మా వఫ్రహో కథ

కోవిడ్ శకంలో మొగుళ్ళు ఇంట్లో కూర్చొని పనిచేయటంవల్ల పెళ్ళాలని అవీ ఇవీ వండిపెట్టమని కాల్చుకుతింటున్నారంటూ వచ్చిన జోకులతోనూ, ఇంట్లో పెళ్ళాంబిడ్డల గోల ఎక్కువై పని సరిగ్గా చేసుకోలేకపోతున్నామంటున్న మొగుళ్ళ గోడు గురించి వచ్చిన కార్టూన్లతోనూ, "ఆఁ.. ఎవరికి కనిపిస్తుందిలెద్దూ" అంటూ మీటింగులున్న కాసేపూ పైన ఆఫీసు చొక్కాలూ టైలూ ధరించి కింద లుంగీలో నిక్కర్లో వేసుకున్న ఫోటోలతోనూ, చిన్నప్పుడు స్కూలుకి ఎగనామం పెట్టటంవల్ల కర్మ ప్రతిఘటించి ఇప్పుడు పెద్దలు వాళ్ళ పిల్లలతో కలసి కూర్చొని పాఠాలు వింటున్నారంటూ వచ్చిన సెటైర్లతోనూ, మొగుడూపెళ్ళాల మధ్య, తల్లిదండ్రులకీ-పిల్లలకీ మధ్య ఎదురైన ఇబ్బందుల్ని, తప్పని తిప్పల్ని ఉప్పుకారాలు, మసాలాలు జోడించి చూపించిన షార్ట్ ఫిలిమ్స్ తోనూ సోషల్ మీడియాను శుభ్రంగా క్రియేటివిటీలో నానపెట్టి ముంచిలేపారు మనవాళ్ళంతా.

అయితే మా ఇల్లు ఈ నూతనత్వానికి మినహాయింపు. అంటే అర్థం ఇవన్నీ మా ఇంట్లో జరగలేదని కాదు. కోవిడ్ శకానికీ మాకూ సంబంధం లేదని, అంతకంటే ముందునుంచే ఇవన్నీ మేము చూసేశామని. కోవిడ్ పుట్టుకకి దాదాపు రెండేళ్ళ ముందునుంచే మా శ్రీవారు 'వర్క్ ఫ్రం హోం' చేశారు కనుక. ఓ ప్రాజెక్ట్ లోకి మావారిని తీసుకుంటూ, "అబ్బే, నువ్వు ఆఫీసుకి వస్తానన్నా మేమెవ్వరం ఇక్కడ లేము, ఇంకెక్కడెక్కడో ఉన్నాం, ఇక నువ్వు మాత్రం వచ్చి ఏం చేస్తావు? అబ్బెబ్బే, అస్సలే అనవసరం. ఇంట్లో కూర్చొని పని చేసేయ్" అన్నారు. "ఓహో, పోనీలే, దుమ్ము-ధూళిలో పడిపడి వెళ్ళటం తప్పుతుంది" అని ఇంటిల్లిపాదీ సంతోషించాము. ఆ రాను-పోను టైం మిగులుతుంది అనుకుంటే, దానిలోంచి కూడా పనిని పిండుకోవటంలో పై మేనేజర్లు చేయితిరిగినవారు అనుకోండి, అది వేరే విషయం.

ఈ ప్రాజెక్ట్ అయ్యాక ఇంకో ప్రాజెక్ట్ వారూ ఇదే అన్నారు. అదయ్యాక మరో ప్రాజెక్ట్. ఆసారి మా ఆయనే ఇలా కావాలన్నారు, వాళ్ళూ సరేనన్నారు. ఈలోగా కోవిడ్ శకం మొదలయ్యింది. ఇక అందరూ మా దినచర్యని ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. అందరితోపాటే మాకూ ఈ "వఫ్రహో" (వర్క్ ఫ్రం హోమ్) పద్ధతిమీద కొంత విసుగువచ్చేసింది, వచ్చిందని మాకూ తెలియనంత నెమ్మదిగా.

మాకు ఎప్పుడు తెలిసిందంటే, కోవిడ్ శకం ముగిసి, ఒకొక్క కంపెనీ తన ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకి రమ్మని బలవంతపెడుతుంటే, మా ఆయన తనకి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసినప్పుడు!

కొంతకాలం గడిచింది. ఆకులు రెండుసార్లు రాలాయి, రెండుసార్లు చిగురించాయి, మా ఆయన రెండుమూడు ప్రాజెక్ట్లు మారారు, అయినా ఎవ్వరూ రమ్మనట్లేదు. ఇరుగుపొరుగుల్లో మిగతా అందరూ కనీసం వారానికి మూడు రోజులైనా ఆఫీసుకి వెళ్ళివస్తున్నారు! ఇలా ఉండగా ఒకానొక ముహూర్తాన మా ఆయన మనసుని గట్టిచేసుకొని తన కంపెనీతో ఉన్న ఎనిమిదేళ్ళ అనుబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వేరే కంపెనీ ఆఫర్ ని స్వీకరించారు. ఈసారి ఈ కంపెనీ తనని ఖచ్చితంగా రమ్మంటుంది అనుకున్నారు. "మధ్యాహ్నం భోజనం టైంకి వండటానికి బానే అలవాటుపడ్డావు, ఇక ఆ రోజులు పోయాయి, పొద్దున్నే వండి నన్ను పంపించాలి" అని మెత్తగా హెచ్చరించారు. "మరీ మంచిది మహాప్రభో" అనుకున్నాను. ఎందుకంటే మొగుడు ఆఫీసుకి వెళ్తాడంటే ఏ పెళ్ళాం అయినా ఉదయం తొమ్మిదింటిలోపు ఎంత పని చేస్తుందో, మొగుడు ఇంట్లోనే ఉంటాడన్నరోజున ఒంటిగంటదాకా అదే పని చేస్తుంది. కాదని ఎవరైనా అంటారేమో, అనండి చూద్దాం?

ఇంతకీ మాంచి వర్షాకాలంలో... ఇంకో వారంలో కొత్త కంపెనీలో కాలుమోపుతారనగా, మా ఆయన బజార్లోకి వెళ్ళి కావాలనుకున్నవన్నీ కొనుక్కుతెచ్చుకున్నారు. మరి నాలుగైదేళ్ళ తర్వాత ఆఫీసుకి వెళ్ళటమాయే! కాపురానికి వెళ్ళే కొత్తకోడలు కూడా ఇంత పొందికగా లిస్ట్ రాసుకొని కొనుక్కోదు!

ఒక మంచి కళ్ళజోడు, ఒక చక్కటి ఫార్మల్ షూ జత, అందులోకి మడమలకి నొప్పి రాకుండా మంచి సోల్స్, రెండుమూడు మంచి సాక్స్ జతలు, ఒక లంచ్ బ్యాగ్, ఒక లంచ్ బాక్స్, ఒక రెయిన్ కోట్, దారిలో వర్షం పడితే లంచ్ బ్యాగ్ చుట్టూ చుట్టటానికి ఒక కవరు, ల్యాప్ టాప్ బ్యాగ్ ని అమాంతం దింపటానికి సరిపడే పెద్ద వాటర్ ప్రూఫ్ కవరు, హైదరాబాద్ రోడ్ల మీద పొంగిపొరలే నదులు-ఉపనదుల గురించి తెలుసు కనుక ఖరీదైన షూ తడిసిపోకుండా అవి పెట్టుకోవటానికి ఒక కవరు, ఆ టైంలో వేసుకోవటానికి రబ్బరుతో చేసిన వర్షపు చెప్పుల జత, ఒకవేళ వర్షం పడకుండా చలిగాలి మాత్రమే వేస్తుంటే దానికోసం ఒక మఫ్లరులాంటి టోపీ. ఇవన్నీ తెచ్చుకున్నారు. తీరా కొత్త కంపెనీలో చేరాక, ఒక ప్రాజెక్టులో వేశారు, ఇంట్లోంచి పని చేసుకోమన్నారు! మళ్ళీ ఇవన్నీ దాచేసి, నాలుగున్నర ఏళ్ళనుంచి ఉన్నట్టే గడపటం మొదలుపెట్టాము. వర్షాకాలం పోయి, చలికాలం పోయి, ఎండాకాలంలోకి వచ్చాము.

చివరికి మొన్న వచ్చింది శ్రీముఖం, వారానికి మూడురోజులు ఆఫీసుకి రావాలంటూ. పై గూట్లో, పంచదార డబ్బా వెనుక ఖాళీలో పడేసిన కొత్త లంచ్ బ్యాగ్, బాక్స్ తీసి, దుమ్ము దులిపి, కడిగి రెడీ చేసుకున్నాను ముందురోజే. మా అయిదేళ్ళ కూతురు ఊహ తెలిసాక నాన్నని ఆఫీసు బట్టల్లో మొదటిసారి చూసి ఉబ్బితబ్బిబ్బయ్యింది. నాన్న ఆఫీసుకి వెళ్తున్నారంటూ ఊరూవాడా చాటింపు వేసింది. మా ఆయన ముఖంలో పుట్టినరోజు జరుపుకొనే పిల్లవాడిలాగా కొత్తకళ! "నువ్వు నాకు నచ్చావ్" లో వెంకటేష్ చెప్పినట్టు ఒకమ్మాయి అయినా బాగుండకపోతుందా అనుకున్నారేమో, అందంగా తయారై, బుద్ధిమంతుడిలా విభూతి-బొట్టు పెట్టుకొని బానే రెడీ అయ్యారు.

మా పెళ్ళి కాకముందు మా ఆయన ఉన్న రూమ్ కి పక్కింట్లో ఒక క్షురకుడు (బార్బర్) ఉండేవాడట. సోమవారం నుండి శనివారం వరకు ఇంట్లోంచి కదిలేవాడు కాడట. ఆదివారం మాత్రం పొద్దున్నే ఇలాగే తలంటుకొని, విభూతి పూసుకొని, బొట్టు పెట్టుకొని, ఇస్త్రీ చేసిన బట్టలతో టిప్ టాప్ గా తయారై మంగలిపెట్టె పట్టుకొని షాపుకి బయలుదేరేవాడట. తల్లి, తండ్రి, పెళ్ళాం, ఇద్దరు పిల్లలు, మరో చంటిబిడ్డతో సహా అంతా బయటకొచ్చి అతను వీధి మలుపు తిరిగేవరకు "బాయ్ నాన్నా", "టాటా అండీ" అంటూ గోలగోలగా సాగనంపేవారట. ప్రతి ఆదివారం ఈ షో తప్పనిసరిగా ఉండేదట.

మా ఆయనకి అద్దంలో చూసుకుంటే ఆ క్షురకరత్న గుర్తొచ్చాడు ఇప్పుడు. అతనికీ నాకూ ఒకటే తేడా అన్నారు. అతగాడు ఆదివారం సాయంత్రం అయ్యేసరికి తను పూటుగా తాగటమే కాక, తల్లికి కూడా ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చేవాడట!

ఇంతకీ అలా మా ఆయన్ని మేమంతా సాగనంపగా, సరికొత్త ఆఫీసుకి క్రొంగొత్తగా వెళ్ళారు. తీరా అందరినీ వచ్చేయమని పిలుపునిచ్చారే గానీ, అక్కడ అన్ని సీట్లు రెడీగా లేవని ముందే వేగులద్వారా తెలిసింది. రైల్వే ప్లాట్ ఫారం మీద తుండుగుడ్డ పరుచుకుకూర్చునట్టు వీళ్ళని కూడా ఏదో ఒకటి పరుచుకొని, ఎక్కడో ఒక మూల నేలమీద కూలబడి పనిచేయమంటారో ఏమిటో! మా ఆయన వచ్చాక అడగాలి రేపటినుంచి క్యారేజీతో పాటు ఒక ఉతికిన దుప్పటో తువ్వాలో పెట్టమంటారేమో! ఒకవేళ కొంపదీసి, సీట్లు ఖాళీ లేవు, వఫ్రహో చేసేయమంటేనో?!!!


ఈ కథ NATS (North American Telugu Society) సంబరాల సందర్భంగా publish అయిన souvenir లో ప్రచురితమయ్యింది.

ఈ లంకె ద్వారా ఆ souvenir ని చేరుకోవచ్చు...

https://online.flipbuilder.com/NATS/xegb/

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్