చిత్రం...హయ్యారే విచిత్రం!!
ఒకప్పుడు సినిమా చూడాలి అంటే అణాకి టిక్కెట్టు ఉండేదిట. అది కూడా కుదరక, సినిమాకి వెళ్ళిన నలుగురూ తలొక అరగంటా ఒకటే టిక్కెట్టు మీద చూసి, తరువాత కూర్చుని కథలోని భాగాల్ని కూడదీసి చెప్పుకున్న సందర్భాలు కూడా ఉండేవిట. ఒక్కొక్క సైకిలు మీద ఇద్దరు-ముగ్గురు కలిసి కూర్చుని బోలెడంత దూరం నిర్విరామంగా తొక్కుకుంటూ వెళ్లి చూసి, అదే ఉత్సాహంతో తిరిగి తొక్కుకుంటూ వచ్చేవారట. ఎక్కడో టౌన్లలో మాత్రమే టాకీస్ ఉండేవిట!
ఇవన్నీ వింటుంటే ఏదో వేరే లోకం తాలూకు కబుర్లలా ఉంటాయి. మనకి తెలిసిన లోకంలో తీరే వేరు! చిన్నప్పుడు అయితే newspaper లోని జిల్లా ఎడిషన్లో ఏ హాల్లో ఏ పిక్చర్ ఉందో చూసుకుని, హాలు అందచందాల్ని బట్టి, ఆడే పిక్చరు టాకుని బట్టి నిర్ణయించుకుని వెళ్లి చూసి ఆనందించేవాళ్ళం. ఇప్పుడు అదీ లేదు. లైన్లో కూడా నుంచునే పని లేకుండా ఇంటర్నెట్లోనో, ఫోన్లోనో బ్యాంకు కార్డుతో టిక్కెట్లు కొనేసుకుని, సరిగ్గా ఆ టైముకి వెళ్లి, పాప్ కార్న్ పట్టుకుని నములుతూ చూసేస్తున్నాం. ఆ పాప్ కార్న్ కూడా చిన్నప్పుడు రూపాయ్ ఉండేది. ఇప్పుడు పదిహేనుకి తక్కువకి రావట్లేదు!
అదివరకు నేల టిక్కెట్టు, బెంచీ టిక్కెట్టు, కుర్చీ టిక్కెట్టు అని ఉండేవట. తెరకి దగ్గరా ఉన్నవాళ్ళు నేల మీద కూర్చుని తలలు ఎత్తి చూస్తే, వాళ్ళ వెనుక చెక్క బెంచీల్లో కొందరు కూర్చునేవారట. ఆ వెనుక (తెరకి దూరంగా) స్తోమత కలవారు కూర్చుని దర్జాగా చూసేవారట. నా చిన్నప్పుడు కూడా ఈ పేర్లు ఉన్నాయి కానీ..ఏమిటో! నేల, బెంచీ, కుర్చీ...అన్ని టిక్కెట్లకీ కుర్చీలే ఉండేవి...ఎటొచ్చీ తెరకీ, తలకీ దూరమే తేడా పాపం! ఆ తరువాత నెమ్మదిగా 'బాల్కనీ' అనే 'క్లాస్' వచ్చింది. మరో పది రూపాయలు పెంచి ఈ 'క్లాస్' టిక్కెట్లు అమ్మితే పాపం కొనేసుకునేవారు(రం). అయితే అది place కలిసిరావటం కోసం హాలు యాజమాన్యం వేసుకున్న పథకం అని తెలిసేది కాదు.
హాలుకి AC ఉంటే టిక్కెట్టు ఎక్కువ ఉండేది. పోనీలే, వేసంకాలం ఎండలో పడి వెళ్తాం, చల్లగా కూర్చుని చూద్దాం అనుకుని వెళ్తే, మొదటి పావుగంట, చివరి పావుగంట అది ఆన్ చేసేవారు. దర్శకులు ఎలా తీసినా మునిగిపోయి చూసేసే ప్రేక్షకుల సినీభక్తిపై హాలువారికి ఉన్న నమ్మకం అలాంటిది మరి! ఇక డీటీయస్ పెంచిన టిక్కెట్టు ధర సంగతి చెప్పనే అక్కర్లేదు.
అయితే, ఏ కాలంలో అయినా, ఏ సమయంలో అయినా, ఏ దేశంలో అయినా, ఎంత ఖర్చు అయినా...మనం సినిమా చూడకుండా ఉండలేం..అందుకే మనవాళ్ళు దీన్ని "చిత్రం" అన్నారేమో! నాకూ 'చిత్రం' తో చిత్రవిచిత్రమైన అనుభవాలు ఉన్నాయి.
నేను school age లో ఉండగా ఒక వేసంకాలంలో ఒక ఫంక్షన్ కి అందరు బంధువులం కొవ్వూరు దగ్గరున్న తోగుమ్మి(మా స్వగ్రామం) లో కలిశాం. మా నాన్నమ్మగారి మనవల్లో ఒక పదిమంది మిగిలాం ఆ ఫంక్షన్ ఐపోయాక. అందరం కలిసి రాజమండ్రిలో మ్యాటినీకి వెళ్లి వస్తామని బయల్దేరాం. ఇంట్లో పెద్దవాళ్ళు "ఎటూ కాని వేల వెళ్తే ఎలా? భోజనం మాట ఏమిటి?" అన్నా వినే స్థితిలో లేదు మా మూకుమ్మడి ఉత్సాహం. ఇక చెప్పలేమని అర్థమై, వాళ్ళు పులిహోర కలిపి కట్టి ఇచ్చారు. దాన్ని వద్దని వాదించే సమయం కూడా లేదు. అసలే పట్నం వెళ్ళటానికి టైం పడుతుంది. హడావిడిగా ఆ ప్యాకెట్ తీసుకుని, మా బావ వాళ్ళ లీడర్ షిప్ లో పిల్లల ముఠా అందరం ఆటో ఎక్కి, గోదావరి బ్రిడ్జి మీద నుండి రాజమండ్రి చేరుకున్నాం.
అక్కడ రంభ-ఊర్వశి-మేనక అని సినిమా కాంప్లెక్స్ ఉంది. 'నరసింహ', 'రాజా', 'ఇద్దరు మిత్రులు' ఆడుతున్నాయి వాటిలో. అందరం కరడు కట్టిన 'మెగా' అభిమానులం కావటంతో, 'ఇద్దరు మిత్రులు' టికెట్ కౌంటర్ దగ్గరకి పరుగెత్తాం. కానీ అప్పటికే ఆలస్యం ఐపోయింది. టికెట్లు ఐపోయి ఆట కూడా మొదలైపోయింది. సహజంగానే, చూడకుండా వెనక్కి తిరిగి వెళ్ళటానికి మనసులు ఒప్పుకున్నాయి కాదు. ఇక మా చిన్న బావ మా ఇంటికి ఫోన్ చేసి, సాయంత్రం ఆట చూసి వస్తామనే విషయం గబగబా చెప్పేశాడు. ఏదో కొనుక్కు తినేసి, సాయంకాలం వరకు ఆగి, ఈవెనింగ్ షోలో పదిమందీ ఒకే వరసలో కూర్చున్నాం. మా పెద్దక్క చేతిలో పులిహోర ప్యాకెట్ ఇంకా అలాగే ఉంది.
ఇంటర్వెల్లో మా పెద్ద బావ అందరికీ ఐస్ క్రీములు కొన్నాడు. చక్కగా అవి 'గుటకాయస్వాహా' చేసేశాం. ఆ కప్పుల్లో పులిహోర తినమని లీడర్లలో ఎవరో ఆర్డరు జారీ చేశారు. ఆకళ్ళతో ఉన్నాం కనుక, ముందూ-వెనకా చూడకుండా ఒప్పుకున్నాం. మా పెద్దక్క గరిటెతో ఐస్ క్రీం కప్పుల్లో వడ్డిస్తుంటే, మేము బుద్ధిగా ఆ ఐస్ క్రీం పుల్లలతోనే తినేస్తున్నాం. ఆ కప్పుల్లో ఎంత పడుతుంది? పాపం పెద్దపిల్ల అవ్వటం వల్ల తను తినకుండా మాకు మళ్ళీ, మళ్ళీ వడ్డిస్తోంది మా అక్క. ఇక ఆట మొదలౌతుంధనో, ఏమో జనమంతా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మా అందరి కన్నా బాబాయి కూతురు చిన్నది. వరసలో ఈ చివర కూర్చుంది. ఆ చివర పులిహోర పంపిణీ జరుగుతోంది. తన కప్పులోది అవ్వగానే గట్టిగా "బాలక్కా! నాకు ఇంకొంచెం పులిహోర కావాలి" అని అరిచింది. అంతే!! ఒక్కసారిగా మేము అందరం ఉలిక్కిపడ్డాం. ఎవరం తల ఎత్తి చూడలేదు. కానీ హాల్లో అన్ని తలలూ మా వైపు తిరిగాయి అని కచ్చితంగా ఫిక్స్ అయ్యాం. లైట్లు ఆగి ఆట మొదలయ్యే వరకు సీట్లో వీలైనంత కిందకి ఒదిగి దాక్కుని కూర్చున్నాం.

కామెంట్‌లు