పెళ్ళివారమండీ

'పెళ్లి' అంటే....మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, పచ్చటి పందిరులు, ముచ్చట్లు, మురిపాలు...ఇలా ఉత్సాహపూరితమైన వాతావరణం మన కళ్ళ ముందు కనపడుతుంది. నా మటుకు నాకు బంధువర్గంలో ఏదైనా పెళ్లి ఉంది అని తెలియగానే ఎంతో హుషారు వచ్చేది చిన్నప్పటి నుంచి.

నాకు ఊహ తెలిశాక మా మామయ్యల పెళ్ళిళ్ళు అయ్యాయి. కానీ ఆ వయసులో నేను పెళ్ళికి వచ్చిన పిల్లల్లో కొత్త వాళ్ళతో స్నేహం కలుపుకోవటం, అందరినీ వెంట తిప్పుకుంటూ రకరకాల ఆటలు కనిపెట్టి మరీ ఆడటం...ఈ రాచకార్యాలలో మునిగిపోయేదాన్ని. ఒకసారి మా అమ్మగారి కజిన్ పెళ్లి అయ్యింది. నేను మా అమ్మమ్మగారి దగ్గర కూర్చుని, ఆటలకి వెళ్లనివ్వట్లేదు అని రుసరుసలాడుతూ పెళ్లి చూస్తున్నాను. వెనుక వరుసలో కూర్చున్న ఒక పెద్దావిడ మా అమ్మమ్మ గారిని పరిచయం చేసుకుంటూ, "మీరు ఆడపెళ్లివారా, మగపెళ్లివారా?" అని అడిగారు. మా అమ్మమ్మగారు "మగపెళ్లివారం అండీ" అన్నారు. ఆ సమాధానం విని నేను ఎంత ఆశ్చర్యపోయాను అంటే, నా ఆటల విషయం మర్చిపోయి, కళ్ళు పెద్దవి చేసి, రెండు చేతులతో నోరు గట్టిగా మూసుకుని, మా అమ్మమ్మగారి వైపు చూస్తూ ఉండిపోయాను. తరువాత అందరూ అక్షింతలు వేస్తూ busy గా ఉండటం చూసి, ఇక ఉండబట్టలేక, ఆవిడ చెంగు పట్టుకుని దగ్గరకు లాక్కుని చెవిలో అడిగాను. "మనం ఆడపెళ్లివాళ్ళం కదా? అలా ఎందుకు చెప్పావ్?" అని. ఆడవాళ్ళం కనుక 'ఆడ'పెళ్లివాళ్ళం అనుకున్నాను నేను. పైగా తెలిసి, తెలిసి ఆవిడ అంత దారుణమైన ప్రశ్న ఎందుకు అడిగారా? అన్నది నా ఆశ్చర్యానికి అసలు కారణం. "మనం మగపెళ్లివారం...పెళ్ళికొడుకు మనకి మావయ్య కదా?" అని చెప్పటంతో సమాధానపడ్డాను.

ఆ తరువాత మళ్ళీ మా మేనత్త పిల్లల పెళ్ళిళ్ళు జరిగాయి. బావ పెళ్లి, వదిన పెళ్లి ఒక నెల తేడాలో జరిగాయి. అప్పటికి కాస్త పెళ్లి తంతు మీద, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వేషధారణల మీద ఆసక్తి ఏర్పడింది. అంతా బాగా గమనించాను. ఆ పెళ్ళిళ్ళ నుండి ఇంటికొచ్చాక ఒక పుస్తకం మీద ఒక పేజిలో పెళ్ళికొడుకు బొమ్మ, ఒక పేజిలో పెళ్ళికూతురి బొమ్మ గీశాను. ఆ పుస్తకం మా నాన్నగారి కంటపడింది. ఎక్కడ తిడతారో అని ఒకటే టెన్షన్. నన్ను, మా తమ్ముణ్ణి పిలిచి ఎంక్వైరీ చేశారు. నేను ఎందుకో భయపడి చెప్పనేలేదు. అయినా నేనే అని అమ్మ,నాన్నగారు కనిపెట్టేశారు. పాపం ఏమీ అనలేదు.

అప్పటి నుంచే నా పెళ్లి గురించి కలలు కనేవారు వాళ్ళు అని ఇప్పుడు తలచుకుంటే భలే feeling కలుగుతుంది.
లవ్ యు మాం అండ్ డాడ్!!!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీతో 34 ఏళ్ళు - మీపై 10 ఆరోపణలు

గృహకార్య సహాయక సామ్రాజ్ఞి

మా మల్లి బాబాయ్