ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్

    బాలాత్రిపురసుందరీమహాలక్ష్మిగారు... మా నాన్నమ్మ. చంద్రబింబంలాంటి కళ, సూర్యబింబంలాంటి కాంతి తన సొంతం. ఊరికి కొత్తకోడలిగా వచ్చినప్పుడు హీరోయిన్ అంజలీదేవి వచ్చిందని ఊళ్ళోవాళ్ళు చెప్పుకున్నారట. ఏ రంగు చీర కడితే ఆ రంగుకే అందం వచ్చిందా అన్నంత కళకళలాడే వర్చస్సు. శుచి-శుభ్రతకి పెద్దపీట వేసేది. చివరి రోజుల్లో కూడా కడిగిన ముత్యంలా మెరిసేది.

    ఖంగుమనే కంఠస్వరం. ఆరుగురు పిల్లలతో తాతగారు ఏడో పిల్లవాడిలా ఆటపాటలు, అల్లరివేషాలు వేసేవారట. ఆయనతో ఫ్రెండ్ లా మెలిగిన వాళ్ళు నాన్నమ్మ కంటిచూపుకి కూడా గడగడలాడేవారట. సినిమాల్లో భానుమతిలాగా "ఖడేరావ్" అందంటే దడదడలాడుతూ అంతా వరుసలో నుంచోవాల్సిందే.

    పిల్లలకైనా, మనవలకైనా పధ్ధతిలో ఆవిడదే స్ఫూర్తి, ప్రేమను పంచే విషయంలో అంతకుమించిన అమృతమూర్తి. ప్రతి తల్లీ తన కడుపున పుట్టిన పిల్లల్ని ఆస్తిపాస్తులకంటే ఎక్కువగా భావిస్తుంది. కానీ ఆ విషయంలో మా నాన్నమ్మది ఇంకొంచెం ఎక్కువ స్థాయి అనురాగం అనిపిస్తుంది నాకు. ఆరుగురు పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఇనిమనవలు ఎంతమంది తన పరివారంలోకి చేరినా, అందులోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో ప్రేమను పంచేది.

    నిజం. డైలాగ్ లేకుండానే ఎదురుగా ఉన్న తన సంతానాన్ని చూసుకుంటూ ఆవిడ మురిసిపోతూ ఉండటం, గర్వంగా ఫీల్ అవ్వటం ఎన్నోసార్లు చూశాను. ఒకోసారి సిగ్గుగా అనిపించేది కూడాను, ఈవిడ ఇంత గర్వపడేలా నా దగ్గర ఏముందని :)

       సొంత చేతులతో ఇల్లు కట్టుకున్నారట తాతగారు, నాన్నమ్మ, వాళ్ళ పిల్లలు. తర్వాత అవసరం లేకనో, నెమ్మదిగా వయసు పెరుగుతూ ఓపిక తగ్గబట్టో మానినప్పటికీ, నా చిన్నతనంలో కూడా ఆవిడ స్వయంగా గోసేవ చేయటం, పేడ తొక్కి పిడకలు చేయటం, నూతిలోంచి చేదలకొద్దీ నీళ్ళు తోడి, కట్టెలపొయ్యితో అందరికీ డేగిశాలకొద్దీ నీళ్ళు కాయటం, కుంకుళ్ళతో స్నానాలు చేయించటం, గోరింటాకు కోసి రోట్లో రుబ్బిపెట్టటం, పౌరహిత్యంలో వచ్చిన కొబ్బరిచిప్పలను ఎండబెట్టి ముక్కలుగా కోసి నూనె తీయించటం, వాకిలంతా పేడ కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టటం, పత్తికోసి ఒత్తులు చేయటం, కొబ్బరాకుల్లోంచి ఈనులు తీసి చీపుళ్ళు కట్టటం... ఇలా ఒకటేమిటి, విశ్రాంతిని కోరకుండా పనులు చేస్తూనే ఉండే 'పని రాక్షసి'. ఆవిడనుంచి ఆ ఒక్క సుగుణం అబ్బినా చాలు, మన ఆరోగ్యాలకి ధోకా ఉండదు.

    రాత్రిపూట ఆవిడని చపాతీ తినాలి అని డాక్టర్ చెప్పి ఉండచ్చు, మా చిన్నతనంలో మా అందరికీ అన్నాలు పెట్టేసినా, కోడళ్ళు ఆవిడకి ప్రత్యేకంగా చపాతీ చేసేవారు. ఆవిడ ఆ చపాతీపై మాగాయ రాసుకొని దాన్ని చాపలా చుట్టి, ఆ చుట్టని కొంచెంకొంచెంగా కొరుక్కుతింటుంటే, అలా విస్తుపోయి చూసేవాళ్ళం. ఆవిడ మమ్మల్ని ఒక ముక్క కొరుక్కోమని ఇచ్చేది. ఆహా, ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఆ రుచి తలచుకుంటే. అదైపోయాక ఆరుబయట గడ్డిమేటుకి కొంచెం ఇవతల తులసికోట పక్కనే మడతమంచం మీద పడుకొని, విసినికర్రతో ఆవిడ విసురుకుంటుంటే, తన పక్కకి వెళ్ళి పడుకొని ఆకాశంలోని చుక్కల్ని, చందమామని చూస్తూ కథలు చెప్పించుకునేవాళ్ళం. తోగుమ్మిలో చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మొదట ఇవే గుర్తొస్తాయి.

    ఈపాటికి తాతగారితో కబుర్లు చెప్తూ, కిందున్న మనల్ని చూస్తూ మురిసిపోతూ ఉండి ఉంటుంది ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సుందరమ్మగారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్