దొంగలందు తిండి దొంగలు వేరయా...!!!

"కృష్ణుడు గొప్పవాడు ఎలా అయ్యాడూ..." అంటే... "వెన్న దొంగతనం చేసి" అని సమాధానం చెప్తాను నేను. ఎందుకంటే నేనూ ఇంచుమించు ఆయన వరసలో కుర్చోవలసినంత గొప్ప తిండి దొంగని. కాకపోతే ఆయన వేరే వాళ్ళ ఇళ్ళల్లోనూ perform చేసేవాడు, నేను మా ఇంటితోనే సరిపెట్టాను. ఆయనంటే ద్వాపర యుగంలో చేసేవాడు. ఇప్పుడు కలియుగం. మంచి(చోరీ)కి రోజుల్లేవు. :( కాబట్టి శక్తివంచన లేకుండా కుదిరినంతవరకు లటక్కున కానిచ్చేదాన్ని.

చిన్నప్పుడు గోరుమీఠీలు, కొబ్బరి ఉండలు, సున్నుండలు, పాలకోవాలు..ఇలా ఏమి చేసినా మా అమ్మగారి estimation కన్నా చాలా ముందుగా అవి ఖాళీ ఐపోతూ ఉండేవి. మాకు మామూలుగా snacks time లో పెట్టేది కానిచ్చి, మళ్ళీ కృష్ణభగవానుడు పూనినప్పుడు ఇంకొన్ని లాగిచ్చేదాన్ని. ఇక గులాబ్ జామ్ అయితే చెప్పక్కర్లేదు. నోట్లో వేసుకోగానే కమ్మగా కరిగిపోయే ఈ అమృతం ఎవరికి నచ్చదు చెప్పండి? ఇక నేను ఆగగలనా?

ఒకసారి అయితే చాలా తగ్గాయి గిన్నెలో. ఇంక మా అమ్మగారు నన్ను ఏమి అనాలో అర్థం కాక, అటు నుంచి విషయాన్ని నరుక్కొచ్చారు. ఆ గిన్నె తెచ్చి హాల్లో టీవీ చూస్తున్న నా ముందు పెట్టి, "ఇవి కూడా తినేసేయ్" అన్నారు. "నిండా మునిగినవాడికి చలి ఏమిటి" అన్నట్లు నేను చాటుగా తిన్నప్పుడే దెబ్బలకి తెగించేశాను. ఈవిడ చూస్తే కొట్టకుండా మిగిలినవి కూడా లాగించమంటున్నారు. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. Offer మాత్రం మాంచి నోరూరించేది. కానీ నిజం కాదని అర్థం అవుతోంది. తడబడుతూనే "వద్దు" అన్నాను. "పరవాలేదమ్మా...తమ్ముడికి అక్కర్లేదు, నాన్నగారికి అక్కర్లేదు, నాకూ అక్కర్లేదు. తినేసేయ్" అన్నారు. ఇప్పుడు విషయం స్పష్టం ఐపోయింది. అది కోపమే. తరువాత ఒక గంట ఆవిడ నాతో మాటలు మానేయటం, నేను sorry చెప్పటం...మామూలే అనుకోండి!

ఇంకొకసారి నాకు నెయ్యి తినాలి అనిపించింది. చిన్న గిన్నెలో ఉన్నది కాకుండా పాత horlicks సీసాలో ఎక్కువ నెయ్యి ఉండేది. అందులో నుంచి అయితే తెలియదు కదా? పన్నాగం పన్నటం ఆలస్యం...సీసా తెరిచి చెంచాతో చక్కగా కానిచ్చా...ఇక చెంచా గుర్తులు కనిపించకుండా manage చేయటం ఎలా? ఆ నేతిని కరిగిస్తే మళ్ళీ హాయిగా పైన లెవెల్ అయిపోతుంది. అంతే....ఆ సీసా తెచ్చి నేరుగా gas stove మీద పెట్టి ఇలా వెనక్కి తిరిగానో, లేదో....టపటపమని శబ్దం...చూస్తే వేడికి సీసా పగిలిపోయి, నెయ్యి స్టవ్ అంతా ఒలికిపోయింది. నా గుండె ఆగినంత పని అయ్యింది. మా అమ్మగారు స్కూల్ నుండి వచ్చే టైం ఐపోతోంది. ఇక అబద్ధం ఆడక తప్పదు.

నేను ఎంత తుడిచినా, తెలియకుండా ఉండదుగా? ఏమిటని అడిగారు.
"ఇడ్లీ లో నెయ్యి వేసుకుందామని తీస్తుంటే జారిపోయింది". సిద్ధంగా పెట్టుకున్న అబద్ధం చెప్పేశాను. లక్కీగా ఆరోజు నేను తినటానికి ఆవిడ ఇడ్లీలు పెట్టి వెళ్ళారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహజసిద్ధమైన 'detective తల్లి' తెలివితేటలతో కనిపెట్టేశారు.
నేను ఆవిడ వైపూ, స్టవ్ వైపూ టెన్షన్ గా చూస్తున్నాను.
"నెయ్యి తిని, తెలియకూడదని కరిగించటం కోసం స్టవ్ మీద పెట్టావు, అది పగిలిపోయింది...అంతేనా?" అన్నారు చురుగ్గా కళ్ళలోకి చూస్తూ. నా పై ప్రాణాలు పైకే పోయాయి.

ఇంకా నా ఖాతాలో బియ్యం, మరమరాలు, అటుకులు, గుల్ల శనగపప్పు, వేరు శనగపప్పు, జీడిపప్పు, పంచదార, బెల్లం, పటికబెల్లం, కిస్మిస్,....అబ్బో..చెప్పుకుంటూ పోతే లిస్టు తరగదు.

అలా స్వీటూ, హాటూ, వండినదీ, వండనిదీ, పెద్దదీ, చిన్నదీ....ఇలాంటి తారతమ్యాలు లేకుండా సాగింది నా '(దొంగ)పనికి ఆహారం' ప్రహసనం!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్