మై ఫ్రెండ్ గణేశ
నాకు ఊహ వచ్చే రోజుల్లో మేము ఏలూరు దగ్గర పెదపాడులో ఉండేవాళ్ళం. మేము ఉండే ఇంటిని ఆనందాశ్రమం అనేవారు. ధనమ్మగారు అనే మామ్మగారిల్లు అది. అందుకే "మామ్మగారిల్లు" అని దానికి ఇంకో పేరు ఉండేది. ఇంటికి ముందువైపు పొడుగాటి వరండా ఉండేది. గాలి-వెలుతురు వస్తూ చక్కగా చల్లగా ఉండేది అక్కడ. వేసంకాలంలో అక్కడ మడతమంచం మీద పడుకుని కబుర్లూ, కథలూ వింటూ నిద్రపోయినప్పుడు ఉండే హాయి ఇప్పుడు మాటల్లో చెప్పలేను. అందుకేచెప్పట్లేదు.
ఇలా 'అటూ-ఇటూ తిరగటం' అనే దైనందినకార్యక్రమం కోసం రోజంతా నేను, మా తమ్ముడు ఎదురు చూసేవాళ్ళం. మా నాన్నగారు, అమ్మగారు మాకు ఆ టైం లో చెప్పే కథల కోసం. పంచతంత్ర కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, రామాయణం, మహాభారతం లాంటి పురాణాల కథలు అన్నీ ఇప్పటి డైలీ సీరియల్స్ లాగా గొప్ప సస్పెన్సులో ఆపుతూ చెప్పేవారు. ఈ సీరియళ్లు శుక్రవారం పెద్దపెద్ద ఉరుముల్లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆపి "మళ్ళీ సోమవారం కలుద్దాం" అని వీక్షకుల్ని నిరాశకు, బెంగకు గురిచేసి 2 రోజులు కనుమరుగైనట్లు మాకూ జరిగేది. అటువంటి gap వచ్చిన రోజుల్లో మాకు మరో రకం class ఉండేది. తెలుగు సంవత్సరాల పేర్లు, నెలలు, ఋతువులు, నక్షత్రాలపేర్లు వల్లెవేయించేవారు. ఆ వరసలోనే మాకు తిథుల పేర్లూ, పండగలో పేర్లూ కలిపి ఒకేసారి చెప్పేవారు.
ఇలా 'అటూ-ఇటూ తిరగటం' అనే దైనందినకార్యక్రమం కోసం రోజంతా నేను, మా తమ్ముడు ఎదురు చూసేవాళ్ళం. మా నాన్నగారు, అమ్మగారు మాకు ఆ టైం లో చెప్పే కథల కోసం. పంచతంత్ర కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, రామాయణం, మహాభారతం లాంటి పురాణాల కథలు అన్నీ ఇప్పటి డైలీ సీరియల్స్ లాగా గొప్ప సస్పెన్సులో ఆపుతూ చెప్పేవారు. ఈ సీరియళ్లు శుక్రవారం పెద్దపెద్ద ఉరుముల్లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆపి "మళ్ళీ సోమవారం కలుద్దాం" అని వీక్షకుల్ని నిరాశకు, బెంగకు గురిచేసి 2 రోజులు కనుమరుగైనట్లు మాకూ జరిగేది. అటువంటి gap వచ్చిన రోజుల్లో మాకు మరో రకం class ఉండేది. తెలుగు సంవత్సరాల పేర్లు, నెలలు, ఋతువులు, నక్షత్రాలపేర్లు వల్లెవేయించేవారు. ఆ వరసలోనే మాకు తిథుల పేర్లూ, పండగలో పేర్లూ కలిపి ఒకేసారి చెప్పేవారు.
పాడ్యమి - సంవత్సరాదిపాడ్యమి, విదియ - భానువిదియ, తదియ - అక్షతదియ, చవితి - వినాయకచవితి, నాగులచవితి,....ఇలా సాగేది ఆ లిస్టు. ఈ పాఠానికి ఒక ప్రత్యేకమైన రాగం ఉండేది కూడా. పండగలతో ఆ రోజుల్లోనే అనుబంధం ఏర్పడింది నాకు. ఏ పండగకి ఆ పండగే తనదైన ప్రత్యేకత, హడావిడి కలిగి ఉంటుంది. ఒక పండగ అవ్వగానే తరువాతి పండగ ఎప్పుడా అని క్యాలెండర్ లో వెతుకుతాం. ముఖ్యంగా సెలవు దొరికే పండగల కోసం మరీ ఎదురు చూస్తాం. అవి ఏ శనాదివారాల్లోనో వస్తే డీలా కూడా పడిపోతాం. (కాని, ఇక్కడ పండగ వీకెండ్స్ లో వస్తే నిజంగా పండగ అనుకోండి).
అన్నట్టు, TV అంటే గుర్తు వచ్చింది. ఈ మధ్య ఒక చవితిపండగరోజు మా బంధువుల ఇంటికి వెళ్లాను. టీవీ లో వినాయక చవితి స్పెషల్ కార్యక్రమాల్ని ఎనౌన్స్ చేస్తున్నారు. పొద్దున్నే 'పండగ స్పెషల్' పాటల ప్రోగ్రాం (ఆ యాంకర్ మోడరన్ డ్రస్సు కాక లంగా-ఓణీ వేసుకురావటమే స్పెషల్ అక్కడ), తరువాత ఇటీవల విడుదలైన సినిమా కథా నాయికానాయకులతో ఇంటర్వ్యూ, ఆ తరువాత ఆంధ్రేతర పరిశ్రమ నుండి కొత్తగా వచ్చిన ఒక విలన్ గారితో 'స్పెషల్' పరిచయం, మధ్యాహ్నం నుండి వరసగా రెండు 'పండగ స్పెషల్ సినిమాలు' (ఈమధ్య విడుదలై అంతంతమాత్రంగా ఆడినది ఒకటి, అసలే ఆడనిది మరొకటి), ఆ తరువాత మనల్ని నిరంతరం 'అలరించే' డైలీ సీరియళ్లు మామూలుగానే. వీటన్నిటికీ వినాయక చవితితో ఉన్న సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నాను.
"అయితే మనకి cake పెడతారా?" అంది ఆశగా. "కాదమ్మా...ఉండ్రాళ్ళు పెడతారు" అన్నారాయన.
" ఉండ్రాళ్ళు అంటే ఏమిటి?"
"గుండ్రంగా ఉండే ఇడ్లీ లు" అని తాతగారి సమాధానం.
"ఇడ్లీ లా? నాకొద్దు" అంది మొహం చిరాగ్గా పెట్టి.
"తప్పమ్మా. ప్రసాదం."
"ఎవరైనా బర్త్ డే కి కేకు తినకుండా ఇడ్లీ లు తింటారా?" అని నిలదీసి సమాధానం కోసం కూడా చూడకుండా బైటకి పరుగెత్తింది ఆటల కోసం.
"ఏం చెప్తాం ఈవాల్టి పిల్లలకి?" అన్నారాయన తెల్ల మొహం వేసి.
నేనూ చిన్నగా నవ్వాను. ఆ పాప నుండి నా ఆలోచనలు మన హీరో మీదకు మళ్ళాయి....
వినాయకుడు.......
కేకు పెట్టినా పెట్టకపోయినా పిల్లలందరికీ బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఆయన బొమ్మో, విగ్రహమో కనిపించగానే పెద్దవాళ్ళు పిల్లలతో "దణ్ణం పెట్టుకో. చదువు బాగా వస్తుంది" అని చెప్తారు. అలా చెప్పినా, చెప్పకపోయినా కూడా పిల్లలకి బాగా గుర్తుండే దేవుడు వినాయకుడే. అందరు దేవుళ్ళకీ భిన్నంగా ఉంటుంది ఆయన రూపం. పెద్దపెద్ద చెవులు, చిన్నచిన్న కళ్ళు, తొండం, పెద్ద బొజ్జ, బొజ్జ మీద పాము, పక్కన ఎలుక, చేతిలో అప్పచ్చులు...వేరే ఏ దేవుడూ ఇంత ప్రత్యేకంగా కనిపించడు. బుజ్జిగా, "మనతో ఆడుకోవటానికి బాగుంటాడు" అనిపించేలా పిల్లలని నవ్వుతూ చూస్తాడు. అసలు పిల్లలకి మాటలు వచ్చీ రాని రోజుల్లోనే వాళ్ళు నేర్చుకునే మొట్టమొదటి శ్లోకం "శుక్లాంబరధరం.." తెలుగు పుస్తకం పట్టించగానే చెప్పే పద్యం "తొండము నేకదంతమును". వాటిని ముద్దుముద్దుగా పలుకుతూనే వినాయకుడికి దగ్గరవుతారు పిల్లలు.
అసలు నా రీసెర్చ్ ప్రకారం, పండగల్లో దీపావళి తరువాత చిన్నా-పెద్దా చిందులేస్తూ జరుపుకునే పండగ వినాయకచవితే. 2-3 రోజులు ముందునుంచే ఈ పండగ హడావిడి మొదలౌతుంది. ముందురోజే పోటీలు పడి మరీ పూజకి పువ్వులు, పత్రి కోసం రకరకాల ఆకులు, గుమ్మాలకి మామిడాకులు కోసుకురావటం, వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేసుకోవటం, ఉండ్రాళ్ళ కోసం రవ్వ ఆడించటం, గడపకి పసుపు, బొట్లు పెట్టి, తోరణాలు కట్టటం, పుస్తకాలకి పసుపు-బొట్టు పెట్టి పూజలో పెట్టటం...ఇలాంటి ఎన్నో పనులను ఇంట్లోవాళ్ళు గబగబా పంచేసుకుంటారు. ఎంత సరదాగా, సంబరంగా ఉంటుందో ఈ పండగ!!
ఇక్కడ ఇంకొకటి గుర్తు వస్తోంది నాకు. నేను సెకండ్ క్లాసులో ఉన్నప్పుడు భీమవరంలో మా అమ్మమ్మగారి ఇంటికి సంక్రాంతి సెలవులకి వెళ్లాను. వాళ్ళింటి దగ్గర ఉన్న సెంటర్ లో పాటల పోటీలు పెట్టారు. 2 రోజులు మైక్ లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఏం పోటీ ఉన్నా నేను పాల్గొనాలని ఉత్సాహపడేదాన్ని. నాకు సినిమా పాటలు ఏమీ రావు అప్పట్లో. అయినా పాడాల్సిందే అని పట్టు పట్టాను. నా గోలకి విసుగు వచ్చిందో, నామీద జాలి కలిగిందో కానీ మా తాతమ్మ అందరికంటే ముందర ఒప్పుకుంది.
"మీ తాత దగ్గర నేర్చుకున్న వినాయకుడి పాట పాడేయవే పోనీనూ..." అంది.
నా కళ్ళు మెరిశాయి ఆ మాటకి. "వినాయకా నిను విన బ్రోచుటకు" అనే కృతి అది. అయితే సినిమా పాటల పోటీ అంటున్నారు మైకులో.
"అది ఏం సినిమాలో పాట తాతమ్మా?"
"సినిమా పాటల కన్నా ఇదే భేషైన పాట. అసలు పండగనాడు భక్తి పాటల పోటీ పెట్టకుండా సినిమా పాటలేమిటీ........" అంటూ గుండు మీద ఉన్న పంచ చెంగుని సద్దుకుంది ముఖం చిట్లించి.
"'వినాయకవ్రతమహత్యం' అనే సినిమా లో పాట అని చెప్పు" సలహా కూడా ఆవిడే ఇచ్చి, తన ఐడియాకి తనే ఒకింత గర్వంగా నవ్వుకుంది.
తీరా స్టేజి ఎక్కేసరికి అది "వినాయకవ్రతమహత్య"మో, "వెంకటేశ్వరవ్రతమహత్య"మో మర్చిపోయాను. “వి..వె..వి..వె..వి...వె.....వినాయకవ్రతమహత్యం" అని చెప్పాను. అందరూ నవ్వి గోల గోల చేశారు. నేను ఉక్రోషంతో పాటంతా పాడేసి ఇంటికొచ్చి నిద్రపోయాను. కన్సొలేషన్ బహుమతి ఇచ్చారు నాకు. అది మా అమ్మగారు నా తరఫున అందుకున్నారు. ఏమైనా, అదొక మరపురాని సంఘటన నాకు.
కానీ పెద్దయ్యేకొద్దీ "వినాయకవ్రతంలోని మహత్యం" నిజంగా కనిపించింది. ఎందుకో నాకీ పండగ అంటే చాలా ఇష్టం. మట్టితో వినాయకుణ్ణి తయారు చేసి, పత్రి కోసుకొచ్చి పూజ చేయటం అంటే సరదా. ఆఖరికి పుస్తకం మీద పసుపుతో అందంగా శ్రీకారమో, ఓంకారమో దిద్దటం కూడా ఎంతో శ్రద్ధగా చేస్తుంటాను. ఉండ్రాళ్ళు నిజంగానే ఇడ్లీల్లా ఉన్నా, బాగుంటాయి. బర్త్ డే వంటకం కదా మరి?! మేము హైదరాబాదుకి మకాం మార్చాక మా ఇంటి దగ్గర సరైన మట్టే దొరకలేదు. ఏదో నీరసంగా, కొన్న విగ్రహం, పత్రులతోనే కార్యక్రమం కానివ్వాల్సి వచ్చింది. అయినా బుజ్జి వినాయకుడి పూజ కనుక శ్రద్ధగా, ఇష్టంగానే చేసేదాన్ని.
ఇక ఈ ఏడాది నేను ఇండియానాలో ఉన్నాను. మన ప్రాంతం కాదు, మన దేశం కూడా కాదు. పైగా ఇక్కడ ఆకు కోస్తే తప్పు, మట్టి తవ్వితే తప్పు. అయినా నన్ను సంతృప్తి పరచే మట్టి కూడా కనపడలేదు మా పెరట్లో. ఏం చేయాలా అనుకున్నాను. మా ఊరికి ఆ చివరలో ఉంది ఒక ఇండియన్ స్టోర్. తీరా అక్కడకి వెళ్ళాక అన్నీ దొరుకుతాయని గారంటీ లేదు. పండగ శనివారంనాడు వచ్చింది. ఇక్కడ జరిగే మొదటి వినాయకచవితి. పైగా మా ఆయనకీ సెలవు. ఎలాగైనా బొమ్మ తయారుచెయ్యాలని ఆలోచిస్తుండగా రెండురోజులక్రితం చేసిన చేగోడీలు గుర్తువచ్చాయి. వేడినీళ్ళలో వరిపిండి కలిపితే బాగానే రావచ్చు అనిపించింది. అసలు స్వామివారు మొట్టమొదట తయారైనదే పిండితో కదా, కాబట్టి చేసి చూద్దాం అనుకున్నాను. వరిపిండిలో కొంచెం గోధుమపిండి కూడా కలిపాను. అలా నెమ్మది నెమ్మదిగా రెడీ అవ్వడం మొదలెట్టాడు బర్త్ డే బాయ్.
ఒక గంట గడిచేసరికి తెల్లగా నిగనిగలాడుతూ బుజ్జిగా, ముద్దుగా కూర్చుని అమాయకంగా చూస్తున్నాడు నన్ను. నాకు ఇంకా ఏదో చేయాలనిపించింది. పిల్లాడి పంచకి శనగపప్పు అద్దితే ఎలా ఉంటుందీ.....అనుకున్నా. ఒక్కసారి కళ్ళుమూసుకుని , నా సామ్రాజ్యంలో ఉన్న రంగులన్నీ గుర్తు తెచ్చుకున్నా. చకచకా అన్నీ వంటింటి నుండి తెచ్చుకున్నా.
కాసేపటికి ఆయన కిరీటంలో పెసలు, ఎర్ర కందిపప్పు, మెంతులు కలిసి పచ్చలు, పగడాలు, పుష్యరాగాలై మెరిశాయి. శనగపప్పు పంచగా మారింది. శనగలు కండువాగా కప్పాయి. హారాల్లో కూడా పచ్చలు, పగడాలు కూర్చబడ్డాయి. పసుపుపచ్చని పంచకు ఆకుపచ్చని అంచు అందమిచ్చింది. సేమియా విభూతిగా, శనగగింజ కుంకుమ బొట్టుగా అమరాయి. బియ్యం గింజలు దంతాలు అయ్యాయి. ధనియాలు గొడ్డలి (ఆయుధం) హేండిల్ కాగా, జీలకర్ర చెవుల్లో అద్దబడింది. బొజ్జపై ఉండే పాము ఆవాలతో చుట్టబడింది. పక్కనే ఎలుక వాహనం కూడా యజమానితో మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంది. దాని కళ్ళు ఆవాలతో అమర్చబడ్డాయి. హీరో కళ్ళు మాత్రం చింతపండుతో తీర్చిదిద్దబడ్డాయి. ఏవో ఎన్వలప్ లను కట్ చేసి ఛత్రం తయారుచేశాను. కుడివైపు రెండుచేతుల్లో ఒకటి వరదాయక హస్తం, మరొకటి ఆయుధం. ఎడమచేతుల్లో ఒకటి కమలం పట్టుకోగా, మరొకటి ఉండ్రాన్ని పట్టుకుంది.
ఇక పాలవెల్లి ఎలా సెట్ చేయాలా అని ఆలోచించాను. నాకు దొరికిన కట్టెపుల్లలు కాయల్ని వేలాడదీస్తే విరిగిపోతాయి. అందుకే అందుబాటులో బొమ్మలు పెట్టుకునే లాంప్ స్టాండ్ ఉంటే దాన్ని నిలబెట్టాను. అది చూడటానికి ఈఫిల్ టవర్ లా ఉంటుంది. ఇక ముందురోజు సాయంత్రం పళ్ళు కొన్నాను. ఒక్కదానికీ ముచిక లేదు. ఈఫిల్ టవర్ కి బట్టల హ్యాంగర్లు తగిలించి, వాటికి దారం, ప్లాస్టర్, సాయంతో పళ్ళు వేలాడదీసాను.
ఇక పండగనాడు చేతనైనవి వండి నైవేద్యం పెట్టి 'బర్త్ డే' సెలబ్రేట్ చేశాము. ఇంటర్నెట్ పురోహితుడుగారి సహాయంతో భక్తిగా వ్రతం చేసుకున్నాం. ఇలా చాలా ఆనందంగా గడిచింది ఆరోజు. అన్నీ నిర్విఘ్నంగా జరిగాయి.
ఇదండీ 'మై ఫ్రెండ్ గణేశ' బర్త్ డే స్టోరీ !!!
This article has been published in the November-December (2010) edition of "Telugu Jyothi" magazine. You can find it in this website:
http://www.telugujyothi.com/
కామెంట్లు
nee daggara rachana sakthi undi. oohaatmakatha undi. sahajamaina samghatana kooda navvukunelaa cheppagalige prathibha undi. best of luck.