హ్యాండ్ బ్యాగ్
ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్ ఎందుకు వాడతారు అనే అంశం మీద ఎన్నో కథలు, ఎన్నో జోకులు, ఎన్నో హాస్య వ్యాసాలు ఉన్నాయి. బరువు-బాధ్యత అనే ద్వంద్వ సమాసం మొట్టమొదట ఎక్కడ పుట్టిందో గానీ, అది హ్యాండ్ బ్యాగ్ కి నిర్వచనంగా సరిగ్గా సరిపోతుంది.
కానీ అది ఆడవాళ్ళకి మాత్రమే భూషణం ఎందుకు అయ్యింది? ఇదొక సమాధానం లేని చిక్కుప్రశ్న. రెండుమూడేళ్ళ వయసున్న ఆడపిల్లలు కూడా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని స్టైల్ గా తిరగాలని తాపత్రయపడుతుంటారు. కాసేపటికి ఆటల మీదకి ధ్యాస మళ్ళాక ఆ బ్యాగ్ ని కూడా అమ్మ మొహాన పడేస్తారనుకోండి. అలా తమ మొహాన పడేయబడ్డ ఎన్నో వస్తువులను హ్యాండ్ బ్యాగ్ లో కుక్కుకొని, ఏ ఆకారంలో ఉన్నదైనా అది కొబ్బరిబొండం షేపులోకి మారిపోయి, తగిలించుకున్న చోట ఇక చోటు లేక జారిపోతూ, భుజాన బరువై ఇబ్బంది పెడుతున్నా, మొగుడు కట్టిన మంగళసూత్రంతో సమానంగా దాన్ని అదిమి జాగ్రత్తగా పట్టుకొని ఇల్లు చేరుతారు ఆడవాళ్ళు. మొన్నొక రోజున నా బ్యాగ్ అలాగే బోలెడంత బరువుగా అనిపించి, ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను.
ఇలాగే మా పెళ్ళైన ఏడాది ఒకరోజు అంతకంతకీ నా హ్యాండ్ బ్యాగ్ బరువైపోతోందని గమనించాను. ఎందుకా అని ఒకొక్క వస్తువూ బయటకి తీసి చూశాను. ఏదీ అంత బరువైన వస్తువు కాదు. తేలికవన్నీ కలిసేసరికి బరువయ్యిందా ఏమిటని ముక్కున వేలేసుకున్నాను. కానీ అన్నీ తీసేసినా ఇంకా బ్యాగ్ బరువుగానే ఉంది. పెళ్ళవ్వగానే డైటింగ్ మానేసే వాళ్ళ లాగా నా బ్యాగ్ కూడా నాకు పెళ్ళవ్వగానే ఒళ్ళు చేసేసిందా ఏమిటి? మళ్లీ అరలన్నీ వెతికాను, అన్నీ ఖాళీ. వంచి కొంచెం కుదిపాను ఇంకేమైనా ఉన్నా కిందకి పడతాయని.
ఏమీ పడలేదు గానీ, చంద్రముఖి సినిమాలో అర్థరాత్రి వచ్చినట్టు ఒకటే గజ్జెల చప్పుడు అది ఊపినప్పుడల్లా. ఊపగా ఊపగా ఒక రూపాయి నాణెం కిందకి పడింది. ఇదెక్కడ నుండి వచ్చిందని జాగ్రత్తగా చూస్తే, ఒక అరలో మూల కుట్లు ఊడి, అందులోంచి ఒకొక్కటిగా రూపాయల నాణేలన్నీ జారి కిందకి చేరాయి అన్నమాట. నేను ఆ కుట్లు ఊడిన చోటకి చేయి పెట్టి తీస్తూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయి, నేను తీస్తూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయి. చివరకి నా బ్యాగ్ మొదట్లో ఇంత తేలికగా ఉండేదా అని నేనే విస్తుపోయాను. ఎన్నాళ్ళ నుంచి చేరాయో ఇన్ని నాణేలు!
ఆ నాణేల మధ్యలో ఒక విలువైన వస్తువు కూడా ఉంది. మా పెళ్లిచూపులు జరిగిన ఏడాదికి మొట్టమొదటి ఏనివర్సరీ అని గుర్తుపెట్టుకొని, (మగవారు సాధారణంగా మరచిపోతారు కనుక) ఆ విషయం మా ఆయన ఖచ్చితంగా మరచిపోయే ఉంటారనే నమ్మకంతో, ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని ఆయన ఆఫీసు నుంచి వచ్చేసరికి ఏవో కొత్త రకం వంటలు (ఇంచుమించుగా బంగాళా భౌభౌ రేంజులో) వండి, కొత్త చీర కట్టుకొని "అయ్యో, సారీ, మరచేపోయాను" అంటూ మా ఆయన పెట్టే ముఖాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నాను.
మా ఆయన ఇంటికి వచ్చాక, ఆ మాటే అంటూ, ఆ ముఖమే పెడుతూ, సైలెంటుగా బ్యాక్ ప్యాక్ లోంచి ఒక గిఫ్ట్ బ్యాగ్ తీసి నా చేతిలో పెట్టారు, "హ్యాపీ ఏనివర్సరీ" అంటూ, ఇంకో మాట కూడా అంటూ. అందులో హృదయం ఆకారంలో ఉన్న ఒక చక్కటి బాక్స్, అందులో ముద్దుగా ఉన్న ఒక వాచ్. డైల్ చుట్టూ రోజూ మార్చుకోవటానికి రంగురంగుల రింగులు. నా కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి.
ఇంతకీ ఆ వాచ్ పెట్టుకొని ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాను. ఎగ్జామ్ ఏమిటి, ఎలా రాశాను అనేది ఇప్పుడు అడగకండి, అప్రస్తుతం. ఆరోజు నుంచి ఆ వాచ్ కనిపించలేదు. ఆ ఎగ్జామ్ హాల్లోనో, దారిలోనో పడేసుకొని వచ్చానేమో అని నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయి, మా ఆయన దగ్గర ఒకటే ఏడుపు, "ఆ గిఫ్ట్ కి నేను అనర్హురాలిని" అంటూ. ఎంతసేపని "పర్వాలేదులే" అని ఊరుకోపెడతారు? నా ఏడుపు చూసి మా ఆయన తలపట్టుకున్నారు "ఎరక్కపోయి గిఫ్ట్ ఇచ్చాను" అని!
ఆ వాచ్ ఆనాడు రూపాయి నాణేలలాగే కిందకి వెళ్లి దాక్కుంది అన్నమాట ఇంతకీ. అది దొరికాక ఇక నా ఆనందానికి అవధుల్లేవు. "ఆ ఏడుపేమిటో, ఈ ఆనందమేమిటో, ఏం చేసినా అతే" అని మా ఆయన ఏడిపించటం మొదలుపెట్టారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లోంచి బయటకి వచ్చి, ఈసారి కూడా ఏమైనా నిధి నిక్షేపాలు, లంకెబిందెలు బయటపడతాయేమో అనే ఆశతో మళ్లీ హ్యాండ్ బ్యాగ్ ఖాళీ చేయటం మొదలుపెట్టాను మొన్న.
1) ఇద్దరు కత్రినా కైఫ్ లు నవ్వుముఖంతో కనిపించారు. అంటే, డస్ట్ బిన్ అందుబాటులో లేక, తర్వాత పడేద్దామని రెండు ఖాళీ స్లైస్ సీసాలు పెట్టుకున్నాను అన్నమాట.
2) బ్యాంక్ లావాదేవీల రసీదులు ఎనిమిది
3) విజేత, రత్నదీప్ సూపర్ మార్కెట్ల బిల్లులు ఐదు
4) వాడేసిన మాస్కులు రెండు
5) వాడాల్సిన మాస్కులు నాలుగు
6) ఎప్పుడో ఎవరో నగదు బహుమతి చదివించగా, నగదు తీసుకొని వాడేసుకొని, బాగున్నాయి కదా అని ఉంచుకున్న ఎన్వలప్పులు రెండు
7) పేపర్ టవల్స్ ఆరు
8) ఎప్పుడో గత ఏడాది ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎయిర్ లైన్స్ వాళ్ళు ఇచ్చిన బుజ్జి బుజ్జి శానిటైజర్ ప్యాకెట్లు పదకొండు
9) ఫెవికాల్ డబ్బా మూత
10) కిరాణా లిస్టు
11) నాలుగు నెలల క్రితం రాజమండ్రి వెళ్లినప్పుడు రాసుకున్న బజారు పనుల లిస్టు, వాటి తాలూకు బిల్లులు
12) నెల క్రితం గుడిలో తీసుకున్న శ్రీరామనవమి కార్యక్రమాల వివరాల కరపత్రం
13) నోట్ ప్యాడ్
14) డబ్బుల లెక్కల వివరాలు రాసుకున్న చీటీలు రెండు
15) గుళ్ళో మూడు రోజుల క్రితం తీసుకున్న ప్రసాదం, కుంకుమ పొట్లం
16) మా అమ్మాయి కోసం కొని ఇవ్వకుండా ఉంచేసిన లాలీపాపులు రెండు
17) సగం తిని దాచుకున్న డెయిరీ మిల్క్
18) ఎందుకైనా మంచిదని రెండేళ్ళ క్రితం మా అమ్మాయి చిన్నప్పుడు లోపలి జిప్పులో దాచి పెట్టిన దాని డైపర్
19) డబ్బు వ్యాలెట్, కార్డులు
20) వంద నోట్లు రెండు, పది రూపాయల నోటు ఒకటి
21) గత నెల గుడికి వెళ్లినప్పుడు హుండీల్లో వేయాలని కవర్లో పెట్టుకున్న చిల్లర నాణేలు
22) కళ్ళజోడు బాక్సు
23) పిన్నీసుల కట్ట
24) బ్యాండ్ ఎయిడ్
25) అమృతాంజనం
26) ఎందుకు ఉందో కూడా తెలియని ఒక ఖాళీ ఉంగరం బాక్సు
27) ఎర్ర పెన్నులు రెండు, నీలం పెన్నులు మూడు, పెన్సిల్ ఒకటి
28) ఇయర్ ఫోన్స్
29) హెయిర్ పిన్నులు
30) ఎసిడిటీ వస్తే తాగటానికి ఈనో ప్యాకెట్టు
31) బొట్టు ఊడిపోతే పెట్టుకోవటానికి స్టిక్కర్ల ప్యాకెట్టు
32) కాలం చెల్లిన డ్రైవింగ్ లైసెన్సు, బండి కాగితాలు
33) రబ్బరు బ్యాండ్లు
34) ఎందుకు ఉన్నాయో, దేనికి ఉపయోగపడతాయో, ఎక్స్పైర్ అయ్యాయేమో కూడా తెలియని రెండు ట్యాబ్లెట్లు
35) మా అమ్మాయి పిలకలు ఊడిపోతే వేయటానికి రబ్బరు బ్యాండ్లు రెండు
36) కాటుక భరిణె
37) జేబురుమాలు
38) ఎప్పుడైనా కుదిరితే గుచ్చించుకుందామని ఒక బాక్సులో పెట్టుకున్న తెగిపోయిన ముత్యాల గొలుసు
39) గుర్తింపు కార్డులు
40) ఎందుకో హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఎవరిదో విజిటింగ్ కార్డు
41) బుల్లి సైజ్ దేవుడి శ్లోకాల పుస్తకం
42) ఒక రైమ్స్ పుస్తకం
43) ఒక కథల పుస్తకం
44) తాళం చెవుల గుత్తులు రెండు
45) ఒక చిన్న దువ్వెన
46) ఒక ఫోన్
47) ఫోన్ చార్జర్
48) కాలం చెల్లిన బస్ టిక్కెట్టు
49) ఎందుకైనా ఉపయోగపడతాయని పెట్టుకున్న రెండు ఖాళీ క్యారీ బ్యాగులు
50) ఇవన్నీ ఉన్నాయని ఎడ్జస్ట్ అవుతూ పాపం మూలకి కూర్చున్న ఒక వినాయకుడి విగ్రహం (నవధాన్యాలతో చేసినదంటూ మా అమ్మమ్మగారు ఇస్తే bag లో ఉంచుకున్నాను).
ఇవన్నీ బయటకి వచ్చాక, సుఖ ప్రసవం అయిన స్త్రీ కళ్ళలోని ఆనందం నా బ్యాగ్ ముఖంలో కనిపించింది కానీ, ఇన్ని వెలికితీసినా ఒక్క లంకె బిందె కూడా దొరకదే!!!
కామెంట్లు
ఈ టపా చదివిన ఒక పెద్దమనిషి నన్ను అడిగారు, "అంతా బానే ఉంది గానీ మగంగుల పర్సుల్లో ఏముంటాయో ఊహించగలరా?" అని.
"పెళ్ళాంబిడ్డల ఫోటో, కార్డులు" అని కొంతవరకు ఊహించి చెప్పాను.
"Usually you can find torn notes that are waiting to be exchanged.. if software engineer some receipts that need to be reimbursed by office..
And if you visit foriegn couple of foriegn notes and coins.
If you are very careful person 1 rupee revenue stamps for next tax filing
And many visiting cards .. and petrol pump credit card customer copies 😊
అని ఆయనే వెల్లడి చేశారు.
కానీ ఇవేమీ నాకు తట్టలేదు అంటే మీకు ఏమి అర్థమవుతోంది?
"తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది" అనే మాట అస్సలు నిజం కాదని. చూసి ఉంటే మనకి తెలిసేవే కదా? ఏమంటారు లేడీస్? 😜