ముక్కు పురాణం

 మీరు చదివింది కరక్టే. అదే దీని టైటిల్. గతంలో ముగ్గు కబుర్లు చెప్పుకున్నాం కదా? ఈసారి ముక్కు కబుర్లు చెప్పుకుందాం. ఏమిటి, మీరు ముగ్గు కబుర్లు మిస్సయ్యారా? అయితే ఇదిగో లంకె.

https://madilomucchatlu.blogspot.com/2020/05/blog-post.html

    సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కానీ నన్నడిగితే కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు కంటే ముక్కు మరీ ప్రధానం. అన్నం లేకుండా ఒక రెండు రోజులు ఉండచ్చు, నీళ్ళు లేకుండా ఒక పూట ఉండచ్చు, నిద్ర లేకుండా ఒక రోజు ఉండచ్చు. కానీ కరడుగట్టిన యోగ ఉపాసకులు కూడా గాలి పీల్చకుండా  గట్టిగా పావుగంట కూడా ఉండలేరు కదా? మరి ఆ గాలి పీల్చటానికి ముక్కు మహా ఇంపార్టెంటు అవునా కాదా?

    రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు పెదవులు, రెండు కాళ్ళు, రెండు చేతులు ఇచ్చిన దేవుడు ఒకే ఒక్క ముక్కునిచ్చాడు. ఇప్పుడు రెండు ముక్కులున్న ముఖాన్ని ఊహించుకోకండోయ్, తట్టుకోలేరు. కళ్ళు రెండిచ్చి, చూపు ఒకటేనన్నాడు. చెవులు రెండిచ్చి వినేది ఒకటేనన్నాడు. కాళ్ళు రెండిచ్చి నడక ఒకటేనన్నాడు, చేతులు రెండిచ్చి చేత ఒకటేనన్నాడు. కానీ ముక్కు ముచ్చటగా ఒక్కటంటే ఒక్కటిచ్చి, ఆ ముక్కుతోనే ఊపిరి పీల్చుకోమన్నాడు, ఆ ముక్కుతోనే వాసన చూసుకోమన్నాడు.

 మరి అంత ప్రాముఖ్యత ఉన్న ముక్కు గురించి మూడు ముక్కలైనా మన ముచ్చట్లలో చెప్పుకోకపోతే, అది విని ఎవరైనా గబుక్కున ముక్కున వేలేసుకుంటారు కదా? ఇవన్నీ నేను ఎక్కడో విని ముక్కున పట్టి చీదేసే కబుర్లు కాదండోయ్. అచ్చంగా నాకే తెలిసిన ముచ్చట్లు. 

   చీటికీ మాటికీ వెంటనే కోపగించుకునేవాళ్ళని "వాడికి ముక్కు మీద కోపం" అంటారు. నాకు మాత్రం నిజంగానే నా ముక్కు మీదే కోపం. నా ముక్కు పెద్దదని మా ఇంట్లోవాళ్ళు రకరకాల జోకులు వేస్తూ ఉంటారు. 'ముక్కన్నాక పడిశం తప్పద'న్నారు. అలాగే, గోదావరి జిల్లాల్లో ఇళ్ళలో వెటకారాలు, విపరీత వర్ణనలు తప్పవు మరి! ముక్కూ-ముఖం తెలియనివాళ్ళు ఎవరైనా అంటే, వాళ్ళ ముక్కు పచ్చడి చేసేయచ్చు. కానీ వీళ్ళు నావాళ్ళు! అందుకే, ఈ ముక్కును నాకిచ్చిన మా అమ్మగారైనా, నా ముక్కుకు తాడు వేసి, ముక్కుపచ్చలారని నన్ను పెళ్ళాడిన మా ఆయనైనా (వాళ్ళ ముక్కులు బాగుంటాయనే బడాయితో) నన్ను అలా వెటకారం చేస్తే, ముక్కుపుటాలు ఎగరావేయను, ముక్కుతూ మూలుగుతూ కూడా కూర్చోను. నవ్వుకుంటాను నేను కూడా. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఈ జీవితంలో, మన మీద వేసే జోకులకు మనం నవ్వుకోగలగటం గొప్ప వరం కూడాను!

        ఎప్పుడో పొరపాటున మంచిపిల్లలా ఉండాలని మూడ్ వచ్చి, ప్రాణాయామం చేయటం మొదలుపెట్టాను పొద్దున్నే. మా ఆయన గబగబా వెళ్లి ఇంట్లోవాళ్ళందరితోను "త్వరగా ఆక్సిజన్ పీల్చేసుకోండి, మా ఆవిడ ఊపిరి బిగపట్టింది, ఇదే సరైన అవకాశం. మళ్లీ తర్వాత కావాలంటే దొరకదు" అంటారు! మరోసారి "ఏమే, కొంచెం నెమ్మదిగా గాలి పీల్చుకోవా, నేను నీ ముక్కులోంచి నీ లంగ్స్ లోకి వెళ్లిపోతానేమో అని భయమేస్తోంది" అంటారు! ఇంకోసారి చాలా టైం ఉన్నట్టుంది, చాలానే ఊహించుకున్నారు. నా ముక్కుకి ముక్కెర చేయించాలంటే ఒక టీమ్ ముందు నా ముక్కుని కొలవాలట. ఒక వైపు నుంచి టీమ్ లోని సగం మంది ఒక తాడుని విసిరితే, రెండో వైపు నుంచొన్న సగం మంది ఆ తాడును పట్టుకోవాలట. అసలు ఇలా కూడబలుక్కున్నాక ఆ సగం మంది ఇటునుండి అటు ప్రయాణమై వెళ్ళాలి కనుక, ఒక బస్ వేయించుకుంటారట. వంటవాడిని మాట్లాడుకొని, పొయ్యి, వంటసామాను అన్నీ ఆ బస్ లో ఎక్కించుకొని, మధ్యలో హాల్ట్ చేసి, వంటలు చేసుకొని తిని, అప్పుడు మిగతా ప్రయాణం చేస్తారట. వీళ్ళు విసిరే తాడు వాళ్ళు అందుకున్నాక, అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని, తర్వాత ఆ తాడును కొలుస్తారట!

    మా మాతాశ్రీ రెండాకులు ఎక్కువే చదివారు. ఆవిడ నేను పుట్టకముందు జరిగిన వృత్తాంతాన్ని వివరించారు. బ్రహ్మదేవుడు వరుసగా ఆ కాలంలో పుట్టాల్సిన పిల్లలందరినీ తయారుచేస్తున్నాడట. నన్ను తయారుచేసే టైం కి మధ్యాహ్నం అయ్యిందట. సరస్వతీ దేవి వంట చేసేసి భోజనానికి వచ్చేయమని భర్తను పిలిచిందట. ఆయనకి ఆ వంట వాసనలకి ఆకలి పెరిగిందట. అంతా అయిపోయింది, ఇంకా ముక్కూ మూతీ పెట్టాల్సి ఉన్నాడట బ్రహ్మ. "ఆ, వచ్చేస్తున్నా సరూ" అంటూ, హడావిడిగా చేతిలో ఉన్న మెటీరియల్ మొత్తం ముక్కు దగ్గరే పెట్టేశాడట. అప్పుడు ఇంకా మూతి పెట్టలేదే అని రియలైజ్ అయ్యి గిన్నెలో చూస్తే, ఇంక మెటీరియల్ లేదట. అయ్యయ్యో, మూతి పెట్టకపోతే ఎలా అనుకొని మర్యాద కోసం ఆ వేలిని జస్ట్ అలా పామాడట ముక్కు కింద. అందుకనే నాకు ముక్కు పెద్దగా, మూతి చిన్నగా వచ్చిందట!!

    మొదటినుంచి అంతా "నీ ముక్కు పెద్దది, నీ ముక్కు పెద్దది" అని నన్ను నమ్మించేశారు. మొదట్లో అవును కాబోలు అని నొచ్చుకున్నా, ఈమధ్య మాత్రం, "పెద్దదో చిన్నదో, పాపం దాని పని అది బ్రహ్మాండంగా చేస్తోంది అని సరిపెట్టుకుంటున్నాను. నా ముక్కు మరీ మంచిది. ఎందుకంటే ఒక రెండుమూడేళ్ళుగా ముక్కుకి వాసన తెలియకపోతే టెన్షన్ పడాల్సిన పరిస్థితి. కోవిడ్ టెస్టు కిట్టులకే బోలెడు ఖర్చు చేసేవాళ్ళం ముక్కు కాస్త బద్ధకించినప్పుడల్లా. కనుక నా ముక్కు నాకు చేయాల్సిన సర్వీస్ అంతా ముచ్చటగా వసూల్ చేసుకుంటున్నాను అన్నమాట.

    అలా వసూల్ చేయటం కూడా ఒక కళే. ఒకేసారి అంతా వసూల్ చేసేయకూడదు మరి. నాకు చేతనైనట్టు కాక, మా అమ్మగారు ముక్కు సర్వీస్ అంతా త్వరత్వరగా వాడేసుకున్నారు. ఈమధ్య ఆవిడ ముక్కుకి వాసన తెలియటం మానేసింది. అలోపతీ, హోమియోపతీ, ఆ పతీ, ఈ పతీ ఏం వాడినా, ఆవిడ ముక్కు మాటవినట్లేదు. ఎందుకు వాసన తెలియట్లేదో ఎవ్వరికీ అంతుచిక్కట్లేదు. నాకు అర్థమైపోయింది ఒకరోజు. ఆవిడకి ఒక అలవాటుంది. ఉతికిన బట్టలు మడతపెడుతూ, ప్రతి బట్టనీ వాసన చూస్తారు. అంటే సరిగ్గా ఆరాయో లేదో అని ముక్క వాసన కోసం క్వాలిటీ చెక్ చేస్తుంటారో, ఆ డిటర్జెంట్ వాసనో కండీషనర్ వాసనో నచ్చి ఆవిడకి తెలియకుండానే ఆవిడ వాసన చూస్తుంటారో గానీ, ఆవిడకి అదొక అలవాటుగా మారింది. అలా ఎన్నో ఏళ్ళుగా బట్టల వాసన చూసి చూసి, ఇక ఆవిడ ముక్కు టైర్ అయిపోయి రిటైర్ అయిపోయిందన్నమాట.

    ముక్కులందు మహా ముక్కులు వేరయా అని, నా ముక్కుకైతే సెలక్టివ్ స్మెల్లింగ్ పవర్ కూడా ఉంది. సువాసనల మాట ఎలా ఉన్నా, పిచ్చి వాసనలు ఇంకా బాగా పీల్చగలదు. కనుక, ఇంట్లో నాది క్వాలిటీ అషూరెన్స్ శాఖ. ఏదైనా నిన్నటి కూరో, మొన్నటి పచ్చడో, ఉదయం వండిన అన్నమో వడ్డించుకొనే ముందు, ఒక్కసారి నా ముక్కు దగ్గరకి తీసుకువస్తే, అది "యే" అని గానీ "నే" అని గానీ తేల్చేస్తుంది. మిగతావారికి ఒక పూట తర్వాత రాబోయే పాడు వాసన నాకు ఇప్పుడే వచ్చేస్తుంది!

    మరి ఇంత చక్కగా పనిచేస్తున్న నా ముక్కుశ్రీకి ముక్కెర గిఫ్టుగా ఇచ్చి ఋణం తీర్చుకోవద్దూ? ఆ కొలతలూ అవీ పూర్తయ్యాక, మా ఆయన ముక్కు పిండి ఆ ముక్కెర ఏదో వసూల్ చేస్తాను ఉండండి.

    అన్నట్టు ఈ ముక్కు పురాణంలో సామెతలు, జాతీయాలు మొత్తం ఎన్ని ఉన్నాయో చెప్పుకోండి, చూద్దాం!


కామెంట్‌లు

Unknown చెప్పారు…
Challa bhagundhi...
Unknown చెప్పారు…
Chala baga cheparu
Unknown చెప్పారు…
Super undi mukku puranam.aa makers kuda vachindante inka andamga untundi Mukkera tho mukku

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్