ్యాణం-పచ్చ తోరణం.
స్కూలుకి వెళ్లి మొట్టమొదట నేర్చుకున్నదల్లా కొన్ని ముఖ్యమైన కూతలు...
"పినిశ్ మ్యా..... మ్..."
"గూ..డ్ మాణిం...గ్ మ్యా.... మ్..."
"బా......య్ మ్యా..... మ్..."
స్కూలయ్యాక ఎవరైనా "ఈరోజు ఏం చెప్పారు మీ మ్యామ్" అని అడిగితే "warm up" చెప్పారని చెప్తుంది ఎప్పుడు అడిగినా. "నీ warm up చల్లగుండ, చదువేం చెప్పట్లేదేమిటే?" అని ముక్కున వేలు వేసుకుంటున్నారు అందరూ!
ఇప్పుడిప్పుడే, రాయటమంటే తనకి ఇష్టమని hypnotize చేసి నమ్మిస్తున్నాను. నెలాఖరులో అసలే క్వార్టర్లీ పరీక్షలున్నాయి. అన్నట్టు, ఏదో నాలాంటి మట్టిబుర్రలకి కూడా అర్థమవ్వాలని అలా చెప్తున్నాను గానీ, కాలాన్ని బట్టి ఆ పేరును కూడా మార్చేశారు. "First term assessments" ఉన్నాయి. నేను బాగా చదువుకోవాలి. మీతో ఇలా కబుర్లు చెప్తూ కూర్చుంటే కష్టం. ఇక ఉంటాను మరి. ప్రస్తుతానికి ఈ ముచ్చట్లు "పినిశ్ మ్యా..... మ్..."
"బా......య్ మ్యా..... మ్...", "బా......య్ స..... ర్..."!!
(మొదట ఈ టపా రాసేనాటికి దీన్ని "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" అనే శీర్షికలో పెట్టే ఉద్దేశంతో రాయలేదు. కానీ ఇందులో కూతురులక్ష్మి గురించి రాసిన వివరాలకు తన వీరాభిమానుల స్పందనను చూశాక, నాలాంటి తల్లులు ఎలా తమ తమ అనుభవాలను నెమరు వేసుకున్నారో చూశాక, పైన చెప్పిన పేరుతో శీర్షికను సృష్టించక తప్పలేదు. "క్రానికిల్స్ ఆఫ్ కూతురులక్ష్మి" రెండవ భాగానికి లంకె ఇదిగో...)
https://madilomucchatlu.blogspot.com/2022/05/2.html
కామెంట్లు
చదివిన ప్రతి ఒక్కరూ తమని తాము చూసుకుంటారు.😊