ఇదీ అసలు కథ

కృత యుగంలో అమృతం కోసం దేవతలు క్షీర సాగర మథనం చేయటానికి తలపెట్టారట. వాళ్ళ ఒక్కరి వల్లా కాక రాక్షసుల సహాయం అడిగారట. వాసుకి అనే పాము, మంధర పర్వతం, కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి సహాయంతో పని మొదలు పెట్టారట. ఆ ప్రయత్నంలో చివరకి అమృతం పుట్టిందిట.

అది మాకూ కావాలని గొడవపెట్టిన రాక్షసులని మోహిని రూపంలో వచ్చిన విష్ణుమూర్తి మాయ చేసి, దేవతలకి అమృతాన్ని అచ్చంగా ఇచ్చేశారట. మాయకు లోనైన దానవులూ సంతృప్తి పడి ఇంటి దారి పట్టారట. ఇదంతా మౌనంగా చూసిన మనుషులు ఒక మీటింగ్ పెట్టుకున్నారట.

అంతా అయ్యాక ఒక ప్రతినిధిని ఎన్నుకుని విష్ణుమూర్తి దగ్గరకు పంపారట. సినిమాల్లో చూపించే యూనియన్ లీడర్ లాగా ఆ 'మనిషి' రెండు పిడికిళ్ళూ విడివిడిగా బిగించి, కళ్ళలో పట్టుదలతో, మనసు నిండా కర్తవ్య దీక్షతో విష్ణువు దగ్గరకు వెళ్ళాడుట. "స్వామీ! రాక్షసులు అంటే విలన్లు కనుక మాయ చేసేశావ్. దేవతలు హీరోలు కనుక బాగానే అమృతం ముట్టజెప్పావ్. మరి నీ నాటకంలో 'supporting cast' చేస్తున్న మేము ఏం తప్పు చేశాము? మాకూ కాస్త ఇస్తే నీ సొమ్ము ఏం పొయిందయ్యా?" అని మనసులోని మాట విన్నవించుకున్నాడట.

విష్ణుమూర్తి ఎప్పటిలాగే ఒక చిన్న నవ్వు నవ్వి, "వెర్రివాడా! మీకు నేను అన్యాయం చేస్తానా? ఒక రహస్యం చెప్తాను విను. నాకు దేవతల కన్నా మీ మానవులంటేనే అభిమానం ఒకింత ఎక్కువయ్యా. అందుకే అంతంతమాత్రంగా ఉండే అమృతాన్ని వాళ్లకి ఇచ్చేశాను. అసలైనది మీ మానవుల కోసం దాచి ఉంచాను" అన్నాడట. మనిషి కళ్ళు ఆనందంతో తడిశాయిట. "అవునా స్వామీ? అల్పులం. గ్రహించలేకపోయాము. అయితే అది నాకు ఇవ్వండి. తీసుకెళ్ళి మా వాళ్లకి అందరికీ పంచుతాను" అన్నాడట.

"లేదు చిట్టి తండ్రీ...ఎంత ఎదురు చూస్తే అంత మంచిది. అది మనుషులకు ఇప్పుడు కాదు, త్రేతా యుగం, ద్వాపర యుగం ఐపోయాక కలియుగంలో అందుతుంది" అన్నాడట. మనిషి రవ్వంత ఫీల్ అయినా మళ్ళీ వెంటనే సర్దుకుని, "చిత్తం ప్రభూ! మహా ప్రసాదం. ఇంతకీ అమృతాన్ని మించిన ఆ పదార్ధం పేరు చెప్పారు కాదు" అన్నాడట.

పరమాత్మ చిద్విలాసంగా "ఐస్ క్రీం" అన్నాడట.


















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్